విశాఖపట్టణం: ఇంటి నంబరు కేటాయించేందుకు లంచం తీసుకుంటూ మున్సిపల్ అధికారి ఏసీబీకి చిక్కాడు. విశాఖ నగరం కంచరపాలేనికి చెందిన వెంకట బాలసూర్యప్రకాశ్ కొత్తగా ఇల్లు కట్టుకున్నాడు.
ఆ ఇంటికి నంబరు కేటాయించాలంటూ అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు. ఇందుకోసం ట్యాక్స్ కలెక్టర్ జి.కోటేశ్వరరావు రూ.6,500 డిమాండ్ చేశాడు. నాలుగు రోజుల క్రితం సూర్యప్రకాశ్ రూ.4 వేలు ఇచ్చారు. మిగతా రూ.2,500 ఇచ్చే క్రమంలో ఆయన ఏసీబీ అధికారులకు సమాచారం అందించాడు. గురువారం సాయంత్రం కోటేశ్వరరావుకు ఆయన కార్యాలయంలో డబ్బు అందజేస్తుండగా ఏసీబీ డీఎస్పీ కె.రామకృష్ణ ప్రసాద్ నేతృత్వంలోని అధికారులు వలపన్ని పట్టుకున్నారు.