హైకోర్టును ఆశ్రయించిన రేవంత్
హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో అరెస్ట్ అయిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఆయన తరపు న్యాయవాదులు సోమవారం హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. కాగా రేవంత్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను ఏసీబీ కోర్టు తోసిపుచ్చిన విషయం తెలిసిందే.
తాను ఎమ్మెల్యేగా ఉన్నానని, కోర్టు నిబంధనలకు కట్టుబడి ఉంటానని, బెయిల్ ఇవ్వవలసిందిగా రేవంత్ రెడ్డి తన బెయిల్ పిటిషన్ పేర్కొన్నట్లు తెలుస్తోంది. రాజకీయ కుట్రలో భాగంగానే రేవంత్ రెడ్డిని ఈ కేసులో ఇరికించినట్లు ఆయన న్యాయవాదులు చెబుతున్నారు. కాగా రేవంత్ తో పాటు మరో ఇద్దరు నిందితులు సెబాస్టియన్, ఉదయ్ సింహలు కూడా హైకోర్టులో పిటిషన్ దాఖులు చేశారు.
మరోవైపు రేవంత్ రెడ్డి జ్యుడిషియల్ కస్టడీ అర్థరాత్రితో ముగియటంతో ఏసీబీ అధికారులు ఇవాళ కోర్టుకు హాజరు పరిచారు. కోర్టు ఆయనకు మరో 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. కోర్టు విచారణ అనంతరం రేవంత్ రెడ్డిని అధికారులు చర్లపల్లి జైలుకు తరలించారు.