లంచం కేసులో జైలుపాలైన నేవీ అధికారి
అమెరికా నౌకాదళానికి చెందిన ఉన్నతస్థాయి అధికారి లంచం కుంభకోణంలో పట్టుబడి కటకటాల పాలయ్యాడు. ఓ మలేషియన్ ఢిఫెన్స్ కాంట్రాక్టరుకు విలువైన సమాచారం అందించిన కేసులో డానియల్ డుసెక్‌కు కోర్టు నాలుగేళ్ల జైలుశిక్ష విధించింది. ఓ లగ్జరీ హోటల్లో వేశ్యల సేవలు అందుకునేందుకు గాను ఎక్స్చేంజి ఆఫర్‌లో సమాచారాన్ని అందించడంతో సదరు అధికారి ఊచలు లెక్కపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది.
డుసెక్‌కు శిక్షలో భాగంగా 70,000 డాలర్ల జరిమానాతోపాటు నౌకాదళానికి 30,000 డాలర్ల నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఇప్పటివరకూ శిక్ష పడ్డ అమెరికాకు చెందిన సైనికాధికారుల్లో లంచం కుంభకోణంలో పట్టుబడ్డ డుసెక్ అత్యధిక ర్యాంక్ లో ఉన్న అధికారి. కాలిఫోర్నియాలోని శాండియాగోలో 46 నెలల పాటు జైలుశిక్షను విధిస్తూ న్యాయమూర్తి జానిస్ సమ్మర్టినో ఉత్తర్వులు జారీ చేశారు.
హోటళ్లకు సమాచారం అందించి, వేశ్యల సేవలు అందుకోవడం కూడా లంచం పరిధిలోకి వస్తుందంటూ అనూహ్య తీర్పును ఇచ్చిన కోర్టు... డుసెక్ కు జైలు శిక్షతోపాటు జరిమానా విధించింది. 49 ఏళ్ల డుసెక్.. జనవరి 2015న తాను లంచం తీసుకున్నట్లు అంగీకరిస్తూ కోర్టు ముందు క్షమాపణలు కోరాడు.