అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల తొలగింపు
వాటి వద్ద లంచాల దందాకు ముగింపు
రవాణా శాఖ సేవలన్నీ ఆన్‌లైన్
అనుమతులన్నీ ఆన్‌లైన్‌లోనే జారీ
రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం
సాక్షి, అమరావతి: ‘సరుకు రవాణా వాహనాలు రాష్ట్ర సరిహద్దుల్లోకి ప్రవేశిస్తే చాలు.. అంతర్రాష్ట్ర చెక్ పోస్టు వద్ద నిలపాలి.. అనుమతులు తీసుకోవాలి.. అందుకోసం లంచాలు ఇవ్వాలి’. ఇదీ దశాబ్దాలుగా సరిహద్దుల్లో కనిపించే సాధారణ దృశ్యం. ఇటువంటివాటికి రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది.
సరిహద్దుల్లో చెక్ పోస్టుల వద్ద లంచాల బెడదను శాశ్వతంగా నిర్మూలించింది. రవాణా శాఖ అందించే అన్ని రకాల సేవలు, అనుమతుల జారీని ఆన్‌లైన్ విధానంలోకి మార్చింది. అంతేకాదు రాష్ట్రంలోని 15 అంతర్రాష్ట్ర చెక్ పోస్టులను శాశ్వతంగా తొలగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది.
అనుమతులన్నీ ఆన్‌లైన్‌లోనే..
రాష్ట్రంలో దశాబ్దాల నుంచి 15 రవాణా శాఖ చెక్ పోస్టులున్నాయి. వాటిలో 13 రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్నాయి. మిగిలిన రెండింటిలో ఒకటి తిరుపతి జిల్లా రేణిగుంటలోనూ, మరొకటి కాకినాడ జిల్లా తేటగుంటలోను ఉన్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీలోకి ప్రవేశించే వాహనాల నుంచి పన్ను వసూలు, తాత్కాలిక పర్మిట్ జారీలతోపాటు మోటారు వాహనాల చట్టం ఉల్లంఘనలను అరికట్టేందుకు వీటిని ఏర్పాటు చేశారు. ఈ అనుమతుల జారీ పేరుతో అక్కడి సిబ్బంది లంచాలు డిమాండ్ చేయడం సర్వసాధారణంగా మారింది. దీంతో ఈ విధానాన్ని తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రయోగాత్మకంగా అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల వద్ద అందించే సేవలు, అనుమతులను గతేడాది జూలై నుంచి ఆన్‌లైన్ ద్వారా జారీ చేసే విధానాన్ని ప్రవేశపెట్టింది. ఆన్‌లైన్ విధానం ప్రవేశపెట్టడంతో రవాణా శాఖ కార్యాలయాలు, అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల వద్దకు వచ్చే వాహనదారుల సంఖ్య గణనీయంగా తగ్గింది. సులభంగా, పారదర్శకంగా అనుమతులు జారీ అవుతున్నాయి.
ఆన్‌లైన్ విధానం లేని 2022–23లో వివిధ అనుమతుల జారీ కింద మొత్తం రూ.51.64 కోట్ల ఆదాయం వచ్చింది. కాగా ఆన్‌లైన్ విధానం ప్రవేశపెట్టాక 2023 జూలై నుంచి 2024 ఫిబ్రవరి వరకు వివిధ అనుమతుల జారీ కింద రూ.62.82 కోట్లు రావడం గమనార్హం. గతంలో అధికారిక అనుమతులు లేకుండా లంచాలు తీసుకుని మరీ వాహనాల ప్రవేశానికి అనుమతించేవారన్నది స్పష్టమవుతోంది. ఆన్‌లైన్ విధానం సరుకు రవాణా వాహనదారులకు సౌలభ్యంగా ఉండటంతోపాటు ప్రభుత్వ ఖజానాకు రాబడిని పెంచింది.
ప్రయోజనాలు ఇవీ...
♦ సరుకు రవాణా వాహనాలను ఇక రాష్ట్ర సరిహద్దుల్లో అనుమతుల కోసం నిలపాల్సిన అవసరం లేదు. దీంతో ట్రాఫిక్ సమస్య తగ్గుతుంది.
♦ ప్రస్తుతం సరుకు రవాణా వాహనాలు సగటున గంటకు 35 కి.మీ.మేర ప్రయాణిస్తున్నాయి. అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులు తొలగించడంతో సగటున గంటకు 55 కి.మీ. వేగంతో ప్రయాణిస్తాయి.
♦ ప్రస్తుతం దేశంలో సరుకు రవాణా వాహనాలు రోజుకు సగటున 360 కి.మీ. ప్రయాణిస్తున్నాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో రోజుకు సగటున 1,200 కి.మీ. ప్రయాణిస్తున్నాయి. ప్రస్తుతం అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులు తొలగించడంతో రాష్ట్రంలో రోజుకు సగటున 550 కి.మీ. దూరం ప్రయాణించేందుకు అవకాశం కలుగుతుంది. దీంతో త్వరగా గమ్యస్థానానికి చేరుకోవడంతోపాటు సరుకు రవాణా వ్యయం తగ్గుతుంది.
Comments
Please login to add a commentAdd a comment