ఆ విషయంలో మనమే టాప్!
బెర్లిన్/న్యూఢిల్లీ: ప్రభుత్వాలు మారినా, అధికారం చేతులు మారుతున్నా ఇండియాలో అవినీతి రేటు పెరుగుతూనే ఉంది. ప్రభుత్వ కార్యాలయాల్లో బల్లకింద చేతులు పెట్టే ఆనవాయితీకి అడ్డుకట్ట పడడం లేదు. ఆసియా పసిఫిక్ లో అత్యంత అవినీతి దేశంగా భారత్ నిలిచిందని తాజా సర్వే వెల్లడించింది. ప్రభుత్వాధికారులకు లంచాలు ఇచ్చామని మూడింట రెండొంతుల మంది భారతీయులు చెప్పారని అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక సంస్థ 'ట్రాన్స్ పరెన్సీ ఇంటర్నేషనల్' నిర్వహించిన సర్వే తెలిపింది.
అమ్యామ్యాలు సమర్పించుకున్నామని భారత్ లో 69 శాతం మంది చెప్పారు. ఇండియా తర్వాతి స్థానంలో వియత్నాం నిలిచింది. లంచాలు ఇచ్చామని వియత్నాంలో 65 శాతం మంది వెల్లడించారు. పాకిస్థాన్ లో 40 శాతం, చైనాలో 26 శాతం మంది లంచాలు ఇచ్చినట్టు తెలిపారు. జపాన్ అతి తక్కువగా 0.2 శాతం మంది మాత్రమే లంచాలు ఇచ్చినట్టు పేర్కొన్నారు. గత సంవత్సర కాలంతో పోలిస్తే చైనాలో 73 శాతం అవినీతి పెరిగిందని సర్వే అంచనా వేసింది. 16 దేశాల్లో 20 వేల మంది అభిప్రాయాలతో సర్వే నిర్వహించారు. ఆసియా పసిఫిక్ దేశాల్లో 90 కోట్ల మంది గత సంవత్సర కాలంలో కనీసం ఒక్కసారైనా లంచం ఇచ్చారని ఈ సర్వే అంచనా వేసింది. లంచాలు తీసుకోవడంతో పోలీసులు అందరి కంటే ముందున్నారని వెల్లడించింది.
'అవినీతిని అంతం చేయడానికి ప్రభుత్వాలు మరింత సమర్థవంతంగా పనిచేయాల్సిన అవసరముంది. మాటలు కట్టిపెట్టి చేతల్లో చూపించాల్సిన సమయం ఆసన్నమైంది. లక్షలాది మంది ప్రజలు ప్రభుత్వ సేవలకు లంచాలు సమర్పించుకుంటున్నారు. అవినీతి కారణంగా ఎక్కువగా పేదలే నష్టపోతున్నార'ని ట్రాన్స్ పరెన్సీ ఇంటర్నేషనల్ అధిపతి జోస్ ఉగాజ్ పేర్కొన్నారు.