లంచం అడుగుతున్నారు
టీఏపై ఎంపీడీఓకు ఫిర్యాదు చేసిన లకిమేర గ్రామస్తులు
నరసన్నపేట : ‘మేం నిరుపేద కూలీలం. ఉపాధి పనులకు వెళ్తూ జీవనోపాధి పొందుతున్నాం. ఉపాధి అధికారుల సూచన మేరకు గ్రామంలో ఫారంఫాండ్ తవ్వాం. దీనికి రోజుకు రూ.35 మాత్రమే వేతనం పడింది. ఇదేమని టెక్నికల్ అసిస్టెంట్ త్రినాథరావును ప్రశ్నించగా ఒక్కో పాండ్‌కు రోజుకు రూ.190 వేతనం వచ్చేలా చేస్తాను.. అందుకు రూ. 3 వేలు నాకు లంచం ఇస్తారా అని అడిగారు’ అంటూ లకిమేర గ్రామానికి చెందినపలువురు ఉపాధి వేతనదారులు శుక్రవారం నరసన్నపేట ఎంపీడీఓ విద్యాసాగర్‌కు ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా వేతనదారులు వంజరాపు అప్పలరామయ్య, ఎల్. లక్ష్మి, ఆర్.లక్ష్మి, ఎ.కాళీప్రసాద్ తదితరులు విలేకరులతో మాట్లాడుతూ రెండు వారాలకు చెందిన సొమ్ము రావాల్సి ఉందని చెప్పారు. వారానికి రూ. 200 చొప్పున మాత్రమే వేతనం వస్తోందని వాపోయారు. ఈ విషయమై సమగ్ర దర్యాప్తు చేపట్టి న్యాయం చేయాలని వారు కోరారు.