
ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికపై మల్లగుల్లాలు?
ఓటుకు నోటు వ్యవహారంలో ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర మల్లగుల్లాలు పడుతున్నారు.
హైదరాబాద్:ఓటుకు నోటు వ్యవహారంలో ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర మల్లగుల్లాలు పడుతున్నారు. ఆడియో, వీడియో టేపులు పూర్తిగా నిజమైనవేనని ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్) నిర్థారిస్తే ఏమి చేయాలనే దానిపై చంద్రబాబు తర్జన భర్జనలు పడుతున్నారు.
దీనిలో భాగంగానే ఆయన ఆదివారం పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమైయ్యారు. ఈ భేటీలో ఏపీ డీజీపి జేవీ రాముడు, ఏసీబీ డీజీ మాలకొండయ్య, ఇంటిలిజెన్స్ఏడీజీలతో బాబు భేటీ అయ్యారు. ఒకవేళ కోర్టు నోటీసులు వస్తే ఈ కేసును ఎలా ఎదుర్కొవాలి అనే దానిపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. దీంతో పాటు కౌంటర్ అటాక్ ఎలా చేయాలి? అనే అంశంపైనే వాటి భేటీ సాగినట్లు సమాచారం.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేయాలంటూ ఎమ్మెల్యేల కొనుగోలు కోసం ప్రయత్నించి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన కేసుకు సంబంధించిన అన్ని ఆడియో, వీడియో టేపులు పూర్తిగా నిజమైనవేనని ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ నిర్ధారించినట్లు సమాచారం. అవి ఎక్కడా ఉద్దేశపూర్వకంగా కత్తిరించి అతికినవి (కట్ అండ్ పేస్ట్) కావని తేల్చినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఎఫ్‌ఎస్‌ఎల్ ఈ మేరకు ఏసీబీ అధికారులకు ప్రాథమిక నివేదికను అందించిందని, వీటికి సంబంధించి అధికారిక నివేదికలను సోమవారం నేరుగా కోర్టుకు అందించనుందని సమాచారం.