
ఏసీబీకి ‘లక్ష'ణంగా చిక్కాడు
తెనాలి జిల్లా వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ అత్తోట రవీంద్రకుమార్ శుక్రవారం సాయంత్రం డైట్ కాంట్రాక్టర్ నుంచి లక్ష రూపాయల నగదు...
మారీసుపేట (తెనాలి): తెనాలి జిల్లా వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ అత్తోట రవీంద్రకుమార్ శుక్రవారం సాయంత్రం డైట్ కాంట్రాక్టర్ నుంచి లక్ష రూపాయల నగదు లంచంగా తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. గుంటూరు రేంజ్ ఎసీబీ డీఎస్పీ ఎం.రాజారావు తెలిపిన వివరాల ప్రకారం.. తెనాలి జిల్లా వైద్యశాలలో డాక్టర్ అత్తోట రవీంద్రకుమార్ చర్మవ్యాధుల నిపుణుడిగా పనిచేస్తు వచ్చారు.
2013 అక్టోబర్ 11న వైద్యశాల సూపరింటెండెంట్‌గా బాధ్యతలు స్వీకరించారు. జిల్లా వైద్యశాలలోని రోగులకు డైట్ అందించేందుకు 2005లో తెనాలికి చెందిన తాడిబోయిన భారతీకుమారి కాంట్రాక్టు తీసుకున్నారు. అప్పటి నుంచి ఆమె, ఆమె భర్త శ్రీనివాసరావు వైద్యశాలలోని రోగులకు టిఫెన్, భోజనం అందిస్తు వస్తున్నారు. సాధారణంగా ప్రతి రెండు సంవత్సరాలకు డైట్‌కు సంబంధించిన కాంట్రాక్టుకు ఉన్నతాధికారులు పాట పెట్టాల్సి ఉంది.
డైట్ నిర్వహణ బాగా చేస్తున్నట్లు అధికారులకు అనిపిస్తే కాంట్రాక్టును ఏడాది పొడిగించే అవకాశం ఉంది. అలా శ్రీనివాసరావు 2007 నుంచి తన కాంట్రాక్టును పొడిగించుకుంటూ వస్తున్నాడు. 2014 జూన్‌తో పొడిగించిన కాంట్రాక్టు గడువు ముగిసింది. జిల్లా వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ అత్తోట రవీంద్రకుమార్‌ను కలిసి డైట్ కాంట్రాక్టును పొడిగించాలని శ్రీనివాసరావు కోరాడు. అందుకు రూ.1.65లక్షల నగదు లంచంగా ఇవ్వాలని డిమాండ్‌చేయడంతో అంత ఇచ్చుకోలేనని చెప్పాడు.
లంచం ఇవ్వనిదే ఫైలును ఉన్నతాధికారులకు సిఫారసు చేయనని స్పష్టంచేయడంతో లక్ష రూపాయలు ఇచ్చేందుకు అంగీకరించాడు. ఇదంతా సెల్‌ఫోన్‌లో రికార్డు చేసిన శ్రీనివాసరావు గుంటూరులోని ఏసీబీ అధికారులకు వినిపించి విషయం చెప్పాడు. ఎసీబీ అధికారుల సూచన మేరకు రూ.లక్ష నగదును శుక్రవారం సాయంత్రం జిల్లా వైద్యశాలలోని సూపరింటెండెంట్ కార్యాలయంలో రవీంద్రకుమార్‌కు శ్రీనివాసరావు ఇవ్వగా వాటిని లెక్కించి తన సొరుగులో పెట్టుకున్నాడు.
ఎసీబీ డీఎస్పీ రాజారావు రెడ్‌హ్యాండెడ్‌గా రవీంద్రకుమార్‌ను పట్టుకున్నారు. అనంతరం ఆయన నుంచి రూ.లక్ష నగదు స్వాధీనం చేసుకున్నారు. రవీంద్రకుమార్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు ప్రకటించారు. దాడుల్లో ఏసీబీ ఇన్‌స్పెక్టర్లు కె.సీతారామ్, టి.నరసింహారెడ్డి, శ్రీనివాస్, తెనాలి మూడో పట్టణ ఎస్‌ఐ జోగి శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.
గతంలోనూ..
2012లో జిల్లా వైద్యశాలలో ఆడిట్ ఫైనాన్స్ అధికారిగా పనిచేసిన డాక్టర్ గంగాధర్ ఇదే డైట్ కాంట్రాక్టర్ భారతీకుమారి డైట్ బిల్లులను మంజూరు చేసేందుకు లంచం అడిగారు. ఆ సమయంలో కాంట్రాక్టర్ భర్త శ్రీనివాసరావు విజయవాడ ఏసీబీ అధికారులను సంప్రదించి వారి సూచన మేరకు రూ.40 వేల లంచం ఇస్తూ పట్టించారు. జిల్లా వైద్యశాలలో తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతుండడంతో సిబ్బందిలో కలవరం మొదలైంది.