
ఏసీబీ వలలో మంచాల ఏఓ
ఫర్టిలైజర్ దుకాణం లెసైన్స్‌కు రూ. 2 వేలు లంచం తీసుకుంటూ మంచాల ఏఓ(అగ్రికల్చర్ అధికారి) లావణ్య ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.
మంచాల: ఫర్టిలైజర్ దుకాణం లెసైన్స్‌కు రూ. 2 వేలు లంచం తీసుకుంటూ మంచాల ఏఓ(అగ్రికల్చర్ అధికారి) లావణ్య ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఈ సంఘటన సోమవారం చోటుచేసుకుంది. ఏసీబీ డీఎస్పీ ఎం.ప్రభాకర్ కథనం ప్రకారం.. మండల పరిధిలోని ఎల్లమ్మ తండాకు చెందిన యువకుడు సపావట్ దేవరాంనాయక్ ఆరు నెలల క్రితం ఫర్టిలైజర్ దుకాణం కోసం అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు.
అధికారులకు లెసైన్స్ సిఫారసు చేసేందుకు స్థానిక వ్యవసాయ శాఖ అధికారి లావణ్యను సంప్రదించగా గతేడాది అక్టోబర్ 14న రూ. 4 వేలు లంచం తీసుకుంది. నిబంధనల ప్రకారం దేవరాంనాయక్ సభ్యత్వం కోసం రూ.1250, ఎన్‌ఎస్‌సీ కోసం రూ. 1000, విత్తనాల కోసం రూ.50, మందుల కోసం రూ. 300 అధికారులకు డీడీ రూపంలో చెల్లించాడు.
తిరిగి టిన్ నంబర్ సర్టిఫికెట్ కోసం వెళ్లగా ఏఓ మరో రూ. 4 వేలు ఇవ్వాలని స్పష్టం చేసింది. తాను రూ. 2 వేలు ఇస్తానని దేవరాంనాయక్ చె ప్పి ఈనెల 2న నగరంలోని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై నిఘా వేసిన అధికారులు ఏఓ లంచం కోసం డిమాండ్ చేయడం నిజమని నిర్ధారించుకున్నారు.
ఏసీబీ డీఎస్పీ ఎం.ప్రభాకర్ నేతత్వంలో రంగంలోకి దిగారు. అధికారులు దేవరాంనాయక్‌కు రసాయనాలు పూసిన రూ.2 వేలు ఇచ్చారు. సదరు డబ్బు ఆయన సోమవారం ఏఓ లావణ్యకు ఇస్తుండగా అక్కడే మాటువేసిన ఏసీబీ ఆమెను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు.
పక్కా వ్యూహంతో..
ఏసీబీ అధికారులు ఏఓ లావణ్యను పక్కా వ్యూహంతో పట్టుకున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు మంచాల వ్యవసాయ శాఖ కార్యాలయానికి చేరుకున్నారు. ఏఓ బండలేమూర్‌లో రైతులతో సమావేశం ముగించుకొని మధ్యాహ్నం ఒంటిగంటకు ఆఫీస్‌కు వచ్చారు. దేవరాంనాయక్ ఆమెకు రూ. 2 వేలు ఇచ్చాడు. క్షణాల్లోనే ఏసీబీ అధికారులు అక్కడికి వచ్చి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఏఓ లావణ్య నుంచి రూ. 2 వేలు స్వాధీనం చేసుకున్నారు. రాత్రి 7 గంటల వరకు వ్యవసాయ శాఖ కార్యాలయంలోనే ఉండి వివరాలు సేకరించారు. కాగా ఏసీబీ అధికారులు నగరంలోని వైదేహినగర్‌లో ఉన్న ఏఓ ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు. ఏసీబీ సీఐ సునీల్, వెంకట్‌రెడ్డి, లక్ష్మి, ఏసీబీ సిబ్బంది ఉన్నారు.
అవినీతిపరుల భరతం పట్టండి: ఏసీబీ డీఎస్పీ ప్రభాకర్
అవినీతిని అరికట్టేందుకు అందరూ చైతన్యవంతం కావాలి. ప్రభుత్వ అధికారులు సర్కార్ నుంచి వేతనాలు తీసుకుంటున్నారు. వారికి లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. జనం నిర్భయంగా అవినీతిపరుల సమాచారం 9440446140 నంబర్‌కు ఫోన్ చేసి చెప్పండి. వారి భరతం మేం పడతాం.
గవర్నమెంట్ అధికారికి డబ్బులెందుకు ఇవ్వాలి..?
నేను ఎంటెక్ చేశాను. ప్రస్తుతం నిరుద్యోగిని. గ్రామంలో ఫర్టిలైజర్ దుకాణం పెట్టుకునేందుకు అధికారులకు దరఖాస్తు చేసుకున్నాను. ఏఓ లావణ్యకు గతంలో రూ. 4వేలు లంచం ఇచ్చాను. తిరిగి మరో రూ. 4 వేలు ఇవ్వాలని వేధించింది. చేసేది లేక ఏసీబీని ఆశ్రయించాను. గవర్నమెంట్ అధికారులకు లంచాలు ఎందుకు ఇవ్వాలి. వారు సర్కార్ నుంచి వేతనాలు తీసుకోవడం లేదా...?
- బాధితుడు, సపావట్ దేవరాంనాయక్