దొరికితే దొంగలు.. లేకుంటే దొరలు..
కానూరు అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌లో తనిఖీలు
పాపం పండి పట్టుబడిన గుడివాడ సీటీవో
నగరంలోనూ కొందరు అధికారుల చేతివాటం
విజయవాడ : వాణిజ్య పన్నుల శాఖలో కొంద రు అధికారులు తమను జలగల్లా పీల్చి పిప్పి చేస్తున్నారని డీలర్లు వాపోతున్నారు. జిల్లా లోనూ, నగరంలో కూడా వాణిజ్య పన్నుల శాఖలో అక్రమ వసూళ్ల దందాలు ఇటీవలి కాలంలో ఎక్కువైనట్లు చెపుతున్నారు. గుడివాడలో సీటీవో వి.వి.ఎస్.ఎల్. ప్రసాద్ ఓ రైస్‌మిల్లుకు వ్యాట్ లెసైన్స్ రద్దు కోసం దాని యజ మాని నుంచి రూ. 25వేలు లంచం డిమాండ్ చేసి ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఆ అధికారి అక్రమ వసూళ్లలో సిద్ధహస్తుడని డీలర్లు ఆరోపిస్తున్నారు. గత నాలుగేళ్లుగా అక్కడ పనిచేస్తున్న ఆయన తమను నానా అగచాట్లకు గురిచేసి డబ్బు వసూలు చేశారని చెపుతున్నారు. చివరకు పాపం పండి పట్టుబ డ్డా డంటున్నారు. వాణిజ్య పన్నుల శాఖలో కొందరు అధికారులు ఇలా అక్రమ వసూళ్లు చేస్తున్నారని పలు ప్రాంతాల డీలర్లు ఆరోపిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సీటీవోలే నేరుగా బేరాలు కుదుర్చుకు ని సొమ్ము వసూలు చేస్తున్నట్లు చెబుతున్నారు. నగరంలో కొందరు సీటీవోలు డీలర్లను బెదిరించి డబ్బు దండుకుంటున్నట్లు ఆరోపణ లు వస్తున్నాయి.
ఆడిట్‌లు, వాహనాల తనిఖీల్లోనూ దోపిడీ
ప్రధానంగా విజయవాడలో ఆడిట్‌ల పేరుతో వేధింపులు పెచ్చు పెరిగాయంటున్నారు. ఆడిట్‌లో స్టాక్ వెరిఫికేషన్‌లో వ్యత్యాసం, అనామ తు స్లిప్పులు దొరికితే డిపార్టుమెంటులో పైనుంచి కింద వరకు అధికారులు రకరకాలుగా డబ్బు గుంజుకుని జేబులు నింపుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో అధికారులు తమకు డబ్బు ఇవ్వని వారిని నానా ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు చెబుతున్నారు. వి.టి.సి. (వెహికల్ ట్రాఫిక్ చెకింగ్)లో అక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నట్లు చెబుతున్నారు. జీరో వ్యాపారులతో పలువురు సీటీవోలు, ఏసీటీవోలు చేతులు కలిపి వాహనా ల తనిఖీలను తూతూ మంత్రంగా చేస్తున్నట్లు సమాచారం. పప్పుధాన్యాలు, పంచదారను ఇతర రాష్ట్రాల వేబిల్లులతో విజయవాడలో రోజుకు వందల టన్నులు సరుకుని దింపి జీరో వ్యాపారం ముమ్మరంగా చేస్తున్నారు. అందుకు గాను వాణిజ్య పన్నుల శాఖ అధికారులు పచ్చజెండా ఊపి జీరో వ్యాపారుల నుంచి ఆరునె లలకు, ఏడాదికి ఇంతని ఒప్పందం కుదుర్చుకుని లక్షల్లో సొమ్ము తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. ఇక వేబిల్లుల జారీలో కూడా సీటీవోల చేతివాటం పెచ్చుమీరిందని డీలర్లు ఫిర్యాదులు చేస్తున్నారు.
విజయవాడ రైల్వే పార్సిల్ కార్యాలయం ద్వారా రోజు దేశంలోని వివిధ పట్టణాల నుంచి రకరకాల వస్తువులు అనామతుగా తరలి వస్తున్నా వాణిజ్యపన్నుల శాఖ అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడటం లేదని విమర్శలు వస్తున్నాయి. వాణిజ్యపన్నుల శాఖలో అధికారులు, ఉన్నతాధికారులు సైతం కొందరు అటెండర్లను ఏజెంట్లుగా పెట్టుకుని డబ్బు వసూళ్లు దండిగా చేయిస్తున్నట్లు డీలర్లు ఆరోపిస్తున్నారు.
పెనమలూరు : గుడివాడలో ఏసీబీ వలలో చిక్కిన కమర్షియల్‌టాక్స్ అధికారి(సీటీవో)ప్రసాద్‌బాబుకు మండలంలోని కానూరులో ఉన్న అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌లో ఏసీబీ అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు. ఏసీబీ సీఐ కె.వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. గుడివాడలో ఏసీబీ అధికారులు జరిపిన దాడిలో ఓ వ్యాపారి వద్ద లంచం తీసుకుంటూ సీటీవో ప్రసాద్‌బాబు పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్‌పీ గోపాలకృష్ణ ఆదేశాల మేరకు కానూరులో సీటీవో ప్రసాద్‌బాబు ఉంటున్న మనీష్ అపార్టుమెంట్ 401 ఫ్లాట్‌లో ఆ శాఖ అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. ఆయన ఇల్లు అత్యంత విలాసవంతంగా ఉండటాన్ని గుర్తించారు. ఎల్‌ఈడీ టీవీలు, బెడ్‌రూముల్లో విలువైన డబుల్‌కాట్ మంచాలు, లక్షలాది రూపాయ లు విలువచేసే సోఫాసెట్‌లు ఇలా అనేకం గుర్తించారు. పది బ్యాంక్ పాస్‌బుక్‌లు, రూ 65. వేల నగదు, 18 తులాల బంగారు ఆభరణాలు, తెనాలిలో ఎకరంన్నర పొలానికి సంబంధించిన డాక్యుమెంట్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అపార్టుమెంట్, అందులో వస్తువుల విలువ రూ.1.50 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేశారు. ఈ మేరకు ఏసీటీవో భార్య వరలక్ష్మి సమక్షంలో పంచనామా చేసి వివరాలు నమోదు చేశారు. ప్రసాద్‌బాబు ఇద్దరు కుమారులు ఉన్నత చదువులు చదువుతున్నారు. పెద్దకుమారుడు ఈ ప్రాంతంలోనే ఎంబీబీఎస్, రెండో కుమారుడు కానూరులోని ఓ ప్రముఖ కాలేజీలో ఇంజినీరింగ్ చదువుతున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.