బాబుకు నోటీసులిచ్చేందుకు ఏసీబీ సన్నద్ధం! | acb ready may summon chandrababu on note for vote case | Sakshi
Sakshi News home page

బాబుకు నోటీసులిచ్చేందుకు ఏసీబీ సన్నద్ధం!

Published Mon, Jun 15 2015 9:23 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

బాబుకు నోటీసులిచ్చేందుకు ఏసీబీ సన్నద్ధం! - Sakshi

బాబుకు నోటీసులిచ్చేందుకు ఏసీబీ సన్నద్ధం!

హైదరాబాద్: ఓటుకు నోటు కేసు కీలక దశకు చేరుకుంది. ఇప్పటికే ఎపీ సీఎం చంద్రబాబు వాయిస్‌ రికార్టులపై ఫోరెన్సిక్‌ ల్యాబరేటరీ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బాబుకు సంబంధించిన ఆడియోలపై నివేదికను ఈ రోజు కోర్టుకు నివేదిక సమర్పించే అవకాశం ఉంది. అదే విధంగా ఓటుకు నోటు కేసు ఫిర్యాదుదారుడు, నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ వాంగ్మూలాన్ని రికార్డు చేసేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమయ్యారు. ఏసీబీ అధికారులు సీఆర్‌పీసీ 164 కింద అనుమతి కోరుతూ కోర్టుకు విజ్ఞప్తి చేసిన విషయం విదితమే. ఏసీబీ విజ్ఞప్తిని పరిశీలించిన కోర్టు నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ వాంగ్మూలాన్ని రికార్డు చేసేందుకు అనుమతించే ఛాన్స్‌ ఉంది.

మరోవైపు  స్టీఫెన్‌సన్‌ విచారణ, ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు ఆధారంగా చంద్రబాబుకు తెలంగాణ ఏసీబీ నోటీసులు జారీ చేసే అవకాశాలున్నాయని న్యాయనిపుణులు పేర్కొంటున్నారు. ఈ మేరకు ఏసీబీ డీజీ ఏకే ఖాన్‌తో దర్యాప్తు అధికారులు, న్యాయనిపుణులు భేటీ అయినట్టు సమాచారం. ఈ కేసులో ఏ కోణంలోముందుకు వెళ్లాలి? ఫోరెన్సిక్‌ నివేదికను బట్టి ఎలా ముందుకెళ్లాలి? పూర్తి స్థాయిలో సాక్ష్యాధారాలను సేకరించడంలో ఎలాంటి వ్యూహం అనుసరించాలన్న అంశాలపై ఏకేఖాన్‌తో చర్చించినట్లు సమాచారం.

స్టీఫెన్‌సన్‌ వాంగ్మూలంలో ఇచ్చే వివరాలను బట్టి బాస్‌కు నోటీసులు లేదా కోర్టు ద్వారా సమన్లు అందించేందుకు సిద్ధం కావాలని అధికారులు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అయితే నేటితో రేవంత్‌రెడ్డి రిమాండ్‌ ముగుస్తుండటంతో... ఆయన్ని కోర్టులో ప్రవేశపెట్టనున్నారు అధికారులు. మరోవైపు... కేసు స్టేటస్‌ రిపోర్ట్‌ లేదా మెమోను దాఖలు చేయాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నట్టు తెలుస్తోంది.

ఈ వ్యవహారంలో ఇప్పటి వరకూ జరిగిన దర్యాప్తు ఒక ఎత్తయితే.. నేడు జరిగే పరిణామాలు కీలకం కానున్నాయి. ఇదే కేసులో చంద్రబాబు ప్రమేయాన్ని శాస్ర్తీయంగా నిరూపించేందుకు ఆడియో టేపులను ఏసీబీ అధికారులు ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌కు పంపిన విషయం విధితమే. కాగా ఓటుకు నోటు కేసులో ఏసీబీకి దొరికిన 50 లక్షల రూపాయలు టీడీపీ ముఖ్య నేతల కార్పొరేట్‌ సంస్థల నుంచి అందినట్లు దర్యాప్తులో తేలినట్లు సమాచారం.

అయితే స్టీఫెన్‌ వాంగ్మూలం, ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదికలు పరిశీలించిన అనంతరం ఈ కేసులో ఏసీబీఅదనపు ఎఫ్‌ఐఆర్‌ రూపొందించే అవకాశం ఉంది. అందులో మరికొందరి పేర్ల చేర్చే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటి వరకు చేపట్టిన దర్యాప్తుపై న్యాయ నిపుణులతో సంప్రదిస్తున్న ఏసీబీ అధికారులు చంద్రబాబు బృందానికి నోటీసులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. వీటికి వారు నేరుగా సమాధానం చెప్పడమో లేదా స్టే కోరుతూ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించమో చేసే అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలోనే ఓటుకు నోటు కేసులో నేడు కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement