వైద్యులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే సండ్ర
సత్తుపల్లిటౌన్ ఖమ్మం జిల్లా : కోట్లాది రూపాయలతో ప్రభుత్వం ప్రచార గొప్పలే తప్పా.. రాష్ట్రంలో కేసీఆర్ కిట్లు అందటం లేదని, సాక్షాత్తు మంత్రులు లక్ష్మారెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించిన డయాలసీస్ కేంద్రానికి నాలుగు నెలలైనా సేవలకు దిక్కులేదని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆరోపించారు.
శుక్రవారం సత్తుపల్లి ఏరియా ప్రభుత్వాస్పత్రిలోని డయాలసీస్ కేంద్రాన్ని పరిశీలించారు. డయాలసీస్ కేంద్రంలో ఏమీ లేకున్నా.. ఆర్భాటంగా ఇద్దరు మంత్రులు ప్రారంభించారని ఎద్దేవా చేశారు. ఒకే కాంట్రాక్టర్‌కు 40 డయాలసీస్ కేంద్రాల నిర్వహణ అప్పగించటం వల్లే పనులు సాగటం లేదని ఆరోపించారు.
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సంబంధిత కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. కేసీఆర్ కిట్లు కొరతపై డీఎంఅండ్‌హెచ్‌ఓ కొండల్‌రావుకు ఫోన్ చేసి అడిగారు. అయితే సరఫరా కాలేకపోవటం వల్ల పంపిణీ చేయలేదని తెలిపారు. వెంటనే వైద్య, ఆరోగ్యశాఖ కమిషనర్ వాకాటి కరుణకు ఫోన్ చేసి సమస్యను వివరించారు.
సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రిలో కేసీఆర్ కిట్లు లేక 45 రోజులైంది.. జిల్లా మొత్తం పరిస్థితి ఇలాగే ఉంది.. ఇండెంట్ పెట్టినా సరఫరా చేయటం లేదని ఎ మ్మెల్యే సండ్ర తెలిపారు. సీజనల్ వ్యాధులకు కావాల్సిన మందులను అందుబాటులో ఉంచాలని సూపరింటెండెంట్ డాక్టర్ వసుమతీదేవిని ఆదేశించారు.
జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మదన్‌సింగ్‌కు ఫోన్ చేసి సత్తుపల్లి ఆస్పత్రిని సందర్శించి సమస్యలపై దృష్టి పెట్టాలని కోరారు. ఎమ్మెల్యే వెంట గొర్ల సంజీవరెడ్డి, కూసంపూడి రామారావు, కూసంపూడి మహేష్, తడికమళ్ల ప్రకాశరావు, ఎస్‌కె చాంద్‌పాషా, అద్దంకి అనిల్, కంభంపాటి మల్లికార్జున్, దూదిపాల రాంబాబు, చక్రవర్తి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment