
విద్యుత్ ఏఈకి ఏసీబీ షాక్
విద్యుత్ శాఖ ఏఈకి ఏసీబీ అధికారులు షాకిచ్చారు.
రూ.20వేలు లంచం తీసుకొని..
చిక్కిన వైనంఅదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు
వనస్థలిపురం: విద్యుత్ శాఖ ఏఈకి ఏసీబీ అధికారులు షాకిచ్చారు. అపార్ట్‌మెంట్‌కు విద్యుత్ కనెక్షన్ ఇవ్వడానికి లంచం తీసుకున్న వనస్థలిపురం సబ్‌స్టేషన్ ఏఈని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వివరాలలోకి వెళితే... వనస్థలిపురం ప్రశాంత్ నగర్ కాలనీలో కె.భానుమూర్తి ఆరు ఫ్లాట్లతో అపార్ట్‌మెంట్ నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన విద్యుత్ పనులను కాంట్రాక్టర్ కర్రి వెంకటేశ్వరరావుకు అప్పగించారు. 2014 మే నెలలో విద్యుత్ కనెక్షన్ (6 సింగిల్ ప్య్యానల్ బోర్డు) కోసం వనస్థలిపురం సబ్ స్టేషన్ ఏఈ వర్యాల అశోక్ కుమార్‌కు ఆయన దరఖాస్తు చేసుకున్నారు. ఈ అంచనాల కోసం ఏఈ రూ.30 వేలు డిమాండ్ చేయగా... వర్క్‌ఆర్డర్ ఇచ్చే సమయంలో చెల్లిస్తానని వెంకటేశ్వరరావు చెప్పారు. ఈ నేపథ్యంలో రూ.30 వేలు చెల్లిస్తేనే వర్క్ ఆర్డర్ ఇస్తానని ఏఈ తిప్పుతుండడంతో... రూ.20 వేలు ఇస్తానని వెంకటేశ్వరరావు ఒప్పందం చేసుకున్నారు.
అనంతరం అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించారు. దీంతో ఏసీబీ డీస్పీ ఎం.ప్రభాకర్ ఆధ్వర్యంలోని బృందం బుధవారం పథకం ప్రకారం తాము ఇచ్చిన నోట్లను వెంకటేశ్వరరావు ద్వారా సబ్‌స్టేషన్ కార్యాలయంలో ఏఈ అశోక్ కుమార్‌కు ఇప్పించారు. ఆ నోట్లను ఏఈ చేతితో తాకకుండా తన నోట్‌బుక్‌లో పెట్టించి...దానిని బ్యాగ్‌లో పెట్టాడు. అనంతరం తనను భోజనానికి తీసుకెళ్లడానికి వచ్చిన కుమారుడు రాఖీకి బ్యాగ్ ఇచ్చి... ‘నువ్వు ఇంటికి వెళ్లు... నేను తర్వాత బస్సులో వస్తా’నని చెప్పాడు. రాఖీ బ్యాగును తమ కారు (ఏపీ 13ఏబి 8176)లో పెట్టుకుని అక్కడి నుంచి వెళ్లడానికి సిద్ధమవుతుండగా... ఏసీబీ అధికారులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. నోట్‌బుక్‌లో ఉన్న రూ.20 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. సబ్‌స్టేషన్‌లో సోదాలు నిర్వహించారు. బ్యాగులో నగదు ఉన్న విషయం ఏఈ కుమారుడు రాఖీకి తెలుసా? లేదా అనే విషయమై విచారణ జరుపుతున్నామని ఏసీబీ డీఎస్పీ ప్రభాకర్ తెలిపారు. నగరంలోని హైదర్షాకోటలో గల ఏఈ ఇంటిలోనూ సోదాలు నిర్వహిస్తామన్నారు. ఈ దాడిలో ఏసీబీ ఇన్‌స్పెక్టర్లు ఎస్.వెంకట్‌రెడ్డి, శ్రీలక్ష్మి పాల్గొన్నారు.