చిలకలగూడ: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేసిన కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్‌ఐ మోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. మల్కాజిగిరికి చెందిన బాబు(30) గాంధీ ఆస్పత్రిలో కాంట్రాక్టు పద్ధతిన ల్యాబ్ టెక్నిషియన్ గా విధులు నిర్వహిస్తున్నాడు.
చికిత్స నిమిత్తం ఆస్పత్రికి వచ్చిన బాలానగర్‌కు చెందిన శ్రీనివాస్‌తో పరిచయం ఏర్పడింది. అదేవిధంగా పరిచయం అయిన మరో ముగ్గురుతో కలిసి ఐదుగురు ముఠాగా ఏర్పడ్డారు. గాంధీ ఆస్పత్రిలో ఉద్యోగాలు ఇప్పిస్తానని తమకు తెలిసిన వారికి చెప్పారు. బాలానగర్‌కు చెందిన బాలకృష్ణ ఉద్యోగం కోసం యత్నిస్తున్నాడని తెలుసుకున్నారు.
అటెండర్ ఉద్యోగం ఇప్పిస్తానని రూ.3.5 లక్షలకు బేరం కుదర్చుకుని పథకం ప్రకారం బాలకృష్ణ నుంచి రూ.2 లక్షలు వసూలు చేశారు. ఆరునెలలైనా ఉద్యోగం రాకపోవడం, సెల్‌ఫోన్లు స్విచ్ఛాఫ్ ఉండడంతో అనుమానం వచ్చిన బాలకృష్ణ 20 రోజుల క్రితం గాంధీ ఆస్పత్రికి వచ్చి ఆరా తీయగా, ల్యాబ్ టెక్నిషియన్ బాబును విధుల్లోంచి తొలగించినట్లు ఆస్పత్రి అధికారులు తెలిపారు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.
కేసు నమోదు చేసిన పోలీసులు ముఠా సభ్యులు బాబు(30), శ్రీనివాస్(31), శ్రవణ్(31)లను అదుపులోకి తీసుకుని విచారించగా చేసిన మోసం ఒప్పుకున్నారు. నిందితులను మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని, పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపామని ఎస్‌ఐ మోహన్ తెలిపారు.