ఉయ్యూరు:స్థానిక మున్సిపల్ మేనేజర్ పి. రాధాకృష్ణ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. రూ. 8 వేలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. ఏసీబీ డీఎస్పీ వి. గోపాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం మున్సిపాలిటీలో ఏసీబీ అధికారులు మంగళవారం దాడి చేశారు. పారిశుధ్య కార్మికుడు బొత్స ఏసు ఫిర్యాదు మేరకు దాడి చేయడంతో రాధాకృష్ణ లంచం తీసుకుంటూ చిక్కాడు.
2001 నుంచి ఏసు పారిశుధ్య కార్మికుడుగా పనిచేస్తున్నాడు. డెప్యుటేషన్‌పై పర్మినెంట్ ఉద్యోగి అయిన ఏసు మేస్త్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. మేస్త్రి పోస్టు ఖాళీగా ఉండటంతో తనకు ఇవ్వాల్సిందిగా దరఖాస్తు చేసుకున్నాడు. ఆరు నెలలుగా ఫైలు కదలడంలేదు. దీంతో లంచం ఇస్తేనే ఫైలుపై సంతకం చేస్తామని చెబుతున్నారని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు.
దీనిపై విచారించిన ఏసీబీ డీఎస్పీ గోపాలకృష్ణ, సీఐలు బి. శ్రీనివాస్, కె. వెంకటేశ్వర్లు, ఎస్.ఎస్.వి. నాగరాజు సిబ్బందితో కార్యాలయంపై దాడిచేశారు. ఏసు రూ. 8 వేలు మేనేజర్‌కు ఇస్తుండగా పట్టుకున్నారు. రాధాకృష్ణ చేతులకు రంగు అంటుకోవడం, ఫ్యాంట్ వెనుక జేబులోడబ్బు దొరకడంతో అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
లంచం కోసం పీడించారు
మా అమ్మ చనిపోవడంతో 2001లో ఉద్యోగంలో చేరా. కొన్నేళ్లుగా డెప్యుటేషన్‌పై మేస్త్రి బాధ్యతలు నిర్వర్తిస్తున్నా. సూపర్‌వైజర్ పోస్టు ఖాళీ అవడంతో దరఖాస్తు చేసుకున్నా. అందుకు సంబంధించి జీవో కాపీకూడా ఇచ్చా. లంచం ఇస్తేగాని సంతకం పెట్టనన్నారు. దీంతో ఏసీబీని ఆశ్రయించా.
- బొత్స ఏసు, పారిశుధ్య కార్మికుడు
చెయ్యి తడిపితేనే సంతకం
మున్సిపాలిటీలో అవినీతి కంపుకొడుతోంది. కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకూ అధికారులు, సిబ్బంది ప్రతి పనికి ఓ రేటు నిర్ణయించి మరీ వసూళ్ల దందాకు పాల్పడుతున్నారు. చేయి తడపందే ఫైలుపై సంతకం పడటంలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏసీబీ అధికారులు కార్యాలయంపై దాడిచేసి అవినీతి అధికారి భరతం పట్టడంతో మున్సిపాలిటీలో పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది. మున్సిపాలిటీలో అస్థవ్యస్థ పాలన, అవనీతిపై ‘సాక్షి’ అనేక కథనాలు ప్రచురించింది. మూడు రోజులుగా వరుస కథనాలు ప్రచురించి ప్రజల పక్షాన పోరాడుతోంది. ఈ కథనాలు అధికారుల్లో కదలిక తెచ్చాయి.
ప్రతిపనికీ ఓ రేటు
మునిసిపాలిటీలో ప్రతి పనికీ ఓ రేటు నిర్ణయించినట్లు సమాచారం. అలా చెల్లించకుంటే నెలలు గడిచినా పని జరగదు. జనన,మరణ ధ్రువీకరణ పత్రానికి రూ. 500 నుంచి రూ. 5 వేలు (వ్యక్తి అవసరాన్నిబట్తి), కొత్త ఇంటిపన్నుకు రూ. 5 వేల నుంచి 7 వేలు, నూతన భవన నిర్మాణ అనుమతులకు రూ. 50 వేల నుంచి రూ. లక్ష, లేఅవుట్‌కు ఎకరానికి రూ. 2 లక్షలు, అనుమతి లేకుండా శ్లాబ్ వేసుకునేందుకు రూ. 25 నుంచి 50 వేలు, వ్యాపార లెసైన్స్‌కు రూ. 2 వేలు, అభివృద్ధి పనులకు కాంట్రాక్టర్ల నుంచి పర్సంటేజిల రూపంలో అధికారి స్థాయిని బట్టి శాతాన్ని వసూలు చేస్తున్నారు.
వరుస కథనాలు ...
మున్సిపాలిటీలో అస్తవ్యస్థ పాలన, విధాన పరమైన లోపాలు, అవనీతిపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురిస్తూ ప్రజా పక్షాన పోరాడుతూ అధికార యంత్రాంగాన్ని మేల్కొలిపింది. ఈ నెల 18న ‘ఆరని వివాదాల కుంపటి’ 19న వివిదాస్పద ‘పన్ను పో(నో) టు’!, 20న సామాజిక స్థలాలు అన్యాక్రాంతం శీర్షికన కథనాలు ప్రచురించింది. దీంతో మన్సిపల్ శాఖ డెరైక్టర్ వాణీ మోహన్, ప్రిన్సిపల్ సెక్రటరీ గిరిధర్‌లు ఆరా తీశారు. ఈ కథనాలను సామాజిక కార్యకర్తలు అధికారులకు అందించి ఫిర్యాదులు చేశారు.
ఏసీబీకి చిక్కిన మునిసిపల్ మేనేజర్
Published Wed, Apr 22 2015 3:20 AM | Last Updated on Tue, Oct 16 2018 6:44 PM
Advertisement