'ఓటుకు కోట్లు'లో టీడీపీ ఎమ్మెల్యేకు ఏసీబీ నోటీసులు
హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసు వ్యవహారంలో తెలంగాణ ఏసీబీ ప్రత్యక్ష కార్యచరణకు దిగింది. రోజంతా ఏసీబీ నోటీసులిస్తుందన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే ఏసీబీ అధికారులు ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటట వీరయ్యను విచారణ అధికారి ముందు హజరుకావాలని నోటీసులు జారీ చేశారు. ఏసీబీ బృందం హైదర్ గూడలోని టీడీపీ ఎమ్మెల్యే క్వార్టర్స్ నంబర్ 208 (ఇంటికి)కి వెళ్లగా ఆయన అందుబాటులో లేరని తెలుస్తుంది.
టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఇంట్లో కూడా ఎవరూ లేకపోవడంతో ఇంటి గోడలకు నోటీసులను అంటించారు. ఆయనపై సీఆర్పీసీ సెక్షన్ 160 కింద కేసు నమోదు చేసినట్లు ఏసీబీ పేర్కొంది. సండ్ర వెంకట వీరయ్యకు నోటీసులు ఇవ్వడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఈ కేసు పట్ల దూకుడుగా వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. రేపు కూడా మరికొంత మంది టీడీపీ నాయకులకు, ప్రజా ప్రతినిధులకు, నోటీసులు జారీ చేసే అవకాశముందని ఏసీబీ వర్గాలు వెల్లడించాయి.