సాక్షి, అమరావతి: ఓ ప్రధానోపాధ్యాయుడి నుంచి రూ.5 వేల లంచం డిమాండ్ చేసినందుకు ఏసీబీ అధికారులు 25 ఏళ్ల క్రితం పెట్టిన కేసు ఓ మాజీ ఎంపీడీవోను వృద్ధాప్యంలోనూ వెంటాడింది. 80 ఏళ్ల వయసులో ఆ అధికారి జైలు శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి ఎదురైంది. తన వయసు 80 ఏళ్లని.. అనారోగ్యంతో బాధపడుతున్నానని తెలిపిన ఆ మాజీ ఎంపీడీవో.. తనను కనికరించాలని అభ్యర్థించాడు. నిర్ధ్వందంగా తిరస్కరించిన హైకోర్టు శిక్ష అనుభవించాల్సిందేనని స్పష్టం చేసింది.
అయితే గరిష్ట శిక్షతో కాకుండా కనిష్ట శిక్షతో సరిపెట్టింది. లంచం తీసుకున్నందుకు ఏసీబీ పెట్టిన కేసును కొట్టేస్తూ విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు కొట్టేసింది. అప్పటి అధికారికి అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7 కింద 6 నెలల జైలు, రూ.5వేల జరిమానా విధించింది. అలాగే సెక్షన్ 13(1)(డీ) కింద ఏడాది జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధించింది. ఈ రెండు శిక్షలను ఏకకాలంలో అనుభవించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ రవీంద్రబాబు శుక్రవారం తీర్పు వెలువరించారు.
విధుల్లోకి చేర్చుకునేందుకు లంచం డిమాండ్
కృష్ణా జిల్లా తిరువూరుకు చెందిన యూవీ శేషారావు అప్పట్లో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసే వారు. ఆయనకు అదే జిల్లాలోని నడిమ తిరువూరు పాఠశాలకు బదిలీ కావడంతో.. విధుల్లో చేరేందుకు వెళ్లిన శేషారావును విధుల్లో చేర్చుకోలేదు. దీంతో ఆయన పరిపాలన ట్రిబ్యునల్ (ఏపీఏటీ)ను ఆశ్రయించగా.. ఆయనకు అనుకూలంగా ఉత్తర్వులు వెలువడ్డాయి.
ట్రిబ్యునల్ ఉత్తర్వులను అమలు చేయడంతో పాటు జీతం బకాయిలను ఇప్పించాలని కోరుతూ శేషారావు అప్పటి తిరువూరు ఎంపీడీవో బత్తిన వెంకటేశ్వరరావు వద్దకు వెళ్లారు. ఇందుకు వెంకటేశ్వరరావు రూ.5 వేల లంచం అడిగారు. ఇవ్వలేనని చెప్పినా వినలేదు. దీంతో శేషారావు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.
శేషారావు నుంచి లంచం తీసుకుంటుండగా ఎంపీడీవో వెంకటేశ్వరరావును ఏసీబీ అధికారులు 1998లో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ కేసుపై విచారణ జరిపిన విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు లంచం తీసుకున్నారనేందుకు ఎలాంటి సాక్ష్యాలు లేవంటూ వెంకటేశ్వరరావుపై ఏసీబీ పెట్టిన కేసును కొట్టేస్తూ 2005లో తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఏసీబీ అధికారులు 2007లో హైకోర్టులో అప్పీల్ చేశారు.
అప్పటి తీర్పును తప్పుపట్టిన హైకోర్టు
ఈ అప్పీల్‌పై ఇటీవల న్యాయమూర్తి జస్టిస్ ఏవీ రవీంద్రబాబు విచారణ జరిపి శుక్రవారం తీర్పు వెలువరించారు. ఏసీబీ ప్రత్యేక కోర్టు తీర్పును తప్పుపట్టారు. వెంకటేశ్వరరావు లంచం తీసుకున్నారనేందుకు ఆధారాలు ఉన్నాయని తేల్చారు. లంచం డిమాండ్ చేశారనేందుకు, లంచం తీసుకున్నారనేందుకు ఏసీబీ అధికారులు పూర్తి సాక్ష్యాధారాలను కోర్టు ముందుంచారని తెలిపారు.
ఈ సాక్ష్యాధారాలను ఏసీబీ ప్రత్యేక కోర్టు సరైన కోణంలో విశ్లేషించలేదని ఆక్షేపించారు. వాదనల సమయంలో తన వయసు 80 ఏళ్లని, అనారోగ్యంతో బాధపడుతున్నానని వెంకటేశ్వరరావు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ వాదనను తోసిపుచ్చుతున్నట్టు న్యాయమూర్తి స్పష్టం చేశారు.
అయితే అవినీతి నిరోధక చట్టంలో నిర్దేశించిన గరిష్ట శిక్షకు బదులు కనిష్ట శిక్ష విధిస్తున్నట్టు పేర్కొన్నారు. సెక్షన్ 7 కింద 6 నెలల జైలు శిక్ష, రూ.5వేల జరిమానా, సెక్షన్ 13(1)(డీ) కింద ఏడాది జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధించారు.
80 ఏళ్ల వయసులో వెంటాడిన జైలు శిక్ష
Published Sun, Feb 26 2023 3:46 AM | Last Updated on Sun, Feb 26 2023 3:46 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment