
ఖైదీ నంబర్ 1779
ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్‌సన్‌కు లంచం ఇవ్వజూపిన కేసులో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి జైలుపాలయ్యారు.
చంచల్‌గూడ జైలుకు రేవంత్ తరలింపు
ఓటుకు నోటు కేసులో 14 రోజుల రిమాండ్
మరో ఇద్దరికీ విధించిన ఏసీబీ కోర్టు..
చంచల్‌గూడ జైలుకు నిందితులు
హైసెక్యూరిటీ బ్యారక్‌ను కేటాయించిన అధికారులు
జడ్జి అనుమతితో ఎమ్మెల్సీ పోలింగ్‌కు హాజరు
బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ
హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్‌సన్‌కు లంచం ఇవ్వజూపిన కేసులో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి జైలుపాలయ్యారు. రేవంత్, ఇతర నిందితులకు ఏసీబీ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న రేవంత్‌రెడ్డి, బిషప్ సెబాస్టియన్ హ్యారీ, రుద్ర ఉదయ్‌సింహను సోమవారం ఉదయం ఏసీబీ ప్రత్యేక కోర్టు జడ్జి ఎదుట ఆయన నివాసంలో హాజరుపరిచారు. వీరికి రిమాండ్ విధించిన తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు జడ్జి అనుమతితో రేవంత్‌రెడ్డిని అసెంబ్లీకి తీసుకెళ్లగా, మిగతా ఇద్దరినీ పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. దాదాపు రెండు గంటలపాటు అసెంబ్లీలో గడిపిన రేవంత్ పోలీసుల ఒత్తిడి మేరకు ఓటుహక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన్ని కూడా జైలుకు తరలించారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 12తోపాటు భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 120(బి), 34 కింద కేసు నమోదు చేసినట్లు ఏసీబీ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. మరోవైపు బెయిల్ మంజూరు చేయాలంటూ రేవంత్ తరఫు న్యాయవాదులు సోమవారం మధ్యాహ్నం ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వాదనలు వినిపించేందుకు తమకు గడువు కావాలని ఏసీబీ తరఫు న్యాయవాది కోరడంతో జడ్జి లక్ష్మీపతి విచారణను మంగళవారానికి వాయిదా వేశారు.
ఆధారాలు మాయం చేస్తారు: ఏసీబీ
రేవంత్‌రెడ్డిసహా ఇతర నిందితులు బయట ఉంటే ఆధారాలను తారుమారు చేయడంతోపాటు వాటిని మాయం చేస్తారని, అలాగే సాక్షులను బెదిరించి ప్రభావితం చేసే అవకాశముందని ఏసీబీ డీఎస్పీ అశోక్‌కుమార్ రిమాండ్ రిపోర్టులో అనుమానం వ్యక్తం చేశారు. ఈ కేసులో అనేక మంది సాక్షులను విచారించాల్సి ఉందని పేర్కొన్నారు. నిందితులను 15 రోజులపాటు రిమాండ్‌కు తరలించాలని కోరారు. ‘‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయాలంటూ రేవంత్‌రెడ్డి తనను ప్రలోభాలకు గురిచేస్తున్నారనంటూ స్టీఫెన్‌సన్ గత నెల 28న మధ్యాహ్నం 3 గంటలకు ఫిర్యాదు చేశారు. మతియాస్ జెరూసలేం అనే వ్యక్తి తన దగ్గరికి వచ్చి... రూ. 2 కోట్లు తీసుకుని ఎవరికీ ఓటు వేయకుండా ఉండాలని, ఎన్నికల సమయంలో దేశంలో ఉండొద్దని లేదా రూ. 5 కోట్లు తీసుకుని టీడీపీకి ఓటు వేయాలని కోరినట్లు ఫిర్యాదులో తెలిపారు. దీంతో సౌత్ లాలాగూడలోని పుష్పనిలయం దగ్గర ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి మాటువేశాం. 4.40 గంటలకు ఏపీ 09 సీవీ 9939 వాహనంలో రేవంత్‌రెడ్డి, బిషప్ సెబాస్టియన్ వచ్చారు.
కొద్దిసేపటి తర్వాత రుద్ర ఉదయ్‌సింహ మరో వాహనంలో డబ్బు సంచితో అక్కడికి చేరుకున్నారు. రేవంత్‌రెడ్డి సూచన మేరకు డబ్బు సంచిని తెరిచి రూ. 50 లక్షలను టీపా య్‌పై పెట్టారు. మిగిలిన రూ.4.50 కోట్లను ఓటు వేసిన తర్వాత ఇస్తామని తెలిపారు. ఇదంతా వీడియోలో రికార్డయింది. మధ్యవర్తుల సమక్షంలో లంచం సొమ్ము రూ. 50 లక్షలు, రెండు ఐ-ఫోన్లను స్వాధీనం చేసుకున్నాం’’ అని రిమాండ్ రిపోర్టులో ఏసీబీ డీఎస్పీ పేర్కొన్నారు.
న్యాయవాదుల మధ్య ఘర్షణ
ఈ వ్యవహారంలో రేవంత్‌రెడ్డిని ఇరికించడం వెనుక ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్ర ఉందని, వీడియో ఫుటేజీని మీడియాకు ఇవ్వడమే ఇందుకు నిదర్శనమని ఆయన తరఫు న్యాయవాది కనకమేడల రవీంద్రకుమార్ మీడియాతో అన్నారు. దీంతో అక్కడే ఉన్న తెలంగాణ న్యాయవాదుల జేఏసీ నేత కొంతం గోవర్ధన్‌రెడ్డి ఆయన్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రభుత్వం కుట్ర చేశారనడం సరికాదని, నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో ఇద్దరి మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. కాగా, ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును మొదటి ముద్దాయిగా చేర్చాలని తెలంగాణ జూనియర్ న్యాయవాదుల సంఘం డిమాండ్ చేసింది.బాబు ఆదేశాల మేరకే డబ్బు ఇచ్చేందుకు వచ్చినట్లు రేవంత్‌రెడ్డి స్పష్టం చేసినందున చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని సంఘం అధ్యక్షుడు ఒద్యారపు రవికుమార్ డిమాండ్ చేశారు.
చర్లపల్లికి తరలించండి...
రేవంత్‌రెడ్డి సహా ఇతర నిందితులను చర్లపల్లి జైలుకు తరలించాలని ఏసీబీ ప్రత్యేక కోర్టుకు చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్ నివేదించారు. ఈ మేరకు సోమవారం కోర్టుకు లేఖ రాశారు. సాధారణంగా ఏసీబీ కేసుల్లో నిందితులను రిమాండ్ కోసం చర్లపల్లి జైలుకు తరలిస్తారని వివరించారు. చంచల్‌గూడ జైలులో పాత వాటి స్థానంలో కొత్తగా బ్యారక్‌ల నిర్మాణం జరుగుతోందని, ప్రస్తుతానికి మూడు బ్యారక్‌లు మాత్రమే ఉన్నాయని నివేదించారు. కాగా, బంజారాహిల్స్‌లో రేవంత్‌రెడ్డి నివాసం వద్ద నిర్మానుష్య వాతావరణం కనిపించింది.
జైలులో రేవంత్
సోమవారం ఉదయం 11.44 గంటలకు రేవంత్‌రెడ్డిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. జైలు అధికారులు ఆయనకు యూటీ నంబర్ 1779 కేటాయించారు. స్పెషల్ కేటగిరీ ఉత్తర్వులు అందేవరకు రేవంత్‌ను సాధారణ ఖైదీగానే పరిగణిస్తామని, ఎమ్మెల్యే కావడంతో హై సెక్యూరిటీ బ్యారక్‌లో ఉంచినట్లు తెలిపారు. మధ్యాహ్నం సమయంలో జైలు ములాఖత్‌లో భాగంగా రేవంత్‌ను ఆయన న్యాయవాది కలసి వెళ్లారు. కాగా, ఆయన్ని జైలుకు తీసుకువస్తున్న సమయంలో కొందరు టీడీపీ కార్యకర్తలు జైలు వద్ద సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇక ఉదయం జడ్జి ఎదుట హాజరుపరిచే ముందు నిబంధనల ప్రకారం నిందితులకు ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. బీపీ, షుగర్, ఈసీజీ సాధారణ స్థితిలో ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అనంతరం వారిని బంజారాహిల్స్‌లోని ఏసీబీ కార్యాలయానికి తరలించారు.
కంగుతిన్న రేవంత్
ఈ కేసులో తాను ఇరుక్కుపోయిన తీరు తెలుసుకుని రేవంత్ కంగుతిన్నారు. ఆదివారం రాత్రి అరెస్టు చేసిన తర్వాత ఆయన్ను ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తీసుకువచ్చారు. ఆయనను ఉంచిన గదిలో ఓ టీవీ కూడా ఉంది. రాత్రి 9 గంటలకు దాదాపు అన్ని న్యూస్ చానళ్లలో రేవంత్‌రెడ్డికి సంబంధించిన వీడియో ఫుటేజీలు ప్రసారమయ్యాయి. అప్పటిదాకా మామూలుగా ఉన్న రేవంత్‌రెడ్డి టీవీలో వస్తున్న దృశ్యాలను చూసి కంగుతిన్నారు. తన సోదరుడు తనను కలిసేందుకు అనుమతించాలంటూ ఏసీబీ డీజీ ఖాన్‌ను కోరారు. అందుకు ఆయన సమ్మతించడంతో తెల్లవారుజామున 3 గంటలకు కొండల్‌రెడ్డి వచ్చి రేవంత్‌ను కలిశారు. అరగంట పాటు మాట్లాడారు.