ఆర్‌డబ్ల్యూఎస్‌లో ఆయనో అవినీతి తిమింగలం. లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు.
ఆర్‌డబ్ల్యూఎస్‌లో హల్‌చల్
అధికార పార్టీ నేతల అండ
కాంట్రాక్టర్ల గగ్గోలు
రూ.22 కోట్ల పనులపై విజిలెన్స్ దర్యాప్తు
ఆర్‌డబ్ల్యూఎస్‌లో ఆయనో అవినీతి తిమింగలం. లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. అయితేనేం అధికార పార్టీ నేతల అండదండలతో ఫోకల్ పోస్టింగ్ తెచ్చుకున్నాడు. పర్సంటేజ్‌ల కోసం కాంట్రాక్టర్లను కాల్చుకుతింటున్నాడు. అయ్యగారి ‘ఆనందం’ కోసం ముడుపులు సమర్పించుకోలేక కాంట్రాక్టర్లు ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటనలూ అనేకం ఉన్నాయి. ఆర్‌డబ్ల్యూఎస్‌లో పనంటే.. అయ్య ‘బాబో’య్ అనే పరిస్థితి నెలకొంది.
విజయవాడ : అధికార పార్టీ నేతల అండతో ఆర్‌డబ్ల్యూఎస్ (గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం)లో ఓ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అడ్డంగా దోచేస్తున్నారు. పర్సంటేజీ డబ్బు కోసం కాంట్రాక్టర్లను వేధింపులకు గురిచేస్తూ, బిల్లులు చేయటంలో ప్రజాప్రతినిధులను ఇబ్బందులు పెడుతున్నా అధికార పార్టీ నేతలు ఆ బాబుపై వల్లమాలిన అభిమానం చూపిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. 2014లో ఏసీబీ ట్రాప్‌లో రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన ఆ అధికారి, తాను పనిచేసే శాఖ ముఖ్య ప్రజాప్రతినిధికి లక్షలు కుమ్మరించి ఆదాయం దండిగా వచ్చే గన్నవరం నియోజకవర్గంలో ఫోకల్ పోస్టింగ్ పొందారు. అంతేకాదు.. పామర్రు నియోజకవర్గంలో ఇన్‌చార్జి బాధ్యతను కూడా అధికార పార్టీ నేత అండతో కైవసం చేసుకున్నారు. గన్నవరం, పామర్రు నియోజకవర్గాల్లో రెండు ఫోకల్ పాయింట్లను దున్నేస్తూ, కాంట్రాక్టర్లను, ప్రజాప్రతినిధులను ఇబ్బందులకు గురిచేస్తున్న వైనంపై పలువురు కాంట్రాక్టర్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
ఈ రెండు నియోజకవర్గాల్లో ఏడాదికాలంగా దాదాపు రూ.50 కోట్ల నుంచి రూ.60 కోట్ల వరకు విలువైన బిల్లులకు ఆయన చెక్ మెజర్‌మెంట్ చేయటం గమనార్హం. ఏసీబీ కేసును ఎదుర్కొంటున్న అధికారికి బిల్లులు, చెక్ మెజర్‌మెంట్ చేసి ఎంబుక్‌లు రికార్డు చేసే అధికారం లేదని, ఉయ్యూరు ప్రాంతానికి చెందిన పలువురు కాంట్రాక్టర్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఆయన్ని ఫోకల్ పోస్టింగ్ నుంచి తప్పించాలని వారు కోరుతున్నారు. సదరు అధికారి తీరుతో పలువురు కాంట్రాక్టర్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రూ.4 కోట్ల పనులకు ముగ్గురు కాంట్రాక్టర్లు...
గన్నవరం నియోజకవర్గంలో పదిరోజుల క్రితం పైపులైన్ పనులకు సంబంధించి టెండర్లు పిలిచారు. బాపులపాడులో జాతీయ రహదారి అధికారులు రోడ్ల విస్తరణకు సంబంధించి తాము చెల్లించాల్సిన రూ.4 కోట్ల పనులకు ఆర్‌డబ్ల్యూఎస్ ద్వారా టెండర్లు పిలిపించారు. వీటికి కనీసం 30 మంది కాంట్రాక్టర్లు పోటీపడి 20 శాతం తక్కువకు టెండర్లు వేయాల్సి ఉందని, కేవలం ముగ్గురే టెండర్లు వేయటం, మిగిలినవారు వెనకడుగేయటం సదరు అధికారికి భయపడటం వల్లేనని ఆరోపణలు వస్తున్నాయి. తద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీ గండిపడిందని తెలుస్తోంది.
ఫిర్యాదులు ఇలా...
ఇటీవల పామర్రు నియోజకవర్గంలో జరిగిన రూ.22 కోట్ల విలువైన పైపులైన్ పనులపై ఫిర్యాదులు వచ్చాయి. వీటిపై విజయవాడ విజిలెన్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. రూ.6 కోట్లతో చేపట్టిన అయ్యంకి నుంచి మొవ్వ స్కీమ్, రూ.16 కోట్లతో అయ్యంకి వయా యలమర్రు మీదుగా వెంట్రప్రగడకు చేసిన వాటర్ స్కీమ్‌లపై విజిలెన్స్ అధికారుల విచారణ కొనసాగుతోంది.
కొద్ది మాసాల క్రితం పామర్రు నియోజకవర్గంలోని యలమర్రు గ్రామ పంచాయతీలో ఓ బోరులో పాత మోటారు బిగించి కొత్తది కొన్నట్టు బిల్ చేశారు. దీనిపై రగడ జరగటంతో అధికార పార్టీ ముఖ్య నేత సహాయంతో బయటపడ్డారు. బాపులపాడు మండలంలోని పెలైట్ ప్రాజెక్టులో మోటార్లు లేకుండానే బిల్లులు చేసినట్లు ఫిర్యాదులు అందాయి.నెల రోజుల క్రితం భూపతిరెడ్డి అనే కాంట్రాక్టరు పామర్రులోని ఆర్‌డబ్ల్యూఎస్ కార్యాలయంలో అందరూ ఉండగానే ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశారు. పక్కనున్నవారు అతన్ని వారించారు. పెండింగ్ బిల్లుల చెల్లింపులో సదరు అధికారి పెడుతున్న ఇబ్బందులే కారణమని అతను ఆవేదన వ్యక్తం చేయటం గమనార్హం.
నాలుగు మాసాల క్రితం పామర్రు నియోజకవర్గంలో బిల్లుల పెండింగ్ అంశంపైనే తీవ్ర ఆవేదనతో వెంకటేశ్వరరావు అనే కాంట్రాక్టరు తాను నిర్మించిన ట్యాంకు పైనుంచి దూకి ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించాడు. కిందిస్థాయి అధికారులు జోక్యం చేసుకుని అతని సమస్య పరిష్కరించారు.