భార్యాపిల్లలతో తిరుపతి(ఫైల్)
లంచం అడిగితే చెప్పుతో కొట్టండని రెండ్రోజుల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చినా.. అధికారుల తీరులో మాత్రం మార్పు కానరావడం లేదు.ఇదే లంచం ఓ రైతు కుటుంబాన్నిబలి తీసుకుంది.
కాసిపేట (బెల్లంపల్లి): రుణం మంజూరు కోసం లంచం ఇచ్చుకోలేక ఓ రైతు భార్యా ఇద్దరు పిల్లలకు విషం తాగించి, అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య మృతి చెందగా.. పిల్లలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన గురువారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం చొప్పరిపల్లిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన తిరుపతి తనకున్న రెండు ఎకరాల పొలంతో పాటు మరో ఐదెకరాలు కౌలుకు తీసుకొని కూరగాయలు, ఇతర పంటలు సాగు చేస్తున్నాడు. వ్యవసాయంలో ఆశించిన మేరకు లాభాలు రాకపోవడంతో అప్పుల పాలయ్యాడు. దీంతో వ్యవసాయం వదిలి టెంట్‌హౌస్ కోసం ఎస్సీ కార్పొరేషన్‌లో రుణం కోసం దరఖాస్తు చేసుకున్నాడు.
ఇటీవల కలెక్టర్ ఆర్‌వీ.కర్ణన్‌ను కలసి తన దీనస్థితిని వివరించగా.. స్పందించిన ఆయన యూనిట్ మంజూరుకు సిఫారసు చేశారు. అయితే ఎంపీడీఓ కార్యాలయంలో విధులు నిర్వహించే జూనియర్ అసిస్టెంట్ ప్రణయ్ రుణం మంజూరుకు రూ.20 వేలు లంచం అడగడంతో ఇప్పటికే అప్పుల పాలైన తాను లంచం ఇచ్చుకునే స్థితిలో లేనని, ఇక రుణం రాదని తీవ్ర మనస్తాపం చెందాడు. ఈ నేపథ్యంలో కుటుంబంతో సహా చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఫిబ్రవరి 27న రాత్రి భార్య భూదేవి (31), కుమార్తె కీర్తన (14), కుమారుడు శిశాంత్ (12)లకు నిద్రమాత్రలు ఇచ్చి తానూ వేసుకున్నాడు. అందరూ తీవ్రమైన మత్తులోకి జారుకున్నారు. కానీ అదృష్టవశాత్తు వారికి ప్రాణాపాయం జరగలేదు. అప్పటి నుంచి ఆందోళనగా ఉన్న తిరుపతి.. బుధవారం రాత్రి భార్యాపిల్లలకు యాపిల్ జ్యూస్‌లో క్రిమిసంహారక మందు తాగించాడు. పిల్లలు అపస్మారక స్థితిలోకి చేరుకోగా, భార్య మృతి చెందింది. ముగ్గురూ చనిపోయినట్లు భావించిన తిరుపతి.. తన అన్నయ్య శంకర్‌కు ఫోన్ చేయగా.. అతను ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఇంట్లో చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం శంకర్ తిరిగి ఫోన్ చేయగా కొద్దిగా స్పృహలోకి వచ్చిన పిల్లలు ఫోన్ లిఫ్ట్ చేసి అమ్మానాన్నలు చనిపోయినట్లు విలపిస్తూ చెప్పారు. దీంతో శంకర్ హుటాహుటిన వచ్చి పిల్లలను బెల్లంపల్లి ఆసుపత్రికి.. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పిల్లలిద్దరూ కోలుకుంటున్నారు.
వాయిస్ రికార్డు.. సూసైడ్‌నోట్
తిరుపతి ఆత్మహత్య చేసుకునే సూసైడ్ నోట్, ఫోన్‌లో వాయిస్ రికార్డు చేశాడు. తాను ఆత్మహత్యకు గల కారణాలను వివరించాడు. వ్యవసాయంలో నష్టాలు రావడంతో రూ.6.5 లక్షల వరకు అప్పులు అయ్యాయని, ఎస్సీ కార్పొరేషన్ నుంచి రూ.5 లక్షల రుణం మంజూరైనా దానిని ఇప్పించేందుకు బెల్లంపల్లి ఎంపీడీవో కార్యాలయంలో పనిచేసే ప్రణయ్ సార్ (జూనియర్ అసిస్టెంట్) రూ.20 వేలు లంచం అడుగుతున్నాడని పేర్కొన్నాడు. రుణం మంజూరు కాకపోవడం, అప్పులబాధ భరించలేక కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటున్నట్టు వివరించాడు.
గ్రామస్తుల రాస్తారోకో: లంచం అడిగి దంపతుల మృతికి కారకుడైన జూనియర్ అసిస్టెంట్ ప్రణయ్‌పై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు చొప్పరిపల్లి వద్ద రహదారిపై రాస్తారోకో చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయా లని కోరారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మందమర్రి సీఐ రాంచందర్‌రావు భరోసా ఇవ్వడంతోఆందోళన విరమించారు.
నాన్ బెయిలబుల్ కేసు పెడతాం: ఏసీపీ
అప్పుల విషయంలో ఒత్తిడి తెచ్చిన వారి వివరాలు సేకరించి వారిపై, లంచం అడిగిన ఉద్యోగిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేస్తామని బెల్లంపల్లి ఏసీపీ బాలుజాదవ్ తెలిపారు. మంజూరైన రూ.5 లక్షల రుణాన్ని కలెక్టర్‌తో మాట్లాడి తిరుపతి కుటుంబానికి అందించేలా చూస్తామన్నారు. పిల్లలు చదువుకునేందుకు సహకరిస్తామని, వారిని అన్ని విధాలా ఆదుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు.
డబ్బులు అడగలేదు: ఎంపీడీఓ
బెల్లంపల్లి రూరల్: తిరుపతిని ఎస్సీ కార్పొరేషన్ రుణం మంజూరు కోసం ఎవరూ డబ్బులు అడగలేదని బెల్లంపల్లి ఎంపీడీఓ వెంకటేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతికి రూ.5 లక్షల రుణం మంజూరు చేసి గతనెల 11న ఆన్‌లైన్‌లో అఫ్రూవల్ ఇచ్చామని పేర్కొన్నారు. రుణం మంజూరయ్యాక ఆ డబ్బులు అప్పులు కట్టుకోకుండా యూనిట్ పెట్టుకోవాలని చెప్పామే తప్ప కార్యాలయంలో ఎవరూ డబ్బులు అడగలేదని ఆయన స్పష్టం చేశారు.
రుణం మంజూరు చేశాం
ఎస్సీ కార్పొరేషన్ రుణం కోసం దరఖాస్తు చేసుకోగా బెల్లంపల్లి ఎంపీడీఓ కార్యాలయం నుంచి వచ్చిన జాబితాలో తిరుపతి పేరు ఉంది. అతడి దరఖాస్తును పరిశీలించి కలెక్టర్ సిఫారసుతో రూ.5 లక్షల రుణం మంజూరు చేస్తూ ఆన్‌లైన్‌లో అప్రూవల్ ఇచ్చాం. రుణం మంజూరు అయిన విషయాన్ని రెండు రోజుల క్రితమే బెల్లంపల్లి ఎంపీడీఓ ద్వారా లబ్ధిదారుడికి తెలియజేశాం. రూ.5 లక్షల రుణంలో రూ.2 లక్షలు బ్యాంకు రుణం కాగా.. మిగతా రూ.3 లక్షలు సబ్సిడీని వర్తింప చేశాం. రుణం మంజూరు కోసం డబ్బులు ఎవరడిగారో నాకు తెలియదు. రుణం మంజూరు చేసినట్లు సమాచారం ఇచ్చాక కూడా తిరుపతి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఎందుకు ఏర్పడిందో అర్థంకావడం లేదు.
– హరినాథ్‌రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ
Comments
Please login to add a commentAdd a comment