
మేమే డొనేషన్ ఇస్తాం.. సమన్లు తీసుకోండి
♦ లంచం ఇవ్వబోయిననిందితురాలితో సీసీఎస్ పోలీసులు
♦ విషయం తెలిసి సిబ్బందిని ప్రశంసించిన కమిషనర్
సాక్షి, హైదరాబాద్: ‘న్యాయస్థానం జారీ చేసిన సమన్లు ఇవ్వొద్దు. నేను అందుబాటులో లేనంటూ నమోదు చేసుకోండి. అందుకు ప్రతిగా రూ.500 ఇస్తా’ - సీసీఎస్ పోలీసులతో ఓ నిందితురాలి వ్యాఖ్య
‘అలా కుదరదు మేడం. ఎట్టి పరిస్థితుల్లోనూ సమన్లు అందుకోవాల్సిందే. అందుకు ప్రతిగా అవసరమైతే మేమే రూ.1000 డొనేషన్ ఇస్తాం’
- స్పష్టం చేసిన సీసీఎస్ సిబ్బంది
కొన్ని రోజుల క్రితం జరిగిన ఈ అంశం మంగళవారం నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి దృష్టికి వచ్చింది. జరిగిన విషయం ఆరా తీసిన ఆయన లంచం తిరస్కరించిన కానిస్టేబుళ్లను ప్రశంసించారు.
ఇదీ కేసు నేపథ్యం...
నగరానికి చెందిన ఓ ప్రముఖ వ్యాక్సిన్ల తయారీ సంస్థ డెరైక్టర్ల మధ్య తలెత్తిన విభేదాలకు సంబంధించి నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) పోలీసులు 2013లో కేసు రిజిస్టర్ చేశారు. ఈ వ్యవహారంలో కుమార్తెల ఫిర్యాదు మేరకు తల్లిపై ఆరోపణలు నమోదయ్యాయి. ఆ సంస్థకు సీఎండీ వ్యవహరించిన యజమాని మరణానంతరం ఆయన కుమార్తెల్లో ఒకరు ఆ బాధ్యతలు స్వీకరించారు. మరో ఇద్దరు కుమార్తెలు బోర్డులో డెరైక్టర్లుగా ఉన్నారు. వీరిలో ఒకరు ఈ కుటుంబానికే చెందిన మరో సంస్థకూ డెరైక్టర్. యజమాని భార్య సైతం అప్పటికే ఆ బోర్డులో డెరైక్టర్‌గా కొనసాగుతున్నారు. 2013లో ‘మరో సంస్థ’కు చెందిన కీలక డాక్యుమెంట్లు దాని కార్యాలయం నుంచి పోయాయని, అందులో తమ తల్లి ప్రమే యం ఉందని ఆరోపిస్తూ కుమార్తెలు సీసీఎస్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇటీవల ఏం జరిగిందంటే...
సీసీఎస్ పోలీసులు నమోదుచేసిన కేసులో నిందితురాలి గా ఉన్న మహిళకు న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. వీటిని అందించడానికి సీసీఎస్ సిబ్బంది వెళ్లారు. సమన్లు తీసుకోవడానికి నిరాకరించిన నిందితురాలు... పోలీసులకు రూ.500 లంచం ఇవ్వడానికి ప్రయత్నించారు. సదరు చిరునామాలో తాను అందుబాటులో లేనంటూ సమన్లు జారీ చేయవద్దని కోరారు. దీంతో సీసీఎస్ సిబ్బంది అసహనం వ్యక్తం చేస్తూ... సమన్లు స్వీకరించాలని, వాటితో పాటు తామే రూ.1000 డొనేషన్‌గా ఇస్తామంటూ ఆమెకు స్పష్టం చేశారు.
అప్పటికీ తీసుకోవడానికి నిరాకరించడంతో ఆ సమన్లను ఆమె ఇంటి గేటు వద్ద అతికించి, ఆ ఫొటోలు తీసుకుని వచ్చా రు. ఈ కేసులో ఫిర్యాదుదారులు రెండు రోజుల క్రితం నగర కొత్వాల్‌ను కలిసి ‘రూ.500’ విషయంపై ఆయన కు ఫిర్యాదు చేశారు. దీంతో కమిషనర్ ఆరా తీయగా... జరిగిన విషయం ఆయన దృష్టికి వచ్చింది. లంచం తిరస్కరించడంతో పాటు సమన్ల జారీ విషయంలో నిబంధనల ప్రకారం వ్యవహరించిన సీసీఎస్ సిబ్బందిని ప్రశంసించారు.