
ఒక పిల్లి కథ
హ్యూమర్‌ప్లస్
మనం దేన్నుంచి పారిపోవాలనుకుంటామో అదే మనల్ని వెంటాడి వేధిస్తుంది. ఇది తెలియక భార్యలు భర్తల నుంచి, భర్తలు భార్యల నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తుంటారు. సకాలంలో పాలు దొరికినంతకాలం జైలయినా ఒకటే, ఆరుబయటయినా ఒకటే. తల్లి భాష వల్ల ఒక పిల్లి చిక్కుల్లో పడింది. పాలగిన్నెని చూసినప్పుడల్లా ‘మ్యామ్యా’ అని మాతృభాషలో అరవడం వల్ల దానిపై ఏసీబీ అధికారుల కన్నుపడింది. వచ్చిపోయే వాళ్లందరిని ‘అమ్యామ్యా’ అని లంచం అడుగుతూందని కేసు కట్టి జైల్లో వేశారు. మరుక్షణమే ఊచల్లోంచి దూరి పిల్లి బయటికొచ్చింది.
‘‘నేతితో తప్ప నీతి అవినీతులతో నాకు సంబంధం లేదు’’ అని జైలు అధికారిని పిల్లి ప్రశ్నించింది. అలవాటుకొద్దీ అధికారి వెంటనే ఒక నివేదిక రాశాడు ‘‘కాలం మారుతున్నా జైళ్లు మారడం లేదు. ఊచల్ని గడ్డిపోచలుగా లెక్కేసే రోజులొచ్చాయి. మనుషులతో పాటు జంతువుల్లో కూడా నేర ప్రవృత్తి పెరిగిపోతూ ఉంది. అవి వృత్తి నేరస్తులుగా మారిపోతున్నాయి. మనుషుల్ని జంతువులుగా చూడడం అధికార ధర్మం. కానీ జంతువులను ఎలా చూడాలన్నది ధర్మ సందేహం. నేరస్తుల్ని చావబాదాలన్నా, బాది చంపాలన్నా ముందు వాళ్లు పారిపోకుండా చూడడం మన విధి. అందువల్ల ఊచల డిజైన్ మార్చాలని విన్నవిస్తున్నాను’’ అని ఒక ఫైల్ తయారుచేశాడు. అనేక అధికారుల చేతులు మారి ‘జైలు ఊచలు ఉంచా రహ్‌నా’ అనే నినాదంగా తయారై ఒక కమిటీ ఏర్పాటైంది.
ఒక భౌతిక శాస్త్రవేత్త, నైతిక తత్వవేత్త, రాజకీయ భోక్త ఇలా పలువురితో కూడిన కమిటీ జైలుకొచ్చి ఊచల పొడవు, వెడల్పు చుట్టుకొలత, మందం, వైశాల్యం అన్నింటిని కొలతలు తీసుకుని వెళ్లింది. ఇదంతా చూసి పిల్లి పకపక నవ్వింది. ‘‘హాస్యం అంతరించిపోయి మనుషుల జీవితాలన్నీ రహస్యంగా మారిపోతున్న ఈ రోజుల్లో కూడా నవ్వుతున్నావంటే నువ్వు మామూలు పిల్లివి కాదు’’ అన్నాడు అధికారి. ‘‘నేను మామూలు పిల్లినే, అందుకే నవ్వుతున్నా. నాన్సెన్స్‌కి, సైన్స్‌కి తేడా తెలియదు మీకు. నా మెడలో ఒక గంట కడితే నేనెక్కడికి పారిపోతాను చెప్పు’’ అంది పిల్లి.
‘‘గంట కట్టాలని నాకు తెలుసు. కానీ ఈ విషయం పై అధికారికి చెప్పేదెవరు? బాస్‌కి ఎంత తెలుసో, అంతకంటే మనకు తక్కువ తెలిసుండాలి. బాస్‌కి ఏది తెలియదో, అది మనకు ఎప్పటికీ తెలియకూడదు. బాస్‌కి ఏబీసీడీలు రాకపోతే మనం ‘ఎ’ని గుర్తుపట్టనట్టు నటించాలి. నటన వల్లే నాలుగు వేళ్లు లోనకెళతాయి’’ అన్నాడు అధికారి. ‘‘స్వేచ్ఛగా కనిపిస్తూ బానిసల్లా జీవించేవాళ్లు మీరు. బానిసల్లా కనిపిస్తూ స్వేచ్ఛగా జీవించేవాళ్లం మేము’’ అంది పిల్లి. ‘‘నువ్వు పిల్లివి కాబట్టి ఫిలాసఫీ చెప్పడం కరెక్ట్ కాదు. స్వేచ్ఛే ముఖ్యమనుకుంటే నువ్వెందుకు పారిపోలేదు?’’
‘‘మనం దేన్నుంచి పారిపోవాలనుకుంటామో అదే మనల్ని వెంటాడి వేధిస్తుంది. ఇది తెలియక భార్యలు భర్తల నుంచి, భర్తలు భార్యల నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తుంటారు. సకాలంలో పాలు దొరికినంతకాలం జైలయినా ఒకటే, ఆరుబయటయినా ఒకటే.’’ ఇతరుల్ని పనిచేయిస్తుందో లేదో తెలియదు గాని, చట్టం మాత్రం తన పని తాను చేసుకుపోతుంది. పిల్లి ప్రభుత్వ ఉద్యోగే కానప్పుడు దాన్ని అరెస్ట్ చేయడం చట్టవిరుద్ధమని ఏసీబీ అధికారులు గ్రహించారు. విరుద్ధాన్ని సమ్మతం చేసుకోవాలంటే ముందు దానికో గవర్నమెంట్ ఉద్యోగమిచ్చి, ఆ తర్వాత కేసు పెట్టాలని నిర్ణయించుకున్నారు.
యూనిఫాం తగిలించి, చేతికో కర్ర ఇచ్చి ఒక ఆఫీస్‌లో గార్డ్ ఉద్యోగమిచ్చారు. అలెర్ట్‌గా వుండి ఎలుకల్ని పట్టడం డ్యూటీ. ఆశ్చర్యంగా ఒక్క ఎలుక కూడా కనిపించలేదు. ఈ విషయమై ఒక క్లర్క్‌ని అడిగింది. ‘‘మనుషులే కలుగుల్లో దూరుకుని ఎలుకల్లా మారిపోతున్నారు. అందువల్ల ఎలుకెవరో, మనిషెవరో కనుక్కోవడం కష్టం’’ అన్నాడాయన.
ఏం చేయాలో తెలియక పిల్లి డ్యూటీలో నిద్రపోసాగింది. బెస్ట్ గార్డ్‌గా రివార్డిచ్చారు. నిద్ర లేవగానే ‘క్యాట్సప్’ అని అభినందించేవాళ్లు. ఒకరోజు మూడుసార్లు నిద్రపోయి లేచేసరికి ‘క్యాట్రిక్’ అని అరిచారు. ఇదంతా విసుగెత్తి డ్యూటీ మానేసి రోడ్డుమీద వెళుతుంటే ‘బెస్ట్ క్యాట్‌వాక్’ అని మీడియా వచ్చి ఫొటోలు తీసింది. దొరికినవాణ్ని దొరికినట్టు కరిచింది పిల్లి.
‘‘ఇంట్లో సౌండ్ సిస్టమ్ చెడిపోతే వెంటనే రిపేరు చేయిస్తారు. మనం బతుకుతున్న సిస్టమే చెడిపోతే ఎవడూ పట్టించుకోడేంట్రా’’ అని కేకలు పెట్టింది. పిల్లి నడవడిక సిస్టమాటిక్‌గా లేదని దాన్ని వెంటనే జైల్లో పెట్టారు.
- జి.ఆర్.మహర్షి