నేడు కీలక అరెస్టులు ? | will ACB to arrest today on note for vote case ? | Sakshi
Sakshi News home page

నేడు కీలక అరెస్టులు ?

Published Wed, Jun 17 2015 1:54 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

నేడు కీలక అరెస్టులు ? - Sakshi

నేడు కీలక అరెస్టులు ?

* మంగళవారం రాత్రే కోర్టు నుంచి వారంట్లు పొందిన ఏసీబీ
* టీడీపీ ఎమ్మెల్యే సండ్ర, వేం నరేందర్‌రెడ్డిలకు నోటీసులు
* రేపటిలోగా ఏపీ సీఎం చంద్రబాబుకు నోటీసులు

* తొలుత వేం నరేందర్‌రెడ్డి అరెస్టుకు ఏసీబీ నిర్ణయం.. గుండె వ్యాధితో బాధపడుతున్నందున ఇప్పుడు రాలేనని ఆయన విజ్ఞప్తి  
* దాంతో నోటీసులిచ్చి వెనుదిరిగిన అధికారులు
* కార్యాచరణ వేగవంతం చేసిన ఏసీబీ
* సీఆర్‌పీసీ సెక్షన్ 160 కింద మరో 20మందికి నో
టీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం
* ఆధారాలుంటే ‘సూత్రధారి’కి నోటీసులుఇచ్చేందుకు అభ్యంతరం లేదన్న గవర్నర్
* నూరు శాతం చట్టానికి లోబడి కేసును దర్యాప్తు చేస్తున్నామన్న ఏసీబీ
* పక్కా ఆధారాలతోనే ప్రతి అడుగు.. నేడు లేదా రేపు కోర్టుకు ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలు

 
 సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు నోటు’ కేసులో కీలకంగా వ్యవహరించిన ఇద్దరు టీడీపీ ముఖ్య నేతలను ఏసీబీ బుధవారం అరెస్టు చేయనుంది. ఇప్పటిదాకా అణువణువు పరిశీలించి ఆధారాలను సమకూర్చుకునేందుకు ప్రాధాన్యమిచ్చిన ఏసీబీ.. బుధవారం నుంచి కార్యాచరణకు సిద్ధమైంది. ఈ వ్యవహారంలో ఇద్దరు టీడీపీ నేతలను అరెస్టు చేసేందుకు న్యాయస్థానం నుంచి ఏసీబీ అధికారులు మంగళవారం రాత్రే అరెస్టు వారంట్లు పొందినట్లు అత్యున్నత వర్గాల సమాచారం. అసలు ఈ ఇద్దరు నేతలను మంగళవారమే అదుపులోకి తీసుకుని విచారించాలని భావించినా.. న్యాయపరమైన అడ్డంకులు లేకుండా కోర్టు నుంచి ముందుగానే అనుమతి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో సూత్రధారి అయిన సీఎం నారా చంద్రబాబునాయుడుకు కూడా ఏసీబీ నోటీసులు జారీ చేయనుంది. గురువారం సాయంత్రానికి బాబుకు నోటీసులు అందజేస్తామని ఏసీబీ వర్గాలు పేర్కొన్నాయి. ఇక కేసులో టీటీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వేం నరేందర్‌రెడ్డిలకు మంగ ళవారం రాత్రి ఏసీబీ నోటీసులు జారీ చేసింది.
 
 ఈ వ్యవహారంలో పాత్రధారులుగా భావిస్తున్న మరో 20 మంది దేశం విడిచి వెళ్లకుండా ఉండేందుకు లుకౌట్ నోటీసులు జారీ చేయాలని ఏసీబీ నిర్ణయించింది. దీనికి సంబంధించి బుధవారం అధికారికంగా నోటీసులు జారీ చేయనుంది. సీఆర్‌పీసీ సెక్షన్ 160 కింద వీరందరినీ దశలవారీగా విచారణకు రావాలని నోటీసులు జారీ చేయనుంది. వీరిలో సీఎం చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రి సుజనా చౌదరి, రాజ్యసభ సభ్యులు సీఎం రమేశ్, గరికపాటి మోహన్‌రావు, శాసనసభ్యులు ఎర్రబెల్లి దయాకర్‌రావుతో పాటు ఒక మాజీ ఎంపీ,  నలుగురు మాజీ ఎమ్మెల్యేలు, ఇతర దేశం నేతలు ఉన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటేయాలంటూ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో రూ.5కోట్లకు ఒప్పందం కుదుర్చుకుని రూ.50 లక్షలు అడ్వాన్స్‌గా ఇస్తూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో స్టీఫెన్‌సన్‌తో ఏపీ సీఎం చంద్రబాబు నేరుగా బేరసారాలు సాగించిన ఆడియో రికార్డులు, రేవంత్ డబ్బు ఇస్తుండగా చిత్రీకరించిన వీడియో దృశ్యాలు బహిర్గతమయ్యాయి కూడా. ఈ వ్యవహారంలో ఏకంగా రూ.150 కోట్ల వరకు ఖర్చుచేసి, పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి తెలుగుదేశం పార్టీ ప్రయత్నించిందని ఏసీబీ దర్యాప్తులో వెల్లడైంది. ఈ వ్యవహారానికి సంబంధించిన వీడి యో, ఆడియో రికార్డులను ఇప్పటికే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ(ఎఫ్‌ఎస్‌ఎల్)కు పంపారు. వాటి గుట్టు తేల్చేందుకు నిపుణులైన అధికారుల బృందం 24 గంటలూ పనిచేస్తోంది.

వీటిపై ఎఫ్‌ఎస్‌ఎల్ నుంచి బుధవారం సాయంత్రానికి కోర్టుకు నివేదిక అందే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఈ నివేదిక అందిన మరుక్షణమే చంద్రబాబుకు నోటీసులు జారీ చేయాలని ఏసీబీ భావిస్తున్నారు. అయితే నోటీసులు అందుకునే వ్యక్తి ఏపీ ముఖ్యమంత్రి అయినందున చంద్రబాబు భాగస్వామ్యానికి గల ఆధారాలతో  గవర్నర్ నరసింహన్‌కు ఏసీబీ 17 పేజీల నివేదికను అందజేసింది. ఇదే నివేదికను కేంద్ర హోంశాఖ కార్యదర్శికి మంగళవారం రాత్రే అందజేసింది. ఈ నివేదికను పరిశీలించిన గవర్నర్... ఆధారాలు ఉన్నాయని సంతృప్తి చెందితే నోటీసులిచ్చేందుకు అభ్యంతరం లేదని ఏసీబీకి మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. అయితే అంతకంటే ముందు ఈ నివేదికపై న్యాయ నిపుణులతో చర్చలు జరిపినట్లు సమాచారం.
 
 గోప్యంగా ఉంచిన ఏసీబీ..
 ‘ఓటుకు నోటు’ కేసులో అరెస్టు చేయబోతున్న ఇద్దరు టీడీపీ ముఖ్య నేతల పేర్లను ఏసీబీ గోప్యంగా ఉంచింది. న్యాయస్థానం నుంచి వారెంట్లు పొందినప్పటికీ వారెవరన్నది బయటకు రాలేదు. అయితే నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు ఇవ్వజూపిన రూ.50 లక్షలను సమకూర్చినవారే ఆ ఇద్దరు నేతలని అత్యున్నత వర్గాల నుంచి అందిన సమాచారం. విచారణలో సెబాస్టియన్, ఉదయ సింహ వెల్లడించిన అంశాల ఆధారంగా దర్యాప్తు చేయగా.. ఈ ఇద్దరు నేతల ఖాతాల నుంచే ఆ డబ్బు విత్‌డ్రా చేసినట్లు ఏసీబీ నిర్ధారించింది. ఆ డబ్బే రేవంత్‌కు చేరినట్లు స్పష్టమైన ఆధారాలు సంపాదించింది. ఈ ఆధారాలను ఏసీబీ కోర్టుకు సమర్పించి అరెస్టు చేసేందుకు వారెంట్లు పొందినట్లు తెలిసింది.

అయితే ఏసీబీ అరెస్టులపై మంగళవారం ప్రచారం జరగడంతో టీడీపీ నేతలు కొందరు వారి నివాసాల వద్ద ఆంధ్రప్రదేశ్ పోలీసులను మోహరించగా.. ఈ విషయాన్ని డీజీపీ అనురాగ్‌శర్మ, హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇక్కడి శాంతిభద్రతలతో నిమిత్తం లేని ఏపీ పోలీసులను నగరంలో మోహరించడం చట్టరీత్యా చెల్లుబాటు కాదని... ఇది శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రమాదముందని ఆయనకు వివరించారు. దీనిపై డీజీపీ మంగళవారం రాత్రి కేంద్ర హోం శాఖకు ఓ నివేదికను ఫ్యాక్స్ చేశారు కూడా. ఈ నేపథ్యంలో అరెస్టు చేసేందుకు వెళితే.. ఏపీ పోలీసుల చేత గొడవలు సృష్టించే అవకాశం ఉండడంతో న్యాయస్థానం ఆదేశాల మేరకు నడుచుకోవాలని ఏసీబీ నిర్ణయించిందని.. అందువల్లే కోర్టు నుంచి వారెంట్లు పొందిందని అధికారవర్గాలు వెల్లడించాయి.
 
 పక్కా ఆధారాలతో ముందుకు..
 ‘ఈ కేసులో అణువణువు పరిశీలించి స్పష్టమైన ఆధారాలను సంపాదించాం. దీనివల్ల కొంత జాప్యం జరిగిన మాట వాస్తవం. నూరు శాతం చట్టానికి లోబడి ఈ కేసును దర్యాప్తు చేస్తున్నాం. అందువల్ల కేసు ఇప్పటిదాకా అనుకున్న స్థాయిలో ముందుకు వెళ్లలేదు. బుధవారం నుంచి మా కార్యాచరణను మీరే చూస్తారు..’ అని ఓ ఏసీబీ సీనియర్ అధికారి పేర్కొనడం గమనార్హం. ఈ కేసులో ముందుకు వెళ్లేందుకు మీడియా కథనాలూ ఉపయోగపడ్డాయని ఆ అధికారి పేర్కొన్నారు. సీఆర్‌పీసీ సెక్షన్ 160ని అనుసరించి 20 మందిని విచారించబోతున్నామని, వారిలో ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు ఓ కేంద్ర మంత్రి, ఇద్దరు రాజ్యసభ సభ్యులు, నలుగురు ఎమ్మెల్యేలు, ఓ మాజీ ఎంపీ, నలుగురు మాజీ ఎమ్మెల్యేలు, ఇతర టీడీపీ నేతలు ఉన్నారని ఆ అధికారి చెప్పారు.
 సీఆర్‌పీసీ సెక్షన్ 160 అంటే
 సాక్షి, హైదరాబాద్: ఏదైనా కేసుతో సంబంధమున్న వ్యక్తిని తమ ఎదుట సాక్షిగా హాజరుకావాలని ఆదేశిస్తూ నోటీసులు జారీచేసే అధికారాన్ని దర్యాప్తు అధికారులకు నేర శిక్షా స్మృతి(సీఆర్‌పీసీ)లోని సెక్షన్ 160 కల్పిస్తోంది. తమ పరిధితో పాటు ఇతర పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఉన్న వ్యక్తులను సైతం విచారణకు హాజరుకావాల్సిందిగా దర్యాప్తు అధికారులు కోరవచ్చు. సాధారణంగా అనుమానితులను విచారించేందుకు ఈ సెక్షన్ కింద నోటీసులు జారీచేస్తూ ఉంటారు. ఈ నోటీసులో నిర్దేశించిన సమయం, ప్రాంతానికి సదరు వ్యక్తులు హాజరుకాకపోతే.. ఐపీసీ సెక్షన్ 174 కింద వారు శిక్షార్హులు. గరిష్టంగా నెల రోజుల వరకు జైలు శిక్ష లేదా రూ.500 జరిమానా లేదా రెండూ విధించే అవకాశముంది.
 
 వేం నరేందర్‌రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం!
 సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు నోటు’ కేసులో టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వేం నరేందర్‌రెడ్డికి మంగళవారం రాత్రి సీఆర్‌పీసీ సెక్షన్ 160 కింద ఏసీబీ నోటీసులు జారీచేసింది. విచారణకు హాజరుకావాల్సిందిగా  ఆదేశించింది. తొలుత హైదరాబాద్‌లో హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్ట్స్‌లోని 208వ నంబర్ క్వార్టర్‌లో ఉన్న సండ్ర నివాసానికి ఏసీబీ అధికారులు వెళ్లారు. ఆసమయంలో ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడంతో నోటీసులను క్వార్టర్ తలుపునకు అంటించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ముందు జరిగిన కొనుగోళ్ల వ్యవహారంలో ఖమ్మం జిల్లాకు చెందిన కొందరు ఎమ్మెల్యేలతో సండ్ర వెంకట వీరయ్య బేరసారాలు జరిపినట్లు ఆరోపణలున్నాయి. ఇక హైదరాబాద్ ఆదర్శనగర్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని వేం నరేందర్‌రెడ్డి నివాసానికి వెళ్లి ఏసీబీ అధికారులు నోటీసులు అందజేశారు.
 
 తొలుత వేం నరేందర్‌రెడ్డిని అరెస్టు చేయాలనే ఉద్దేశంతో 18 మందితో కూడిన 4 ఏసీబీ బృందాలు ఆయన ఇంటికి వెళ్లాయి. కానీ తాను గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నానని, ఇప్పుడు రాలేనని వేం నరేందర్‌రెడ్డి విజ్ఞప్తి చేసుకున్నారు. అయితే తమ వద్ద వైద్యులు, సదుపాయాలున్నాయని.. రావాల్సిందేనని అధికారులు తేల్చిచెప్పారు. అయినా తాను ఎప్పుడంటే అప్పుడు విచారణకు హాజరవుతానని, అవసరమైతే ఉదయం 5.30కే వస్తానని నరేందర్‌రెడ్డి కోరడంతో.. దానికి అంగీకరించిన ఏసీబీ అధికారులు నోటీసులు అందజేసి వెళ్లిపోయారు. కానీ ఆయనను గృహనిర్భంధం చేశారు. ఇంటి బయట కొందరు పోలీసులు కాపలాగా ఉన్నారు. బుధవారం ఉదయమే వేం నరేందర్‌రెడ్డిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement