
వ్యవసాయశాఖలో కలుపు మొక్క
► జేడీ కార్యాలయంలో సంచలనం
► రూ.పది వేలు లంచం తీసుకున్న సూపరింటెండెంట్
► అటెండర్ పీఆర్సీ బిల్లు ఇచ్చేందుకు డిమాండ్
► ఏసీబీకి చిక్కిన వైనం
మచిలీపట్నం : జిల్లా వ్యవసాయశాఖ కార్యాలయ సూపరింటెండెంట్ ఎస్వీ రంగారావు రూ.పది వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. జేడీ కార్యాలయంలో పనిచేస్తున్న అటెండర్ ఆర్.దివ్యమణిని పీఆర్సీ, అరియర్ బిల్లులు ఇవ్వాలంటే రూ.పది వేలు ఇవ్వాలని రంగారావు రెండు నెలలుగా ఆమెను వేధిస్తున్నాడు. చేసేది లేక ఆమె ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. సంఘటనకు సంబంధించి గుంటూరు ఏసీబీ డీఎస్పీ, జిల్లా ఏసీబీ ఇన్‌చార్జి డీఎస్పీ సీహెచ్ దేవానంద్‌శాంతో తెలిపిన వివరాలు.. జేడీ కార్యాలయ సూపరింటెండెంట్‌గా రంగారావు ఈ ఏడాది ఫిబ్రవరిలో బాధ్యతలు స్వీకరించారు.
ఇదే కార్యాలయంలో పనిచేస్తున్న అటెండర్ దివ్యమణి తనకు పీఆర్సీ, అరియర్ బిల్లులు ఇప్పించాలని కొద్ది కాలంగా ఆయన్ని కోరుతోంది. రూ.పది వేలు లంచంగా ఇస్తేనే బిల్లు మంజూరవుతుందని రంగారావు తెగేసి చెప్పారు. విషయాన్ని దివ్యమణి వ్యవసాయశాఖ జేడీ దృష్టికి తీసుకువెళ్లారు. ఫలితం దక్కలేదు. దివ్యమణి ఏసీబీ అధికారులను మంగళవారం ఆశ్రయించినట్లు డీఎస్పీ తెలిపారు.
పక్కా వ్యూహంతో..
దివ్యమణి ఫిర్యాదుతో వ్యవసాయశాఖ జేడీ కార్యాలయానికి వచ్చిన ఏసీబీ అధికారులు పక్కా వ్యూహంతో వ్యవహరించారు. ఏసీబీ సిబ్బంది, అధికారులు సూపరింటెండెంట్‌తో పాటు ఇతర అధికారుల పనితీరు పైనా నిఘా ఉంచారు. దివ్యమణి తన వద్ద రూ.పది వేలు రంగారావుకు అందజేసింది. టేబుల్ సొరుగులో నగదును రంగారావు పెట్టిన వెంటనే ఏసీబీ అధికారులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. రసాయనాలతో పరీక్షించి నగదు తీసుకున్నట్లు ధ్రువీకరించారు.
సమాధానమే చెప్పలేదు..
తన బిల్లులపై రంగారావు సమాధానమే చెప్పే వారు కాదని దివ్యమణి విలేకరులకు తెలిపారు. డబ్బులు ఇస్తేనే బిల్లులు మంజూరవుతాయని ఆయన చెబుతున్నారని వివరించింది. దాడుల్లో ఏసీబీ సీఐలు శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు.