
ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శి
సూళ్లూరుపేట :మండలంలోని కేసీఎన్‌ఎన్‌గుంట, కుదిరి గ్రామాలకు కార్యదర్శిగా పనిచేస్తున్న ఎస్.శ్రీరామ్ ఇంటిపై మంగళవారం ఏసీబీ అధికారులు దాడి చేశారు. ఓ వ్యక్తి నుంచి లక్ష రూపాయల లంచం తీసుకుంటుండగా పక్కా ప్రణాళికతో ఏసీబీ అధికారులు దాడిచేసి పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ ఆర్‌వీఎస్‌ఎన్ మూర్తి కథనం మేరకు సూళ్లూరుపేట పట్టణానికి చెంది మస్తానయ్య కేసీఎన్ గుంట సమీపంలో 47 సెంట్ల భూమిని 2009లో అప్పటి సర్పంచ్, కార్యదర్శితో అప్రూవల్ చేయించుకుని లేఅవుట్ ప్లాట్లు విక్రయించారు.
కడపట్ర, దామరాయ, కొరిడి పంచాయతీల కార్యదర్శిగా పనిచేస్తున్న శ్రీరామ్‌ను కేసీఎన్‌గుంట, కుదిరి గ్రామాలకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. కేసీఎన్‌గుంట లేఅవుట్ విషయంలో శ్రీరామ్ మస్తానయ్యను వేధించడం ప్రారంభించారు. నిబంధనలు పాటించకుండా లేఅవుట్ వేశారని, ఇందులో నిర్మాణాలు చేపడితే కూల్చివేస్తామని బెదిరిస్తూ వచ్చారని తెలిపారు. నిబంధనలకు అనుకూలంగా లే అవుట్ చేసుకోవాలని, లేదంటే క్రిమినల్ కేసులు పెడతామని చెప్పారని పేర్కొన్నారు.
దీంతో మస్తానయ్య శ్రీరామ్‌తో బేరసారాలకు దిగారు. రూ. 3.50 లక్షలు డిమాండ్ చేశారని, చివరకు రూ. 2.50 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. మంగళవారం ఉదయం లక్ష రూపాయలు ఇచ్చేలా మాట్లాడుకున్నారని వెల్లడించారు. తీవ్రమైన వేధింపులకు గురైన మస్తానయ్య ఏసీబీని ఆశ్రయించారని చెప్పారు. మస్తానయ్య ఇచ్చిన డబ్బును శ్రీరామ్ బ్యాగ్‌లో పెట్టుకున్న వెంటనే తాము ఇంట్లోకి వెళ్లి పట్టుకున్నామని వివరించారు.
దాడి చేసే సమయంలో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులను సాక్షులుగా తీసుకొచ్చామని చెప్పారు. పట్టుబడిన నగదుతో శ్రీరామ్‌పై కేసు నమోదు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ దాడిలో ఏసీబీ సీఐలు ఎన్.శివకుమార్‌రెడ్డి, ఎం కృపానందం, సిబ్బంది పాల్గొన్నారు.