
లంచం కోసం పీడించి..
ప్రొద్దుటూరు టౌన్ : అతని పేరు మస్తాన్‌వల్లి.. ఎంతో మంది కలెక్టర్ల వద్ద సీసీగా పని చేశాడు. ప్రజలను ముక్కుపిండి డబ్బు వసూలు చేయడంలో దిట్ట. అతని వద్ద ఉన్న ఫైల్ కదలాలంటే నోట్లు జోబులో పడాల్సిందే. విసిగి పోయిన బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. వారినీ ముప్పతిప్పలు పెట్టాడు. ఎట్టకేలకు రూ.5వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికాడు. వివరాల్లోకి వెళితే ప్రొద్దుటూరు మండల పరిధిలోని తాళ్లమాపురం గ్రామానికి చెందిన సయ్యద్ జహరుద్దీన్ ఆ గ్రామంలో ఉన్న నూనానీ మాస్క్ మసీదుకు అధ్యక్షుడిగా ఉన్నారు.
8.20 ఎకారాల వక్ఫ్‌బోర్డు స్థలాన్ని ఇద్దరు వ్యక్తులు పట్టాదారు పాసుపుస్తకాలు తయారు చేసుకున్నారు. ఈ విషయంపై జహరుద్దీన్ సివిల్ కోర్టును ఆశ్రయించారు. సివిల్ కోర్టు జహరుద్దీన్‌కు ఆర్డర్ మేరకు డీఆర్‌ఓ ఆ ఫైల్‌ను ఆర్‌డీఓకు పంపారు. అక్కడి నుంచి ఫైల్ ప్రొద్దుటూరు తహశీల్దారు కార్యాలయానికి వచ్చింది. దీంతో తహశీల్దారు వారికి మొదటి నోటీసులు జారీ చేశారు. అయినా వారు స్పందించలేదు.
దీంతో రెండవ నోటీ సు ఇచ్చి స్పందించకపోతే తదుపరి చర్యలు తీసుకోవాలని సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మస్తాన్‌వల్లిని తహశీల్దారు ఆదేశించారు. అయితే మస్తాన్‌వల్లి రెండవ నోటీసు ఇచ్చేందుకు రూ.30 వేలు డిమాండ్ చేశారు. అయితే తన వద్ద డబ్బు లేదని ఎన్ని సార్లు చెప్పినా మస్తాన్‌వల్లి వినలేదు. నోటీసులు ఇచ్చే విషయంపై ఈ నెల 12వ తేదీన జహరుద్దీన్ మస్తాన్‌వల్లిని గట్టిగా ప్రశ్నించాడు. అయినా మస్తాన్‌వల్లి కనీసం రూ.5000 అయినా ఇవ్వాల్సిందేనని పట్టుబట్టాడు.
ఏసీబీ అధికారులను ఆశ్రయించిన బాధితుడు
దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. మంగళవారం మస్తాన్‌వల్లికి డబ్బు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. మొదట తహశీల్దారు కార్యాలయానికి రమ్మని మాస్తాన్‌వల్లి జహరుద్దీన్‌కు చెప్పారు. అక్కడకి తిరుపతి రేంజ్ ఏసీబీ డీఎస్పీ శంకర్‌రెడ్డితోపాటు కడప ఏసీబీ సీఐ పార్థసారథిరెడ్డి, తిరుపతి ఏసీబీ సీఐలు సుధాకర్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, లక్ష్మికాంత్‌రెడ్డి సిబ్బందితో మాటు వేశారు.
అయితే మస్తానల్లి అక్కడి నుంచి ఓ టీ బంకు వద్దకు రావాలని జహరుద్దీన్‌కు ఫోన్ చేశాడు. అక్కడకు వెళ్లేలోపే తిరిగి పోన్ చేసి కోర్టు ఆవరణంలోకి రావాలని చెప్పారు. చివరకు మార్కెట్‌యార్డుకు వెళ్లి జహరుద్దీన్‌తో రూ.5000 నగదు, మద్యం బాటిళ్లు తీసుకుంటుండగా రెడ్‌హ్యాండ్‌డ్‌గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
మస్తాన్‌వల్లి అరెస్టు- కర్నూలుఏసీబీ కోర్టులో హాజరు...
మస్తాన్‌వల్లిని అరెస్టు చేసినట్లు ఏసీబీ తిరుపతి రేంజ్ డీఎస్పీ, కడప, తిరుపతి సీఐలు తెలిపారు. అతన్ని కర్నూలులోని ఏసీబీ కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు వివరించారు.
ప్రజలను ఏ అధికారి లంచం అడిగినా...
ప్రజలను ఏ అధికారి అయినా లంచం అడిగితే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ తెలిపారు. తిరుపతి రేంజ్ (కడప, చిత్తూరు జిల్లాలు) డీఎస్పీ సెల్ నెంబర్ 9440446190, కడప సీఐ 9440446191 నెంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు.