'బెయిల్ నిశ్చితార్థం కోసం కాదు'
రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్పై ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తానని స్వయంగా ఆయనే మీడియాకు చెప్పారని, అలాంటి వ్యక్తికి మధ్యంతర బెయిల్ ఇస్తే సాక్ష్యాలను పూర్తిగా ప్రభావితం చేస్తారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు.
రేవంత్ రెడ్డికి బెయిలిస్తే సాక్ష్యాధారాలను మాయం చేసే అవకాశం ఉందని పీపీ కోర్టుకు విన్నవించారు. అయితే.. ఆయన కూతురి నిశ్చితార్థం కోసం ఎస్కార్టుతో కూడిన ఒకరోజు బెయిల్ ఇస్తే మాత్రం తమకు అభ్యంతరం లేదన్నారు. నిశ్చితార్థం కోసం కాకుండా ఇతర ఉద్దేశాలతోనే బెయిల్ అడుగుతున్నారనే అనుమానం తమకు కలుగుతోందని ఆయన చెప్పారు.
లంచం ఇవ్వడం ఎన్నుకున్న ప్రజల నమ్మకాన్ని దెబ్బతీయమేనని ఆయన చెప్పారు. రేవంత్ రెడ్డిపై ఇప్పటికే కొన్ని క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయని, ఆయన డ్రైవర్ ఇంకా తప్పించుకునే తిరుగుతున్నారని తెలిపారు. ఈకుట్రలో భాగంగా రేవంత్ రెడ్డి వివిధ ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహించారని, వాటికి వెళ్లేటప్పుడు గన్మెన్ను కూడా వదిలి వెళ్లేవారని పీపీ కోర్టుకు చెప్పారు.
ముగ్గురు నిందితులను విచారించాక దొరికిన ఆధారాలతోనే వాళ్ల ఇళ్లలోసోదాలు చేశామని, ఉదయసింహ ఇంట్లో భారీగా డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నామని, దాంతోపాటు రేవంత్ రెడ్డికి సంబంధించిన లావాదేవీల డాక్యుమెంట్లు కూడా దొరికాయని అన్నారు. కేవలం వీడియో ఫుటేజి ఆధారంగానే కేసులు పెట్టలేదని, తమవద్ద కచ్చితమైన ఆధారాలు ఉన్నాయని పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు. ఇచ్చిన 50 లక్షలు కాకుండా మిగిలిన రూ. 4.50 కోట్లు ఎక్కడున్నాయనే కోణంలో విచారణ చేపడుతున్నామన్నారు.