MLA sandra venkata veraiah
-
కష్టాలకు కరిగిపోతా.. : ఎమ్మెల్యే సండ్ర
‘నాకు పాలేరు నియోజకవర్గం రాజకీయ జన్మనిస్తే.. సత్తుపల్లి రాజకీయంగా పునర్జన్మనిచ్చింది. బాల్య దశ నుంచే విద్యార్థి, యువజన ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించా. ప్రజలతో నా అనుబంధం పెనవేసుకోవడంతో సామాన్యుల కష్టాలు, పేదల కన్నీళ్లు, మధ్యతరగతి ప్రజల అవసరాలు మరొకరు చెప్పకుండానే అర్థం చేసుకునే అవకాశం లభించింది. బాధ్యతాయుతమైన జీవితాన్ని గడపాలనే లక్ష్యంతో రాజకీయ ప్రస్థానం కొనసాగుతోంది. జనం మధ్య.. ప్రజల కోసం పరితపించడం అంటే నాకు అత్యంత ఇష్టం. కమ్యూనిస్టు భావాలతో పెరిగిన నేను పేదల కష్టానికి ఇట్టే కరిగిపోతా.. హేతుబద్ధంగా ఆలోచించడానికి ఇష్టపడతా.. అంటున్న సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో ఈ వారం పర్సనల్ టైమ్. మాది సాధారణ రైతు కుటుంబం. నాన్న పేరు భిక్షం, అమ్మ లక్ష్మమ్మ. ఉన్నదాంట్లో సర్దుకోవడం, ఎవరికైనా ఆపద వస్తే నేనున్నాననే ఆత్మస్థైర్యం కల్పించడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటైంది. చిన్న వయసులోనే అమ్మను కోల్పోయినా.. మాతృప్రేమను రుచి చూపించింది మాత్రం కమల సరోజిని, ఒండ్రు దేవదానం దంపతులే. 4వ తరగతి నుంచి వారే పెంచి పెద్ద చేశారు. కూసుమంచి ప్రభుత్వ పాఠశాలలో వారు పనిచేస్తున్న సమయంలో ఏర్పడిన పరిచయం ఇప్పటికీ ఆత్మీయత, అనురాగాల మధ్య కొనసాగుతోంది. వాళ్లని దేవుడిచ్చిన తల్లిదండ్రులుగానే భావిస్తా. ఏ హోదాలో ఉన్నా.. ఏ పనిచేసినా క్రమశిక్షణాయుతంగా చేయడం నాకు చిన్నప్పటి నుంచి అబ్బిన అలవాటు. దీనికి కారణం అతి చిన్న వయసులో ఎస్ఎఫ్ఐ కార్యకర్తగా పనిచేయడంతో క్రమశిక్షణ అలవడింది. విద్యార్థి సంఘం నాకు వ్యక్తిగత క్రమశిక్షణను నేర్పితే.. డీవైఎఫ్ఐ యువజన విభాగం నా రాజకీయ ఎదుగుదలకు కారణమైంది. రాజకీయంగా ఏ హోదాలో పనిచేసినా ప్రజల మధ్య.. ప్రజల కోసం పనిచేసే లక్ష్యం సీపీఎం నుంచే లభించింది. సీపీఎంలో అనేక మంది నాకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంది నా రాజకీయ ఎదుగుదలలో అత్యంత కీలక పాత్ర. అలాగే సీపీఎం మాజీ శాసనసభా పక్ష నాయకుడు బోడేపూడి వెంకటేశ్వరరావు, ఖమ్మం జిల్లా కమ్యూనిస్టు యోధులు మంచికంటి రామకిషన్రావు, కేఎల్.నరసింహారావు, పిల్లుట్ల వెంకన్న నాకు స్ఫూర్తిప్రదాతలు. ‘తుమ్మల’ది అత్యంత కీలక పాత్ర.. రాజకీయంగా సీపీఎం నుంచి బయటకు వచ్చిన తర్వాత టీడీపీలో చేరిన నన్ను అక్కున చేర్చుకుని.. రాజకీయంగా అండదండలు అందించి.. నా రాజకీయ ప్రస్థానం కొనసాగడంలో అత్యంత కీలక పాత్ర మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుది. తుమ్మల ధైర్యం కల్పించడంతో సత్తుపల్లిలో 2009లో టీడీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించా. అప్పటి నుంచి సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలే నా సర్వస్వం. రాజకీయ నేతల పట్ల ప్రజలకున్న అభిప్రాయాన్ని తప్పు పట్టలేం కానీ.. ప్రతి నాయకుడిని ఒకే గాటన కట్టి చూడడం మాత్రం ఒక్కోసారి బాధేస్తుంది. నా రాజకీయ జీవితంలో డబ్బు పాత్ర చాలా పరిమితం. డబ్బులతో రాజకీయం చేసే పరిస్థితి, అవసరం నాకు రాకపోవడం ఇప్పటికీ అదృష్టంగా భావిస్తా. ఇందుకు కారణం కమ్యూనిస్టు పార్టీల్లో పెద్దల అండదండలు ఉండడం, ప్రజల కష్టాలు తెలిసిన మనిషిగా పేరుండడంతో నా రాజకీయ జీవితాన్ని ప్రజలే లిఖించే అవకాశం లభించింది. ఆడంబరాలు నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం ఉండదు. ఇప్పటికీ హైదరాబాద్‌లో ఒకరోజు పని ఉంటే ఆర్టీసీ బస్సులోనే వెళ్లి.. పని చూసుకుని మళ్లీ తిరిగి వచ్చే అలవాటు. సెక్రటేరియట్‌కు, అసెంబ్లీకి ఆటోలో వెళ్లడానికే ఇష్టపడతా. ఇక స్నేహానికి ప్రాణం ఇవ్వడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. రాజకీయంగా ఎంత బిజీగా ఉన్నా స్నేహితుల ఇంట్లో పెళ్లి అయినా.. శుభకార్యమైనా వాళ్ల కుటుంబాల్లో కష్టమైనా.. ఆపదైనా నేనుండి తీరాల్సిందే. వారితో పెనవేసుకున్న అనుబంధం అలాంటిది. నాయకుడిగా నా పరిమితులు, నా పరిస్థితులపై అవగాహన ఉన్న స్నేహితుల మధ్య గడుపుతుండడం ఒకింత గర్వంగా ఉంటుంది. కూసుమంచిలో నేను ఐదో తరగతి చదువుతున్నప్పుడు నా స్నేహితుడు రమణ క్లాస్ లీడర్‌గా ఎన్నికైతే ఆయనను అభినందించడం కోసం కూసుమంచి చెరువులో తామరపూలు కోయడానికి స్నేహితుల బృందంతో వెళ్లాం. చెరువులోకి దిగడం ఎంత సులభమో.. రావడానికి మాత్రం తలప్రాణం తోకకొచ్చింది. కాళ్లకు తామర దారాలు అడ్డం పడి కదిలే పరిస్థితి లేకపోవడంతో నాతోపాటు చెరువులోకి దిగిన స్నేహితులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకున్నాం. చాలా సేపటి తర్వాత బయటకు రాగలిగాం. ఎట్టకేలకు తామరపూలు తెచ్చి రమణను అభినందించాం. ఇక నాకు ఆర్థికంగా ఏ అవసరం వచ్చినా స్నేహితులపై ఆధారపడే అలవాటు ఈ నాటిది కాదు. విద్యార్థి నాయకుడిగా.. యువజన నాయకుడిగా.. సీపీఎం, టీడీపీ. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా.. నాకు కష్టం వస్తే స్నేహితులకు చెప్పుకోవడం.. వారి ఆర్థిక చేయూతతో సంక్లిష్ట ఎన్నికలను సైతం సునాయాసంగా గట్టెక్కడం ఆనవాయితీగా వస్తోంది. ఇందుకు స్నేహితులుగా వారు నాకిచ్చే గౌరవం, నా ఎదుగుదలకు వారిచ్చే ప్రాధాన్యం కారణమని అనిపిస్తుంది. వారి అండదండలే.. సత్తుపల్లి ప్రజల అభిమానం.. అండదండలే నన్ను నడిపిస్తున్నాయి. పాలేరు, సత్తుపల్లి రెండు నియోజకవర్గాలు నాకు రెండు కళ్లు. అందుకే ఇరు ప్రాంతాల ప్రజలకు అందుబాటులో ఉండాలనే లక్ష్యంతోనే ఖమ్మంను నివాస కేంద్రంగా చేసుకున్నా.. అంతకుమించి మరో ఆలోచన లేదు. ఇక అత్యంత చిన్న వయసులో ఎమ్మెల్యేగా ఎన్నికైన గుర్తింపు సైతం నాకే లభించింది. 1994లో ఎమ్మెల్యేగా పాలేరు నుంచి సీపీఎం తరఫున గెలిచే నాటికి నా వయసు కేవలం 26 ఏళ్లు. ఇక నా కుటుంబ వ్యవహారాలన్నీ మా ఆవిడ మహాలక్ష్మి చూసుకునేది. ఆవిడకు భూదేవికి ఉన్నంత ఓర్పు.. సహనం ఎక్కువ. నా కోపాన్ని భరించడం ఆమెకు మాత్రమే సాధ్యమైంది. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు కస్సుబుస్సులు సహజమే అయినా.. అవి నలుగురి మధ్య కాక నాలుగు గోడల మధ్య ప్రదర్శించినా.. అర్థం చేసుకునే అర్థాంగి దొరకడం నా అదృష్టం. ఇక తాతయ్య నాన్నకు ఐదెకరాల పొలం అప్పగిస్తే.. నాన్న అదే ఐదెకరాలు నాకు అప్పజెప్పారు. దానిని కాపాడుకుంటే నేను గొప్పవాడినేనని నాన్న ఎప్పుడూ అంటుండేవారు. ఇప్పటికీ నాన్న మాట మాత్రం నిలబెట్టా. ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెడుతూనే ప్రజల కోసం ఉద్యమం చేసిన నేతగా పలు కేసులు ఎదుర్కొంటూ న్యాయస్థానాలకు హాజరయ్యేవాడిని. ప్రజల కోసం కోర్టు ముందు ఉన్నాననే భావన ఎంతో సంతృప్తినిచ్చేది. ఇక డీవైఎఫ్ఐ ఖమ్మం డివిజన్ అధ్యక్షుడిగా నిర్వహించిన కబడ్డీ చాంపియన్ టోర్నీ నా రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పింది. అత్యంత పకడ్బందీగా యువకులకు మనో ఉల్లాసం కలిగించే విధంగా నిర్వహించిన కబడ్డీ పోటీలకు ఆలిండియా కబడ్డీ కెప్టెన్ హర్దీప్సింగ్ను, దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి వ్యక్తిగత కార్యదర్శి, ఐఏఎస్ అధికారి సుబ్రహ్మణ్యంను బహుమతి ప్రదానోత్సవానికి పిలిచాం. కమ్యూనిస్టు ఉద్యమాల్లో కీలకపాత్ర పోషించడం, ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకోవడంతో క్రమశిక్షణాయుత జీవితం అలవడటమేకాదు ఏ ఒక్క చెడు అలవాటు కాలేదు. నా ప్రాణ స్నేహితుడు లీలామోహన్ ఆకస్మిక మరణం నాతోపాటు స్నేహితులందరినీ కొద్దినెలలపాటు కోలుకోలేకుండా చేసింది. ఆయన కుటుంబానికి అండగా ఉండాలనే నా ప్రతిపాదన మిగితా స్నేహితులు, అప్పటి కాంట్రాక్టర్లు కొందరు అంగీకరించడంతో ఇద్దరు ఆడపిల్లల తండ్రి అయిన లీలామోహన్ కుటుంబాన్ని ఆదుకోవడం కోసం 1999లో ఆయన మరణించిన కొద్ది రోజులకే ఇద్దరు పిల్లల పేరుపై చెరి రూ.4లక్షల చొప్పున డిపాజిట్ చేశాం. ఆయన సతీమణికి గుంటూరు విద్యాశాఖలో ఉద్యోగం ఇప్పించాం. ఆయన ఇద్దరు పిల్లలకు ఏ కష్టం వచ్చినా తామే ఉన్నామనే భరోసా కల్పించాం. వారి పెళ్లిళ్లు అయ్యే సమయానికి చెరొక రూ.24లక్షలు అప్పుడు డిపాజిట్ చేసిన ఫిక్స్డ్ నగదు ఇవ్వగలిగాం. మోహన్‌ను తేలేకపోయినా.. వారి కుటుంబానికి స్నేహితులున్నారనే మనోధైర్యం కల్పించాం. ఇక నాకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు భార్గవ్, రెండోవాడు తేజ. ఇప్పటికే ఉన్నత చదువులు పూర్తి చేసుకున్నారు. పారిశ్రామిక రంగంలో అడుగిడాలన్నది వారి సంకల్పం. -
కేసీఆర్ కిట్లు ప్రచార ఆర్భాటమే
సత్తుపల్లిటౌన్ ఖమ్మం జిల్లా : కోట్లాది రూపాయలతో ప్రభుత్వం ప్రచార గొప్పలే తప్పా.. రాష్ట్రంలో కేసీఆర్ కిట్లు అందటం లేదని, సాక్షాత్తు మంత్రులు లక్ష్మారెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించిన డయాలసీస్ కేంద్రానికి నాలుగు నెలలైనా సేవలకు దిక్కులేదని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆరోపించారు. శుక్రవారం సత్తుపల్లి ఏరియా ప్రభుత్వాస్పత్రిలోని డయాలసీస్ కేంద్రాన్ని పరిశీలించారు. డయాలసీస్ కేంద్రంలో ఏమీ లేకున్నా.. ఆర్భాటంగా ఇద్దరు మంత్రులు ప్రారంభించారని ఎద్దేవా చేశారు. ఒకే కాంట్రాక్టర్‌కు 40 డయాలసీస్ కేంద్రాల నిర్వహణ అప్పగించటం వల్లే పనులు సాగటం లేదని ఆరోపించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సంబంధిత కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. కేసీఆర్ కిట్లు కొరతపై డీఎంఅండ్‌హెచ్‌ఓ కొండల్రావుకు ఫోన్ చేసి అడిగారు. అయితే సరఫరా కాలేకపోవటం వల్ల పంపిణీ చేయలేదని తెలిపారు. వెంటనే వైద్య, ఆరోగ్యశాఖ కమిషనర్ వాకాటి కరుణకు ఫోన్ చేసి సమస్యను వివరించారు. సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రిలో కేసీఆర్ కిట్లు లేక 45 రోజులైంది.. జిల్లా మొత్తం పరిస్థితి ఇలాగే ఉంది.. ఇండెంట్ పెట్టినా సరఫరా చేయటం లేదని ఎ మ్మెల్యే సండ్ర తెలిపారు. సీజనల్ వ్యాధులకు కావాల్సిన మందులను అందుబాటులో ఉంచాలని సూపరింటెండెంట్ డాక్టర్ వసుమతీదేవిని ఆదేశించారు. జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మదన్‌సింగ్‌కు ఫోన్ చేసి సత్తుపల్లి ఆస్పత్రిని సందర్శించి సమస్యలపై దృష్టి పెట్టాలని కోరారు. ఎమ్మెల్యే వెంట గొర్ల సంజీవరెడ్డి, కూసంపూడి రామారావు, కూసంపూడి మహేష్, తడికమళ్ల ప్రకాశరావు, ఎస్కె చాంద్‌పాషా, అద్దంకి అనిల్, కంభంపాటి మల్లికార్జున్, దూదిపాల రాంబాబు, చక్రవర్తి ఉన్నారు. -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
కల్లూరు: స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇమ్మడి శాంతాదేవి (47) మృతి చెందింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం తెల్లవారు జామున ఇమ్మడి చిన్న వీరభద్రరావు, శాంతాదేవి దంపతులు ద్విచక్ర వాహనం పై యోగా క్లాసుకు స్థానిక షుగర్ ఫ్యాక్టరీకి వెళుతుండగా ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో రోడ్డు ప్రమాదంలో అంతకు ముందే మృతి చెందిన గేదె పైకి ద్విచక్ర వాహనాన్ని ఎక్కించడంతో అదుపు తప్పి పడి పోయింది. ఈ ప్రమాదంలో వాహనం వెనుక కూర్చున్న శాంతాదేవి కిందపడడంతో తలకు తీవ్ర గాయాలయి అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమత్తం పెనుబల్లి తరలించారు. విషయం తెలుసుకున్న సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి కల్లూరులోని చిన్న వీరభద్రం ఇంటికెళ్లి శాంతాదేవి మృతదేహానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. -
'ఏసీబీ నుంచి నాకు నోటీసులు రాలేదు'
-
నేడు కీలక అరెస్టులు ?
-
నేడు కీలక అరెస్టులు ?
* మంగళవారం రాత్రే కోర్టు నుంచి వారంట్లు పొందిన ఏసీబీ * టీడీపీ ఎమ్మెల్యే సండ్ర, వేం నరేందర్‌రెడ్డిలకు నోటీసులు * రేపటిలోగా ఏపీ సీఎం చంద్రబాబుకు నోటీసులు * తొలుత వేం నరేందర్‌రెడ్డి అరెస్టుకు ఏసీబీ నిర్ణయం.. గుండె వ్యాధితో బాధపడుతున్నందున ఇప్పుడు రాలేనని ఆయన విజ్ఞప్తి * దాంతో నోటీసులిచ్చి వెనుదిరిగిన అధికారులు * కార్యాచరణ వేగవంతం చేసిన ఏసీబీ * సీఆర్పీసీ సెక్షన్ 160 కింద మరో 20మందికి నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం * ఆధారాలుంటే ‘సూత్రధారి’కి నోటీసులుఇచ్చేందుకు అభ్యంతరం లేదన్న గవర్నర్ * నూరు శాతం చట్టానికి లోబడి కేసును దర్యాప్తు చేస్తున్నామన్న ఏసీబీ * పక్కా ఆధారాలతోనే ప్రతి అడుగు.. నేడు లేదా రేపు కోర్టుకు ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలు సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు నోటు’ కేసులో కీలకంగా వ్యవహరించిన ఇద్దరు టీడీపీ ముఖ్య నేతలను ఏసీబీ బుధవారం అరెస్టు చేయనుంది. ఇప్పటిదాకా అణువణువు పరిశీలించి ఆధారాలను సమకూర్చుకునేందుకు ప్రాధాన్యమిచ్చిన ఏసీబీ.. బుధవారం నుంచి కార్యాచరణకు సిద్ధమైంది. ఈ వ్యవహారంలో ఇద్దరు టీడీపీ నేతలను అరెస్టు చేసేందుకు న్యాయస్థానం నుంచి ఏసీబీ అధికారులు మంగళవారం రాత్రే అరెస్టు వారంట్లు పొందినట్లు అత్యున్నత వర్గాల సమాచారం. అసలు ఈ ఇద్దరు నేతలను మంగళవారమే అదుపులోకి తీసుకుని విచారించాలని భావించినా.. న్యాయపరమైన అడ్డంకులు లేకుండా కోర్టు నుంచి ముందుగానే అనుమతి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో సూత్రధారి అయిన సీఎం నారా చంద్రబాబునాయుడుకు కూడా ఏసీబీ నోటీసులు జారీ చేయనుంది. గురువారం సాయంత్రానికి బాబుకు నోటీసులు అందజేస్తామని ఏసీబీ వర్గాలు పేర్కొన్నాయి. ఇక కేసులో టీటీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వేం నరేందర్‌రెడ్డిలకు మంగ ళవారం రాత్రి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంలో పాత్రధారులుగా భావిస్తున్న మరో 20 మంది దేశం విడిచి వెళ్లకుండా ఉండేందుకు లుకౌట్ నోటీసులు జారీ చేయాలని ఏసీబీ నిర్ణయించింది. దీనికి సంబంధించి బుధవారం అధికారికంగా నోటీసులు జారీ చేయనుంది. సీఆర్పీసీ సెక్షన్ 160 కింద వీరందరినీ దశలవారీగా విచారణకు రావాలని నోటీసులు జారీ చేయనుంది. వీరిలో సీఎం చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రి సుజనా చౌదరి, రాజ్యసభ సభ్యులు సీఎం రమేశ్, గరికపాటి మోహన్‌రావు, శాసనసభ్యులు ఎర్రబెల్లి దయాకర్‌రావుతో పాటు ఒక మాజీ ఎంపీ, నలుగురు మాజీ ఎమ్మెల్యేలు, ఇతర దేశం నేతలు ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటేయాలంటూ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో రూ.5కోట్లకు ఒప్పందం కుదుర్చుకుని రూ.50 లక్షలు అడ్వాన్స్‌గా ఇస్తూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో స్టీఫెన్‌సన్‌తో ఏపీ సీఎం చంద్రబాబు నేరుగా బేరసారాలు సాగించిన ఆడియో రికార్డులు, రేవంత్ డబ్బు ఇస్తుండగా చిత్రీకరించిన వీడియో దృశ్యాలు బహిర్గతమయ్యాయి కూడా. ఈ వ్యవహారంలో ఏకంగా రూ.150 కోట్ల వరకు ఖర్చుచేసి, పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి తెలుగుదేశం పార్టీ ప్రయత్నించిందని ఏసీబీ దర్యాప్తులో వెల్లడైంది. ఈ వ్యవహారానికి సంబంధించిన వీడి యో, ఆడియో రికార్డులను ఇప్పటికే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ(ఎఫ్ఎస్ఎల్)కు పంపారు. వాటి గుట్టు తేల్చేందుకు నిపుణులైన అధికారుల బృందం 24 గంటలూ పనిచేస్తోంది. వీటిపై ఎఫ్ఎస్ఎల్ నుంచి బుధవారం సాయంత్రానికి కోర్టుకు నివేదిక అందే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఈ నివేదిక అందిన మరుక్షణమే చంద్రబాబుకు నోటీసులు జారీ చేయాలని ఏసీబీ భావిస్తున్నారు. అయితే నోటీసులు అందుకునే వ్యక్తి ఏపీ ముఖ్యమంత్రి అయినందున చంద్రబాబు భాగస్వామ్యానికి గల ఆధారాలతో గవర్నర్ నరసింహన్‌కు ఏసీబీ 17 పేజీల నివేదికను అందజేసింది. ఇదే నివేదికను కేంద్ర హోంశాఖ కార్యదర్శికి మంగళవారం రాత్రే అందజేసింది. ఈ నివేదికను పరిశీలించిన గవర్నర్... ఆధారాలు ఉన్నాయని సంతృప్తి చెందితే నోటీసులిచ్చేందుకు అభ్యంతరం లేదని ఏసీబీకి మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. అయితే అంతకంటే ముందు ఈ నివేదికపై న్యాయ నిపుణులతో చర్చలు జరిపినట్లు సమాచారం. గోప్యంగా ఉంచిన ఏసీబీ.. ‘ఓటుకు నోటు’ కేసులో అరెస్టు చేయబోతున్న ఇద్దరు టీడీపీ ముఖ్య నేతల పేర్లను ఏసీబీ గోప్యంగా ఉంచింది. న్యాయస్థానం నుంచి వారెంట్లు పొందినప్పటికీ వారెవరన్నది బయటకు రాలేదు. అయితే నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు ఇవ్వజూపిన రూ.50 లక్షలను సమకూర్చినవారే ఆ ఇద్దరు నేతలని అత్యున్నత వర్గాల నుంచి అందిన సమాచారం. విచారణలో సెబాస్టియన్, ఉదయ సింహ వెల్లడించిన అంశాల ఆధారంగా దర్యాప్తు చేయగా.. ఈ ఇద్దరు నేతల ఖాతాల నుంచే ఆ డబ్బు విత్‌డ్రా చేసినట్లు ఏసీబీ నిర్ధారించింది. ఆ డబ్బే రేవంత్‌కు చేరినట్లు స్పష్టమైన ఆధారాలు సంపాదించింది. ఈ ఆధారాలను ఏసీబీ కోర్టుకు సమర్పించి అరెస్టు చేసేందుకు వారెంట్లు పొందినట్లు తెలిసింది. అయితే ఏసీబీ అరెస్టులపై మంగళవారం ప్రచారం జరగడంతో టీడీపీ నేతలు కొందరు వారి నివాసాల వద్ద ఆంధ్రప్రదేశ్ పోలీసులను మోహరించగా.. ఈ విషయాన్ని డీజీపీ అనురాగ్‌శర్మ, హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇక్కడి శాంతిభద్రతలతో నిమిత్తం లేని ఏపీ పోలీసులను నగరంలో మోహరించడం చట్టరీత్యా చెల్లుబాటు కాదని... ఇది శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రమాదముందని ఆయనకు వివరించారు. దీనిపై డీజీపీ మంగళవారం రాత్రి కేంద్ర హోం శాఖకు ఓ నివేదికను ఫ్యాక్స్ చేశారు కూడా. ఈ నేపథ్యంలో అరెస్టు చేసేందుకు వెళితే.. ఏపీ పోలీసుల చేత గొడవలు సృష్టించే అవకాశం ఉండడంతో న్యాయస్థానం ఆదేశాల మేరకు నడుచుకోవాలని ఏసీబీ నిర్ణయించిందని.. అందువల్లే కోర్టు నుంచి వారెంట్లు పొందిందని అధికారవర్గాలు వెల్లడించాయి. పక్కా ఆధారాలతో ముందుకు.. ‘ఈ కేసులో అణువణువు పరిశీలించి స్పష్టమైన ఆధారాలను సంపాదించాం. దీనివల్ల కొంత జాప్యం జరిగిన మాట వాస్తవం. నూరు శాతం చట్టానికి లోబడి ఈ కేసును దర్యాప్తు చేస్తున్నాం. అందువల్ల కేసు ఇప్పటిదాకా అనుకున్న స్థాయిలో ముందుకు వెళ్లలేదు. బుధవారం నుంచి మా కార్యాచరణను మీరే చూస్తారు..’ అని ఓ ఏసీబీ సీనియర్ అధికారి పేర్కొనడం గమనార్హం. ఈ కేసులో ముందుకు వెళ్లేందుకు మీడియా కథనాలూ ఉపయోగపడ్డాయని ఆ అధికారి పేర్కొన్నారు. సీఆర్పీసీ సెక్షన్ 160ని అనుసరించి 20 మందిని విచారించబోతున్నామని, వారిలో ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు ఓ కేంద్ర మంత్రి, ఇద్దరు రాజ్యసభ సభ్యులు, నలుగురు ఎమ్మెల్యేలు, ఓ మాజీ ఎంపీ, నలుగురు మాజీ ఎమ్మెల్యేలు, ఇతర టీడీపీ నేతలు ఉన్నారని ఆ అధికారి చెప్పారు. సీఆర్పీసీ సెక్షన్ 160 అంటే సాక్షి, హైదరాబాద్: ఏదైనా కేసుతో సంబంధమున్న వ్యక్తిని తమ ఎదుట సాక్షిగా హాజరుకావాలని ఆదేశిస్తూ నోటీసులు జారీచేసే అధికారాన్ని దర్యాప్తు అధికారులకు నేర శిక్షా స్మృతి(సీఆర్పీసీ)లోని సెక్షన్ 160 కల్పిస్తోంది. తమ పరిధితో పాటు ఇతర పోలీస్స్టేషన్ల పరిధిలో ఉన్న వ్యక్తులను సైతం విచారణకు హాజరుకావాల్సిందిగా దర్యాప్తు అధికారులు కోరవచ్చు. సాధారణంగా అనుమానితులను విచారించేందుకు ఈ సెక్షన్ కింద నోటీసులు జారీచేస్తూ ఉంటారు. ఈ నోటీసులో నిర్దేశించిన సమయం, ప్రాంతానికి సదరు వ్యక్తులు హాజరుకాకపోతే.. ఐపీసీ సెక్షన్ 174 కింద వారు శిక్షార్హులు. గరిష్టంగా నెల రోజుల వరకు జైలు శిక్ష లేదా రూ.500 జరిమానా లేదా రెండూ విధించే అవకాశముంది. వేం నరేందర్‌రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం! సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు నోటు’ కేసులో టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వేం నరేందర్‌రెడ్డికి మంగళవారం రాత్రి సీఆర్పీసీ సెక్షన్ 160 కింద ఏసీబీ నోటీసులు జారీచేసింది. విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశించింది. తొలుత హైదరాబాద్‌లో హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్ట్స్‌లోని 208వ నంబర్ క్వార్టర్లో ఉన్న సండ్ర నివాసానికి ఏసీబీ అధికారులు వెళ్లారు. ఆసమయంలో ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడంతో నోటీసులను క్వార్టర్ తలుపునకు అంటించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ముందు జరిగిన కొనుగోళ్ల వ్యవహారంలో ఖమ్మం జిల్లాకు చెందిన కొందరు ఎమ్మెల్యేలతో సండ్ర వెంకట వీరయ్య బేరసారాలు జరిపినట్లు ఆరోపణలున్నాయి. ఇక హైదరాబాద్ ఆదర్శనగర్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని వేం నరేందర్‌రెడ్డి నివాసానికి వెళ్లి ఏసీబీ అధికారులు నోటీసులు అందజేశారు. తొలుత వేం నరేందర్‌రెడ్డిని అరెస్టు చేయాలనే ఉద్దేశంతో 18 మందితో కూడిన 4 ఏసీబీ బృందాలు ఆయన ఇంటికి వెళ్లాయి. కానీ తాను గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నానని, ఇప్పుడు రాలేనని వేం నరేందర్‌రెడ్డి విజ్ఞప్తి చేసుకున్నారు. అయితే తమ వద్ద వైద్యులు, సదుపాయాలున్నాయని.. రావాల్సిందేనని అధికారులు తేల్చిచెప్పారు. అయినా తాను ఎప్పుడంటే అప్పుడు విచారణకు హాజరవుతానని, అవసరమైతే ఉదయం 5.30కే వస్తానని నరేందర్‌రెడ్డి కోరడంతో.. దానికి అంగీకరించిన ఏసీబీ అధికారులు నోటీసులు అందజేసి వెళ్లిపోయారు. కానీ ఆయనను గృహనిర్భంధం చేశారు. ఇంటి బయట కొందరు పోలీసులు కాపలాగా ఉన్నారు. బుధవారం ఉదయమే వేం నరేందర్‌రెడ్డిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. -
'ఏసీబీ నుంచి నాకు నోటీసులు రాలేదు'
హైదరాబాద్: తెలంగాణ ఏసీబీ అధికారుల నుంచి తనకు ఎటువంటి నోటీసులు రాలేదని ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తెలిపారు. సాక్షి మీడియాతో ఆయన ఫోన్ ద్వారా మాట్లాడారు. 'ఓటుకు కోట్లు' వ్యవహారంలో ఒకవేళ ఏసీబీ నుంచి నోటీసులు అందితే, వారిచ్చిన గడువులోపు సమాధానాలు చెప్పెందుకు తాను సిద్ధమని టీడీపీ ఎమ్మెల్యే అన్నారు. రేపు హైదరాబాద్ కు వచ్చి అసలు నోటీసులు ఏం ఇచ్చారో, వాటిలో ఏం ఉందో చూడాలన్నారు. ఆ తర్వాత నోటీసుల విషయంపై నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పారు. -
'ఓటుకు కోట్లు'లో టీడీపీ ఎమ్మెల్యేకు ఏసీబీ నోటీసులు
హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసు వ్యవహారంలో తెలంగాణ ఏసీబీ ప్రత్యక్ష కార్యచరణకు దిగింది. రోజంతా ఏసీబీ నోటీసులిస్తుందన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే ఏసీబీ అధికారులు ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటట వీరయ్యను విచారణ అధికారి ముందు హజరుకావాలని నోటీసులు జారీ చేశారు. ఏసీబీ బృందం హైదర్ గూడలోని టీడీపీ ఎమ్మెల్యే క్వార్టర్స్ నంబర్ 208 (ఇంటికి)కి వెళ్లగా ఆయన అందుబాటులో లేరని తెలుస్తుంది. టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఇంట్లో కూడా ఎవరూ లేకపోవడంతో ఇంటి గోడలకు నోటీసులను అంటించారు. ఆయనపై సీఆర్పీసీ సెక్షన్ 160 కింద కేసు నమోదు చేసినట్లు ఏసీబీ పేర్కొంది. సండ్ర వెంకట వీరయ్యకు నోటీసులు ఇవ్వడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఈ కేసు పట్ల దూకుడుగా వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. రేపు కూడా మరికొంత మంది టీడీపీ నాయకులకు, ప్రజా ప్రతినిధులకు, నోటీసులు జారీ చేసే అవకాశముందని ఏసీబీ వర్గాలు వెల్లడించాయి.