ఏసీబీ వలలో ఉప ఖజానా ఉద్యోగి | ACB into the trap of sub-treasury employee | Sakshi
Sakshi News home page

ఏసీబీ వలలో ఉప ఖజానా ఉద్యోగి

Published Fri, Oct 10 2014 2:10 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

ACB into the trap of sub-treasury employee

  • సరెండర్ లీవ్ బిల్లు మంజూరుకు రూ.2వేలు డిమాండ్
  •  లంచం తీసుకుంటూ చిక్కిన మైలవరం సబ్ ట్రెజరీ సూపరింటెండెంట్
  • మైలవరం : సరెండర్ లీవ్ మంజూరు బిల్లు విడుదల చేయడానికి రూ.2వేలు లంచం తీసుకున్న మైలవరం సబ్ ట్రెజరీ సూపరింటెండెంట్‌ను ఏసీబీ అధికారులు గురువారం సాయంత్రం వలపన్ని పట్టుకున్నారు. ఏసీబీ విజయవాడ రేంజ్ డీఎస్పీ ఆర్.విజయపాల్ తెలిపిన వివరాల ప్రకారం.. గుంటుపల్లిలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో వాచ్‌మన్‌గా పనిచేస్తున్న రవికుమార్ గత నెలలో లీవ్ సరెండర్ చేసినందుకు రూ.19,389 మంజూరైంది.

    ఈ మొత్తానికి మైలవరం సబ్ ట్రెజరీలో బిల్లు పాస్ చేసేందుకు సూపరింటెండెంట్ జి.కృష్ణయ్య రూ.2 వేలు లంచం డిమాండ్ చేశాడు. తాను లంచం ఇచ్చుకోలేనని రవికుమార్ చెప్పినా అతడు అంగీకరించలేదు. ముందుగా బిల్ పాస్ చేయాలని, తన బ్యాంకు అకౌంట్‌లో సొమ్ము జమ కాగానే రూ.2 వేలు ఇస్తానని రవికుమార్ కోరాడు. దీంతో కృష్ణయ్య బిల్లు మంజూరు చేశాడు. బిల్లు మంజూరయ్యాక రవికుమార్ లంచం ఇవ్వలేదు.

    ఈ నెల బిల్లులు తీసుకునేందుకు అతడు బుధవారం మైలవరం సబ్ ట్రెజరీ కార్యాలయానికి వచ్చాడు. తనకు లంచం ఇవ్వలేదని, బిల్లులు మంజూరు చేయనని సూపరింటెండెంట్ చెప్పాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారు రసాయనం పూసిన రూ.2వేల కరెన్సీని రవికుమార్‌కు ఇచ్చి గురువారం సాయంత్రం పంపించారు.

    అతడు ఆ నోట్లను సూపరింటెండెంట్‌కు ఇచ్చి, ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే ఏసీబీ డీఎస్పీ విజయపాల్ ఆధ్యర్యంలో సీఐలు నాగరాజు, శ్రీనివాసరావు సిబ్బందితో దాడి చేసి కృష్ణయ్య లంచంగా తీసుకున్న మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు జరిపిన పరీక్షల్లో సూపరింటెండెంట్ లంచం తీసుకున్నట్లు నిర్ధారణ అయింది. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు.

    ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని శుక్రవారం ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ చెప్పారు. ఎవరైనా లంచం తీసుకున్నా, అడిగినా వెంటనే తమకు సమాచారం ఇస్తే అవినీతిని అరికట్టడానికి చర్యలు తీసుకుంటామన్నారు. లంచం ఇచ్చినా, తీసుకున్నా నేరమేనన్నారు. అవినీతిని అరికట్టడానికి ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే 9440446164, 9440446167, 9440446169 నంబర్లకు ఫోన్‌చేసి సమాచారం ఇవ్వాలని డీఎస్పీ పేర్కొన్నారు.   
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement