Walther Division
-
వాల్తేరులో వణుకు
సాక్షి, విశాఖపట్నం : ‘ఈయన మంచి డీఆర్ఎం.. మాకు టెండరు కావాలని అడిగితే.. ఎంతిచ్చినా తీసుకొని ఆ పనులు మాకే వచ్చేటట్లు చూసేవాళ్లు. అలాంటి మంచివ్యక్తిని సీబీఐ పట్టుకోవడమేంటి సార్..?’’.. రైల్వే సంబంధిత పనులు చేపట్టే ఓ కాంట్రాక్టర్ చెప్పిన మాటలివీ.. సదరు కాంట్రాక్టర్.. తనకు రావాల్సిన పనులు ఆగిపోతాయేమోనన్న ఆందోళనతో చెప్పినా.. వాల్తేరు డీఆర్ఎం వ్యవహారమేంటనేది ఈ వ్యాఖ్యలే స్పష్టం చేస్తున్నాయి. వాల్తేరు డివిజనల్ రైల్వే మేనేజర్ సౌరభ్‌కుమార్ ప్రసాద్.. ముంబైలో శనివారం ఉదయం లంచం తీసుకుంటూ సీబీఐకి పట్టుబడిన విషయం తెలిసిందే. డీఆర్ఎంపై దర్యాప్తు బృందం దాడితో వాల్తేరు డివిజన్ రైల్వే అధికారులు, ఉద్యోగులు ఉలిక్కి పడుతున్నారు. డీఆర్ఎం వ్యవహారాలు చక్కబెట్టే ఉద్యోగులు తమ పరిస్థితేంటనే ఆందోళనలో ఉన్నారు. రెండేళ్ల నుంచీ సీబీఐ నిఘా...! వాస్తవానికి.. సీబీఐతో డీఆర్ఎం సౌరభ్‌కు కొత్త పరిచయం కాదని తెలుస్తోంది. గతంలో వాల్తేరు డీఆర్ఎంగా రాకమునుపు సెంట్రల్ రైల్వే జోన్లో ప్రిన్సిపల్ చీఫ్ మెకానికల్ ఇంజినీర్ (పీసీఎంఈ)గా విధులు నిర్వర్తించే వారు. ఈయనకు ముందు పీసీఎంఈగా వ్యవహరించిన అధికారి.. రూ.లక్ష లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కారు. అనంతరం నిర్వహించిన సోదాల్లో రూ.23 లక్షలు, రూ.40 లక్షల విలువైన ఆభరణాలు, రూ.13 కోట్ల విలువైన ఆస్తులు, సింగపూర్, యూఎస్ బ్యాంకుల్లో రూ.1.63 కోట్ల డిపాజిట్లు ఉన్నట్లుగా సీబీఐ అధికారులు గుర్తించారు. ఆయన స్థానంలో పీసీఎంఈగా విధుల్లోకి వెళ్లిన సౌరభ్‌పై అప్పటి నుంచి కేంద్ర దర్యాప్తు బృందం నిఘా పెట్టింది. పలుమార్లు చిక్కినట్లే చిక్కి తప్పించుకున్నట్లు సమాచారం. వైజాగ్ నుంచి ఫాలో చేస్తూ.. టెండర్ పాస్ చేసేందుకు లంచం అడుగుతున్నారంటూ ఓ కాంట్రాక్టర్ సీబీఐని ఆశ్రయించారు. దీంతో విశాఖ నుంచి దర్యాప్తు బృందం అధికారులు డీఆర్ఎం కదలికలపై నిఘాపెట్టారు. ముంబై వెళ్తున్నట్లు సమాచారం తెలుసుకొని అక్కడ బృందాల్ని అలెర్ట్ చేసినట్లు తెలుస్తోంది. అక్కడ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకోవడం.. మెర్సిడెస్ కారులో ఇంటికి వెళ్లిన వెంటనే సీబీఐ అధికారులు డీఆర్ఎంను అదుపులోకి తీసుకోవడం చకచకా జరిగిపోయాయి. రెండేళ్ల నుంచి నిఘా కొనసాగించిన సీబీఐ అధికారులకు ఎట్టకేలకు శనివారం చిక్కారని సమాచారం. సీబీఐ అధికారులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఎంతిచ్చినా ఓకే.?? లంచం వ్యవహారంలో సౌరభ్ చిక్కడంతో.. ఆయన చేసిన అవినీతి వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. కాంట్రాక్టర్లతో నిరంతరం..డీఆర్ఎం కార్యాలయం బిజీ బిజీగా ఉండేదని తెలుస్తోంది. సివిల్, మెకానికల్ విభాగాలకు సంబంధించి టెండర్ల ద్వారా వచ్చిన డబ్బుల వసూళ్లకు డీఆర్ఎం కార్యాలయంలోని ఇద్దరు ఉద్యోగుల్ని ప్రత్యేకంగా నియమించినట్లు సమాచారం. టెండర్లు ఎవరికి రావాలంటే.. పని విలువ బట్టి వసూళ్లు రాబట్టేవారని వాల్తేరు డివిజన్ వర్గాలు చెబుతున్నాయి. రూ.50 వేల నుంచి వసూళ్ల పర్వం మొదలయ్యేదని కొందరు కాంట్రాక్టర్లు వాపోతున్నారు. డబ్బులిచ్చిన వారికే పనులకు సంబంధించిన టెండర్లు దక్కేవనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. డీఆర్ఎం అండ్ కో బ్యాచ్‌పై పలుమార్లు ఉన్నతాధికారులకు కాంట్రాక్టర్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలుస్తోంది. విశాఖ రైల్వే పరువు తీసేశారు.! వాల్తేరు డివిజన్ చరిత్రలో సీబీఐ దాడుల్లో ఒక ఉద్యోగి, లేదా అధికారి పట్టుబడటం ఇదే మొదటిసారని ఉద్యోగులు చెబుతున్నారు. గతంలో డీఆర్ఎంలుగా వ్యవహరించిన అనూప్‌కుమార్ సత్పతి, చేతన్‌కుమార్ శ్రీవాత్సవ్.. డివిజన్ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించారని.. అనేక సంస్కరణలు తీసుకొచ్చారని అంటున్నారు. ఎక్కడా అవినీతికి తావులేకుండా.. ప్రతి అంశంలోనూ పారదర్శకంగా వ్యవహరిస్తూ.. తప్పు చేసిన ఉద్యోగులను బదిలీలు, సస్పెన్షన్లు చేసేవారని చెబుతున్నారు. సదరు సౌరభ్ వచి్చన తర్వాత.. ఫిర్యాదులిస్తున్నా పట్టించుకోకుండా వాళ్లతో మిలాఖత్ అయిపోయేవారని కొందరు ఆరోపిస్తున్నారు. మొత్తంగా సీబీఐ వ్యవహారంతో విశాఖ రైల్వే డివిజన్‌పై మచ్చపడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ ఇద్దరిలో టెన్షన్ డీఆర్ఎంపై సీబీఐ దాడులతో.. డివిజన్లో ఉద్యోగుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. డీఆర్ఎం వ్యవహారాలు చక్కబెట్టిన ఇద్దరు ఉద్యోగులు.. సెలవుపై వెళ్లిపోయేందుకు ప్రయతి్నస్తున్నట్లు సమాచారం. అయితే.. సెలవులో వెళ్తే.. సీబీఐ దృష్టిలో పడతారంటూ సహచరులు చెప్పడంతో ఏం చెయ్యాలో పాలుపోక ఎప్పుడు తమని సీబీఐ విచారణకు పిలుస్తారోనంటూ బిక్కుబిక్కుమంటున్నారు. -
ఆదాయార్జనలో వాల్తేరు డివిజన్ టాప్
సాక్షి, విశాఖపట్నం: ఆదాయార్జనలో వాల్తేరు డివిజన్ దూకుడు కొనసాగిస్తోంది. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం కాకముందే ప్రయాణికుల రాకపోకలతో పాటు ఆదాయార్జనలోనూ టాప్ గేర్‌లో దూసుకుపోతోంది.ఈస్ట్‌కోస్ట్ జోన్లో అత్యధిక ఆదాయం తీసుకొస్తున్న డివిజన్‌గా విశాఖపట్నం నిలవగా.. అత్యధిక ఆదాయం ఆర్జిస్తున్న రైలుగా విశాఖ నుంచి బయలుదేరుతున్న ఏపీ ఎక్స్‌ప్రెస్ నిలిచింది. భువనేశ్వర్ ప్రధాన కేంద్రంగా నడుస్తున్న జోన్లో టాప్–10 ఆదాయమిస్తున్న రైళ్లలో నాలుగు వాల్తేరు నుంచి ప్రారంభమవుతున్నవే ఉండటం గమనార్హం. ఈస్ట్‌కోస్ట్ డివిజన్‌కు ఇదే బంగారు బాతు వాల్తేరు డివిజన్ ఎప్పటిమాదిరిగానే ఈస్ట్‌కోస్ట్ జోన్లో నంబర్ వన్‌గా కొనసాగుతోంది. జోన్ ప్రధాన కేంద్రమైన భువనేశ్వర్‌ని తలదన్నేలా ఆదాయాన్ని అందిస్తూ.. వరుసగా నాలుగో ఏటా టాప్‌లో నిలిచింది. ఈస్ట్‌కోస్ట్ రైల్వే జోన్‌కు వాల్తేరు డివిజన్ బంగారు బాతులా మారింది. అతి పెద్దదైన ఈ డివిజన్ పరిధిలో ఏటా 2.5 కోట్లకు పైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ఈస్ట్‌కోస్ట్ రైల్వే జోన్‌కు ఏటా సుమారు రూ.14 వేల కోట్ల వరకు ఆదాయం వస్తుండగా.. ఇందులో సుమారు రూ.5 వేల కోట్ల నుంచి రూ.7 వేల కోట్ల వరకు ఒక్క వాల్తేరు డివిజన్ నుంచే వస్తోంది.2023 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2024 మార్చి 31వ తేదీ వరకు విశాఖపట్నం రైల్వే స్టేషన్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్(పీఆర్ఎస్) ద్వారా రూ.478.28 కోట్లు రాగా.. అన్‌రిజర్వ్›డు టికెటింగ్ సిస్టమ్ (యూటీఎస్) ద్వారా రూ.67.86 కోట్లు వచ్చింది. మొత్తంగా విశాఖ రైల్వేస్టేషన్ నుంచి రూ.546.14 కోట్లు ఆదాయం లభించింది. అలాగే భువనేశ్వర్ స్టేషన్‌కు రూ.493.01 కోట్లు, ఆ తరువాత స్థానాలలో పూరీ స్టేషన్‌కు రూ.276.55 కోట్లు, బ్రహ్మపూర్ రైల్వేస్టేషన్‌కు రూ.101.94 కోట్ల ఆదాయం వచ్చింది. కాగా.. ప్రయాణికుల రాకపోకల విషయంలోనూ విశాఖ స్టేషన్ ప్రథమ స్థానంలో నిలిచింది. ఇక్కడి నుంచి 2,77,11,147 మంది రాకపోకలు సాగించారు. భువనేశ్వర్ స్టేషన్ ద్వారా 2,63,46,444 మంది ప్రయాణాలు చేశారు.టాప్‌లో ఏపీ ఎక్స్‌ప్రెస్ అత్యధిక ఆదాయం అందిస్తున్న రైళ్ల విషయంలోనూ వాల్తేరు డివిజన్ నంబర్ వన్‌గా నిలిచింది. జోన్ నుంచి రాకపోకలు సాగిస్తున్న రైళ్లలో విశాఖ నుంచి బయలుదేరుతున్న ఏపీ ఎక్స్‌ప్రెస్ నంబర్ వన్‌గా నిలిచింది. 2023 జనవరి 1 నుంచి 2023 డిసెంబర్ 31 వరకూ విశాఖ నుంచి ఢిల్లీ వెళ్లే ఏపీ ఎక్స్‌ప్రెస్ ఏకంగా రూ.89,73,35,413 ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. ఈ ఏడాది జనవరి 1 నుంచి మే 29 వరకూ రూ.39,05,31,575 ఆదాయం తీసుకొచ్చింది. రెండో స్థానంలో రూ.80.7 కోట్లు, రూ.35.59 కోట్లతో పురుషోత్తం ఎక్స్‌ప్రెస్ ఉండగా.. మూడో స్థానంలో భువనేశ్వర్ నుంచి ముంబై వెళ్లే కోణార్క్ ఎక్స్‌ప్రెస్ నిలిచింది. గతేడాది కోణార్క్ రూ.74.49 కోట్లు, ఈ ఏడాది రూ.31.13 కోట్లు ఆదాయాన్ని సాధించింది. ఇలా ఆదాయాన్ని ఆర్జించే టాప్–10 రైళ్లలో నాలుగు రైళ్లు విశాఖపట్నం నుంచి ప్రారంభమవుతున్నవే ఉండటం విశేషం. విశాఖ నుంచి లోకమాన్యతిలక్ (ముంబై) వెళ్లే ఎల్టీటీ ఎక్స్‌ప్రెస్ 8వ స్థానంలో, విశాఖ–సికింద్రాబాద్ వందేభారత్ టాప్–9లో, విశాఖ–నిజాముద్దీన్ సమతా ఎక్స్‌ప్రెస్ టాప్–10లో ఉన్నాయి. 11, 12వ స్థానాల్లో విశాఖ–హైదరాబాద్ గోదావరి ఎక్స్‌ప్రెస్, విశాఖ–సికింద్రాబాద్ గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్ నిలిచాయి. -
విశాఖలో ఇక గుర్రం స్వారీ
తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర): విశాఖ నగర వాసులకు ఇక ఎంచక్కా గుర్రపు స్వారీ చేసే అవకాశం వచ్చింది. ఈస్ట్ కోస్ట్ రైల్వే స్పోర్ట్స్ అసోసియేషన్.. వాల్తేర్ ఆధ్వర్యంలో వాల్తేర్ రైల్వే ఫుట్ బాల్ స్టేడియం(పాత ఎగ్జిబిషన్ గ్రౌండ్స్)లో హార్స్ రైడింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. దేశ రైల్వే స్పోర్ట్స్ చరిత్రలోనే ఇలాంటి సదుపాయాన్ని మొదటిగా తామే అందుబాటులోకి తెచ్చినట్టు వాల్తేర్ డివిజన్ డీఆర్ఎం అనూప్‌కుమార్ సత్పతి తెలిపారు. వాల్తేర్ డివిజన్ ఇప్పటికే స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్ వంటి పలు ప్రత్యేక క్రీడాంశాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటికి ఇప్పుడు హార్స్ రైడింగ్ కూడా తోడవడంతో రైల్వే ఉద్యోగులు, నగరవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలకు, పెద్దలకు గుర్రపు స్వారీ చేయాలనే ఆసక్తి ఉంటుంది. అలాంటి వారి కల నెరవేరింది. రైల్వే ఉద్యోగులు, అధికారులు, వారి పిల్లలు, కుటుంబ సభ్యులతో పాటు నగరవాసులు కూడా రుసుము చెల్లించి ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. మరిన్ని వివరాలకు 98124 89786, 98485 92625 నంబర్లలో సంప్రదించాలని నిర్వాహకులు సూచిస్తున్నారు. రోజూ ఉదయం 6 గంటల నుంచి 9 వరకు, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు శిక్షణ ఇస్తున్నట్టు తేజ్ హార్స్ రైడింగ్ స్కూల్ నిర్వాహకుడు షరీఫ్ చెప్పారు. సాధారణంగా పదేళ్ల వయస్సు నుంచి ఎవరైనా గుర్రపు స్వారీలో శిక్షణ తీసుకోవచ్చని, ఆసక్తి, ఆరోగ్యవంతులైన పిల్లలైతే ఆరేళ్ల నుంచే శిక్షణ తీసుకోవచ్చన్నారు. ప్రస్తుతం ఇక్కడ 8 గుర్రాలను శిక్షణ కోసం సిద్ధం చేసినట్టు తెలిపారు. రోజూ అరగంట పాటు శిక్షణ ఉంటుందని కోచ్ అబ్బాస్ చెప్పారు. ఇదీ చదవండి: సహృదయులైన మీరు మమ్మల్ని ఆశీర్వదించాలి.. ఏపీని ఆదుకోవాలి: వైజాగ్ బహిరంగ సభలో సీఎం జగన్ -
దసరాకు ప్రత్యేక రైళ్లు.. వివరాలు ఇవే..
తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): రద్దీ మార్గాల్లో ఈస్ట్ కోస్ట్ రైల్వే పలు ప్రత్యేక పూజా స్పెషల్ రైళ్లు నడుపుతున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. విశాఖపట్నం–సికింద్రాబాద్(08579) వీక్లీ అక్టోబర్ 13, 20, 27 తేదీల్లో విశాఖపట్నంలో రాత్రి 7కు బయలుదేరి, మరుసటిరోజు ఉదయం 7గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో(08580) సికింద్రాబాద్‌లో అక్టోబర్ 14, 21, 28 తేదీల్లో రాత్రి 7.40కు బయలుదేరి.. మరుసటిరోజు ఉదయం 6.40 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. (చదవండి: Chedi Talimkhana: గంతలు కట్టినా.. గురి తప్పదు..) విశాఖపట్నం–తిరుపతి(08583) వీక్లీ విశాఖపట్నంలో అక్టోబర్ 18, 25, నవంబర్ ఒకటి తేదీల్లో రాత్రి 7.15 బయలుదేరి.. మరుసటి రోజు ఉద యం 7.30 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో(08584) తిరుపతిలో అక్టోబర్ 19, 26, నవంబర్ 2 తేదీల్లో రాత్రి 9.55 బయలుదేరి, మరుసటిరోజు ఉదయం 10.20 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. విశాఖపట్నం–సికింద్రాబాద్(08585) స్పెషల్ విశాఖపట్నంలో అక్టోబర్ 19, 26, నవంబర్ 2 తేదీల్లో సాయంత్రం 5.35 బయలుదేరి మరుసటిరోజు ఉదయం 7.10 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరుగుప్రయాణంలో(08586) సికింద్రాబాద్‌లో అక్టోబర్ 20, 27, నవంబరు 3 తేదీల్లో రాత్రి 9.05 గంటలకు బయలుదేరుతుంది. చదవండి: ఇళ్ల మధ్యే సమాధులు.. మంచమే వాడని వింత ప్రపంచం -
ఆర్థిక వృద్ధిలో ‘దూసుకుపోతున్న’ వాల్తేరు డివిజన్
సాక్షి, విశాఖపట్నం/ తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): కోవిడ్ మహమ్మారి వెంటాడుతున్న సమయంలోనూ వాల్తేరు రైల్వే డివిజన్ సాధించిన ఆర్థిక ప్రగతి అద్భుతమని రైల్వే బోర్డు మెంబర్ ఫైనాన్స్ (ఫైనాన్స్ కమిషనర్) నరేష్ సలేచా ప్రశంసించారు. విశాఖలోని డీఆర్ఎం కార్యాలయాన్ని శనివారం ఆయన సందర్శించారు. డివిజన్ ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ ఆర్థిక సంవత్సరంతో పాటు 2020–21లో కోవిడ్ సమయంలో వాల్తేర్ డివిజన్ ప్రగతి, ఆదాయ వనరులు, డివిజన్ పరిధిలో చేపట్టిన వినూత్న ప్రాజెక్టులు, ప్రయాణికుల సదుపాయాలు, భద్రతాపనులు, ఇతర అభివృద్ధి పనుల గురించి డీఆర్ఎం చేతన్‌కుమార్ శ్రీ వాస్తవ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. రైల్వే స్థలాలు, స్టేషన్ పరిసరాల ద్వారా ఆదాయ వనరులను సమీకరించుకోవడంలో వాల్తేర్ డివిజన్ వినూత్న పద్ధతుల్ని అవలంభిస్తున్నదని నరేష్ సలేచా కొనియాడారు. అన్ని విభాగాల్లోనూ మిగిలిన త్రైమాసికాల్లో ఇదే తరహా వృద్ధి సాధించాలని సూచించారు. ఈస్ట్‌కోస్ట్ రైల్వే ప్రిన్సిపల్ ఫైనాన్స్ అడ్వయిజర్, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ ఆర్.ఎస్.మిత్రా, వాల్తేర్ డివిజన్ ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్ రాజారామ్, ఏడీఆర్ఎం అక్షయ్ సక్సేనా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా, విశాఖ డివిజన్‌ని కొనసాగిస్తూ.. తూర్పు కోస్తా రైల్వే జోన్‌ని ఏర్పాటు చేయాలని వినతి పత్రాలు అందించేందుకు ఉద్యోగ సంఘాలు ప్రయత్నించగా.. అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో నిరాశగా వెనుదిరిగారు. -
వాల్తేరులో పుట్టిన అగ్గిబరాటా
ఫస్ట్ లేడీ ఆఫ్ ఇండియన్ సినిమాగా అందరూ కీర్తించే దేవికా రాణి మన వాల్తేరులో పుట్టింది. మరణించే నాటికి బెంగళూరులో 450 ఎకరాల విలువైన ఎస్టేట్‌ను వారసులు లేకపోవడం వల్ల ఎవరికి చెందాలో తేల్చక వదిలిపెట్టింది. ఆమె 1933లోనే తెర మీద ముద్దు సన్నివేశంలో నటించింది. దిలీప్ కుమార్‌ను స్టార్‌ను చేసింది. ఈ రాణి గురించి చాలామందికి తెలియని కొన్ని విశేషాలు... సాధారణంగా మగవాళ్లు లిఖించే చరిత్రలే నమోదవుతూ ఉండే సందర్భంగా హిందీ చిత్ర పరిశ్రమకు సంబంధించి కొత్తదార్లు, వేర్లూ వేసిన దేవికా రాణిని మాత్రం అందరూ మార్గదర్శిగా గుర్తించి గౌరవిస్తారు. ఆమెను ‘ఫస్ట్ లేడీ ఆఫ్ ఇండియన్ సినిమా’గా అభివర్ణిస్తారు. అందుకు కారణం ఆమె చేసిన ఘనమైన పనులే. వాల్తేరులో సంపన్న బెంగాలీ కుటుంబానికి దేవికా రాణి జన్మించింది. ఆమె తండ్రి కల్నల్ మన్మథనాథ్ చౌదరి జన్మతః జమీందార్. తల్లి లీలాదేవి చౌదరి సాక్షాత్ రవీంద్రనాథ్ టాగూర్‌కు మేనకోడలు. అందుకని దేవికా రాణి 9 ఏళ్లకే లండన్ వెళ్లి అక్కడి బోర్డింగ్ స్కూల్లో చదువుకుంది. అక్కడే పరిచయమైన బారిస్టర్ చదువు చదివి సినిమా దర్శకుడైన హిమాంశును ప్రేమించింది. అతని కోరిక మేరకు సినిమా నటిగా మారింది. దానికి ముందే ఆమె సినిమా కళను అభ్యసించింది. మొత్తం మీద సినిమాకు సంబంధించిన అన్ని క్రాఫ్ట్‌ల అధ్యయనం తర్వాత ఆ జంట ఇండియా తిరిగి వచ్చి ముంబైలో ‘బాంబే టాకీస్’ను ప్రారంభించి సినిమాలు తీసి చరిత్ర సృష్టించారు. తెర మీద ముద్దు వెండి తెర మీద తొలి ముద్దు సన్నివేశంలో నటించిన భారతీయ నటి దేవికా రాణీయే. 1933లో తీసిన ‘కర్మ’ సినిమా కోసం భర్త హిమాంశును ఆమె నాలుగు నిమిషాలు ముద్దు పెట్టుకుంది. ఇప్పటికీ కూడా ఇది రికార్డు. ఆ తర్వాత అశోక్ కుమార్‌తో కలిసి ఆమె నటించిన ‘అఛూత్ కన్య’ సూపర్‌హిట్ అయ్యింది. ఆ తర్వాత అశోక్ కుమార్‌తో ఆమె చాలా సినిమాల్లో యాక్ట్ చేసింది. అశోక్ కుమార్ ఆ సంస్థలో భాగస్వామి కూడా అయ్యాడు. దేవికా రాణి నటుడు దిలీప్ కుమార్‌ను హీరోను చేసింది. ఆ రోజుల్లో (1944) దిలీప్ కుమార్‌కు 250 రూపాయలు జీతం ఆఫర్ చేస్తే అతను అది నెలకా సంవత్సరానికా తేల్చుకోలేక సతమతమయ్యాడు. కాని ఆమె ఇచ్చింది నెలకే! అప్పటికి రాజ్ కపూర్‌కు సంవత్సరమంతా కలిపి ఆర్.కె. స్టూడియోలో 150 రూపాయల జీతం వచ్చేది. అలాంటి ప్రభావం దేవికా రాణిది. అశోక్ కుమార్, దేవికారాణి భర్తతో విడిపోయి భర్త హిమాంశు జీవించి ఉండగానే అతనితో వైవాహిక బంధంలో ఉండకుండా కేవలం ప్రొఫెషనల్ బంధంలోనే ఉండిపోయింది దేవికా రాణి. భర్త చనిపోయాక కొన్నాళ్లకు ఆమె రష్యన్ చిత్రకారుడు శ్వెతోస్లవ్ రోరిచ్‌ను వివాహం చేసుకుని మనాలిలో ఉండిపోయింది. ఆ సమయంలో ఆమెకు నెహ్రూ కుటుంబం సన్నిహితమైంది. ఆ తర్వాత ఆ జంట బెంగళూరు వచ్చి 450 ఎకరాల ఎస్టేట్ కొని అందులో ఎవరినీ కలవక జీవించారు. ఆమె దగ్గర పని చేసిన మేనేజర్ ఒకామె ఆమె ఎస్టేట్ విషయాలు గోల్మాల్ చేసిందనే విమర్శలు వచ్చాయి. దేవికా రాణి మరణించాక ఆ ఎస్టేట్‌ను సొంతం చేసుకోవడానికి కర్ణాటక ప్రభుత్వం పెద్ద యుద్ధమే చేసింది. చివరకు సొంతం చేసుకుంది. వెండితెర గతిని మార్చిన దేవికా రాణి ముంబైకి, వెండితెర వ్యక్తులకు దూరంగా జీవించడం ఒక విచిత్రం. 1994లో ఆమె మరణించాక ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. -
పట్టాలెక్కనున్న మరిన్ని స్పెషల్ రైళ్లు
తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర): ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మరిన్ని స్పెషల్ రైళ్లను నడుపుతున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఎ.కె.త్రిపాఠీ ఒక ప్రకటనలో తెలిపారు. ►డిబ్రూఘడ్–కన్యాకుమారి(05906) వీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 27 నుంచి ప్రారంభమై ప్రతి శనివారం రాత్రి 7.25 గంటలకు డిబ్రూఘడ్లో బయలుదేరి మూడో రోజు ►(సోమవారం) మధ్యాహ్నం 3.35 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఇక్కడ నుంచి 3.55 గంటలకు బయలుదేరి మంగళవారం రాత్రి 10 గంటలకు కన్యాకుమారి చేరుకుంటుంది. ►ఈ స్పెషల్ ఎక్స్‌ప్రెస్(05905) తిరుగు ప్రయాణంలో కన్యాకుమారిలో మార్చి 4 నుంచి ప్రారంభమై ప్రతి గురువారం సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరి, మరసటి రోజు రాత్రి 11.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఇక్కడ నుంచి అర్ధరాత్రి 12.10 గంటలకు బయలుదేరి ప్రతి ఆదివారం రాత్రి 8.50 గంటలకు డిబ్రూఘడ్ చేరుకుంటుంది. ఈ స్పెషల్ రైల్ 1–సెకండ్ ఏసీ, 4–థర్డ్ ఏసీ, 11–స్లీపర్ క్లాస్, 3–సెకండ్ క్లాస్, 1 పాంట్రీకార్, 2–జనరేటర్ మోటార్ కార్స్ ఎల్‌హెచ్‌బీ కోచ్‌లతో నడుస్తుంది. చదవండి: కుమార్తెను ప్రభుత్వ బడిలో చేర్పించిన తహసీల్దార్ పనులన్నీ మానేసి.. గ్రామస్తులంతా కదిలొచ్చి -
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లు
తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): సంక్రాంతి సెలవుల ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పలు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు ఈస్ట్‌కోస్ట్ రైల్వే వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం జి.సునీల్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విజయవాడ–విజయనగరం–విజయవాడ(వయా దువ్వాడ) విజయవాడ–విజయనగరం(07184) జనసాధారణ్ స్పెషల్ విజయవాడలో ఈనెల 11,12,13 రాత్రి 9.10 గంటలకు బయల్దేరి మరుసటి రోజు తెల్లవారు 5.20 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి 5.22 గంటలకు బయల్దేరి అదే రోజు ఉదయం 7.20 గంటలకు విజయనగరం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో (07185) విజయనగరంలో ఈనెల 12, 13, 14 తేదీల్లో ఉదయం 7.45 గంటలకు బయల్దేరి ఉదయం 9.23 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి 9.25 గంటలకు బయల్దేరి అదే రోజు సాయంత్రం 4.30 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. ఈ రైలు 12 జనరల్ క్లాస్ కోచ్‌లతో నడుస్తుంది. రానుపోను నూజివీడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, ద్వారపూడి, అనపర్తి, సామర్లకోట, పిఠాపురం, అన్నవరం, తుని, నర్సీపట్నం రోడ్, యలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, కొత్తవలస స్టేషన్లలో ఆగుతుంది. విజయనగరం–విజయవాడ-విజయనగరం జనసాధారణ్ స్పెషల్ విజయనగరం–విజయవాడ(07187) రైలు విజయనగరంలో ఈనెల 17,18,19 తేదీల్లో రాత్రి 9.45 గంటలకు బయల్దేరి రాత్రి 10.30 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి 10.32 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 6.30 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో(07186) విజయవాడలో ఈనెల 18,19 తేదీల్లో మధ్యాహ్నం 12.15 గంటలకు బయల్దేరి సాయంత్రం 6.30 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి 6.32 గంటలకు బయల్దేరి రాత్రి 8.15 గంటలకు విజయనగరం చేరుకుంటుంది. ఈ రైలు 12 జనరల్ క్లాస్ కోచ్‌లతో నడుస్తుంది. రానుపోను నూజివీడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, ద్వారపూడి, అనపర్తి, సామర్లకోట, పిఠాపురం, అన్నవరం, తుని, నర్సీపట్నం రోడ్, యలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, కొత్తవలస స్టేషన్లలో ఆగుతుంది. విజయనగరం–రాజమండ్రి–విజయనగరం జనసాధారణ్ స్పెషల్ విజయనగరం–రాజమండ్రి(07197) స్పెషల్ ఈనెల 14వ తేదీన ఉదయం 7.45 గంటలకు విజయనగరంలో బయల్దేరి ఉదయం 9.23గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి 9.25 గంటలకు బయల్దేరి అదేరోజు మధ్యాహ్నం 12.30 గంటలకు రాజమండ్రి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో (07198) రైలు రాజమండ్రిలో ఈనెల 17వ తేదీన మధ్యాహ్నం 2.50 గంటలకు బయల్దేరి సాయంత్రం 6.30 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి 6.32 గంటలకు బయల్దేరి అదేరోజు రాత్రి 8.15 గంటలకు విజయనగరం చేరుకుంటుంది. ఈ రైలు 12 జనరల్ క్లాస్ కోచ్‌లతో నడుస్తుంది. ద్వారపూడి, అనపర్తి, సామర్లకోట, పిఠాపురం, అన్నవరం, తుని, నర్సీపట్నం రోడ్, ఎలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, కొత్తవలస స్టేషన్లలో ఆగుతుంది. విశాఖపట్నం–సికింద్రాబాద్– విశాఖపట్నం స్పెషల్ విశాఖపట్నం–సికింద్రాబాద్(08523) స్పెషల్ రైలు విశాఖపట్నంలో ఈనెల 12,19 తేదీల్లో మధ్యాహ్నం 3.30 గంటలకు బయల్దేరి మరుసటి రోజు తెల్లవారు 4 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈనెల 13, 20 తేదీల్లో సాయంత్రం 4.35 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరి మరుసటిరోజు ఉదయం 4.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ రైలు 1–సెకండ్ ఏసీ, 2– థర్డ్ ఏసీ, 6–స్లీపర్ క్లాస్, 4–జనరల్ సెకండ్ క్లాస్, 2–సెకండ్ క్లాస్ కమ్ లగేజి కోచ్‌లతో నడుస్తుంది. దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, రాయనపాడు, ఖమ్మం స్టేషన్లలో ఆగుతుంది. విశాఖపట్నం–విజయవాడ–విశాఖపట్నం డబుల్ డెక్కర్ స్పెషల్ విశాఖపట్నం–విజయవాడ(08525) డబుల్ డెక్కర్ స్పెషల్ విశాఖలో ఈనెల 12,19 తేదీల్లో ఉదయం 5.45 గంటలకు బయల్దేరి మధ్యాహ్నం 11.15 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో(08526) విజయవాడలో అదేరోజు సాయంత్రం 5.30 గంటలకు బయల్దేరి రాత్రి 11 గంటలకు విశాఖ చేరుకుంటుంది. ఈరైలు 8 డబుల్ డెక్కర్ కోచ్‌లతో నడుస్తుంది. దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు స్టేషన్లలో ఆగుతుంది. -
వాల్తేరు ఉద్యోగుల్లో కలవరం
వాల్తేరు డివిజన్ విభజన దాదాపుగా ఖరారైపోతోంది. ఉద్యోగ కార్మిక సంఘాలు ఉద్యమాలు చేస్తున్నా.. రాజకీయ ఒత్తిళ్లు తీసుకొస్తున్నా.. కేంద్ర ప్రభుత్వం మాత్రం విభజన ప్రక్రియ ఒక్కో అడుగు వేస్తోంది. దీంతో వాల్తేరు డివిజన్ ఉద్యోగుల్లో కలవరం మొదలైంది. ఎన్నో ఏళ్లుగా డిపార్ట్మెంట్లో పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులు.. ఇప్పుడు డివిజన్ రెండుగా చీలుతున్న నేపథ్యంలో తమ భవితవ్యం ఏమైపోతుందోనని ఆందోళన చెందుతున్నారు. సాక్షి, విశాఖపట్నం: రైల్వే జోన్ సాధించామన్న ఆనందం కంటే.. శతాబ్దానికి పైగా చరిత్ర ఉన్న వాల్తేరు డివిజన్ కోల్పోతున్నామన్న బాధ ప్రతి ఒక్కరినీ కలవరపరుస్తోంది. 125 ఏళ్ల చరిత్ర కలిగిన వాల్తేరు డివిజన్‌ను విభజించి విశాఖ జోన్ ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. డివిజన్ విభజించేందుకు అవసరమైన వ్యవస్థ కోసం అధికారులు కసరత్తులు చేస్తున్నారు. వాల్తేరు డివిజన్ విభజన చేస్తూ ఇదే సమయంలో రాయగడ డివిజన్ ఏర్పాటు, నిర్వహణకు సంబం«ధించిన విధివిధానాలు రూపొందించాలంటూ తూర్పు కోస్తా ప్రధాన కార్యాలయ జనరల్ మేనేజర్‌ను రైల్వే బోర్డు ఆదేశించింది. అదే విధంగా రాయగడ కేంద్రంగా ఏర్పాటయ్యే కొత్త డివిజన్‌కు సంబంధించిన విధివిధానాలు రూపొందించేలా ఒక నోడల్ అధికారిని నియమించారు. ఇలా ఒక్కొక్క అడుగు ముందుకు పడుతున్న నేపథ్యంలో వాల్తేరు డివిజన్ ఉద్యోగుల గుండెల్లో గుబులు మొదలైంది. ఎక్కడ పనిచెయ్యాలి? దశాబ్దానికి పైగా చరిత్ర కలిగిన వాల్తేరు డివిజన్లో 18,760 మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. జోన్ ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో వాల్తేరు డివిజన్‌ను రెండుగా చీల్చేస్తున్నారు. కొంత భాగాన్ని కొత్తగా ఏర్పాటు చేస్తున్న రాయగడ డివిజన్‌లోనూ.. మిగిలిన భాగాన్ని విజయవాడ డివిజన్ లోనూ కలుపుతున్నారు. ఈ నేపథ్యంలో వాల్తేరు పూర్తిగా కనుమరుగు కాబోతోంది. దీంతో వాల్తేరు పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులు ఏ డివిజన్ కిందికి వస్తారన్న విషయంపై ఇంకా సందిగ్థత నెలకొంది. రెండింటిలో ఏ డివిజన్‌కు పంపిస్తారన్న దానిపై ఉద్యోగుల్లో ఆందోళన పెరుగుతోంది. విభజన పాపం.. పదోన్నతులకు శాపం! విభజన కారణంగా ఉద్యోగుల కొత్త డివిజన్లో పని చేయాల్సి రావడం ఒక ఎత్తయితే.. దీని కారణంగా పదోన్నతులకు దూరం కానుండటం వారిని తీవ్రంగా కలవరపెడుతోంది. ఎన్నో ఏళ్లుగా డిపార్ట్మెంట్లో ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగులు.. కొత్త డివిజన్‌కు మారిపోతే, వారి సీనియారిటీ ఏమైపోతుందోనని సతమతమవుతున్నారు. కలాసీలు, ట్రాక్మెన్లు, టెక్నీషియన్లుగా ఉద్యోగంలో చేరిన వారు.. డివిజన్ విడిపోతే జీవిత కాలం ప్రమోషన్ల కోసం పాకులాడాల్సిందే. కలాసీలకు ప్రమోషన్ వస్తే.. రూ.100 మాత్రమే జీతం పెరిగినా.. దాని కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న వారు వాల్తేరు డివిజన్లో వందల మంది ఉన్నారు. అదే విధంగా మూడేళ్లకు పైగా సర్వీస్ చేసిన సుమారు 300 మంది గ్యాంగ్మెన్లు జేఈలుగా పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్నారు. టెక్నీషియన్లంతా డివిజనల్ సీనియారిటీ కోసం గ్రూప్–డి ఉద్యోగులంతా యూనిట్ సీనియారిటీని కోల్పోయే ప్రమాదముంది. క్లర్క్ పదోన్నతుల్లో అసమానతలు...! మరోవైపు ఇప్పటికే డిపార్ట్మెంట్లో క్లర్క్ ఉద్యోగుల పదోన్నతుల్లో అసమానతలు చూపిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ కారణంగా చాలా నష్టపోయిన క్లర్క్‌లు ఈ ఏడాదైనా ప్రమోషన్ వస్తుందని ఆశించారు. అయితే డివిజన్ విడగొడుతున్నారన్న నేపథ్యంలో మరింత కుంగుబాటుకు గురవుతున్నారు. ఒకేసారి విధుల్లో జాయిన్ అయినా కొంతమందికి ప్రమోషన్లు రావడం.. మరికొందరికి 15 నుంచి 20 ఏళ్లు దాటినా ఒక్క ప్రమోషన్ కూడా ఇవ్వకపోవడంపై నిరుత్సాహంగా ఉన్నారు. ఇంటర్ డిపార్ట్మెంట్లో ప్రమోషన్లు కూడా అందకపోవడంపై ఆందోళన చెందుతున్నారు. రేపు కొత్త డివిజన్‌కు వెళ్లాక ప్రమోషన్ కోసం ఇంకెన్ని దశాబ్దాలు వేచిచూడాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్థకం.. డివిజన్ విడిపోతే.. వాల్తేరు పరిధిలో ఉన్నవారంతా ఏ చిన్న పనికోసమైనా విజయవాడ డివిజన్‌కు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో పాటు డివిజన్లో ఉన్న ప్రధాన ఆదాయ వనరులు కూడా వేరే జోన్‌కి వెళ్లిపోతున్నాయి. ముఖ్యంగా ఉద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిపోతుంది. పదోన్నతులు కోల్పోవాల్సి వస్తుంది. ఈ విషయంపైనే ఎక్కువగా ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. – ఎస్.రామచంద్రరావు, రైల్వే యూనియన్ నాయకుడు గ్రూప్–సీ,డీ సిబ్బందికి న్యాయం చేయాలి.. వాల్తేరు డివిజన్ పరిధిలో ఎన్నో ఏళ్లుగా ఖాళీగా ఉన్న ప్రమోషన్ పోస్టులన్నీ తక్షణమే భర్తీ చెయ్యాలి. దశాబ్దాలుగా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న గ్రూప్–సీ, గ్రూప్–డీ ఉద్యోగులకు న్యాయం చెయ్యాలి. ఉన్నపళంగా డివిజన్ విడిపోతే సి బ్బంది తీవ్రంగా నష్టపోతారు. డివిజన్ విడగొ ట్టకూడదని కోరుతున్నాం. – భాస్కర్ రావు, యూనియన్ జోనల్ ప్రతినిధి సిబ్బందికి న్యాయం చెయ్యాలి డివిజన్ విడిపోదని భావిస్తున్నాం. ఒకవేళ ఏ కారణం చేతనైనా డివిజన్ విడిపోతే ఇక్కడి సిబ్బంది తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. కొత్త జోన్, కొత్త డివిజన్ విధానం పూర్తయ్యేలోపు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ప్రమోషన్లు, ఇంటర్ డిపార్ట్మెంట్ ఛేంజ్ విధానాన్ని 25, 33, 70 శాతం కోటా విధానంగా యుద్ధప్రాతిపదికన ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. –డా. పెదిరెడ్ల రాజశేఖర్, ఆలిండియా ఓబీసీ రైల్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ అదనపు ప్రధాన కార్యదర్శి -
మహిళకు సు‘భద్రతా’ వాహిని
సాక్షి, తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర) : రైళ్లలో మహిళా ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యతనిస్తున్నట్టు ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేర్ డివిజన్ డీఆర్ఎం ముకుల్ శరణ్మాథుర్ తెలిపారు. సోమవారం విశాఖపట్నం రైల్వే స్టేషన్లో రైల్వే భద్రతా దళం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మహిళా ప్రయాణికుల భద్రత కోసం ఆర్పీఎఫ్, కమర్షియల్ సిబ్బందితో ప్రత్యేక రక్షణ విభాగం ‘సుభద్ర వాహిని’ని ఆయన సోమవారం ప్రారంభించారు. సుభద్ర వాహినికి సంబంధించిన పోస్టర్లు, కరపత్రాలను ఆయన ప్రారంభించారు. ఈ టీమ్‌లో 10 మంది ఆర్పీఎఫ్ సిబ్బంది, 10 మంది మహిళా టికెట్ తనిఖీ సిబ్బంది ఉంటారు. ఈ టీమ్‌కు ప్రత్యేక డ్రెస్‌ను కూడా ఆవిష్కరించి వారికి అందజేశారు. ఈ సందర్భంగా శరణ్మాథుర్ మాట్లాడుతూ ప్రభుత్వం మహిళల భద్రతకు ప్రత్యేకంగా కేటాయించిన టోల్‌ఫ్రీ నంబరు 182ను ఏ సమయంలోనైనా వినియోగించి ఫిర్యాదులు అందజేయవచ్చన్నారు. రైళ్లల్లో మహిళలకు ఎదురైయ్యే సమస్యలను ఈ బృందం పరిష్కరించడంలో సహకరిస్తారన్నారు. రైళ్లలో గానీ, రైల్వేస్టేషన్లలో గానీ మహిళలకు ఇబ్బందులు ఎదురుకాకుండా వీరు పని చేస్తుంటారు. ఒకొక్కసారి పురుష భద్రతా అధికారులకు ఫిర్యాదు చేయడానికి మహిళా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని, అందుకే వాల్తేరు డివిజన్లో మొట్టమొదటిసారిగా సుభద్రవాహిని టీంను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. దేశంలోనే ఇటువంటి టీంను ఏర్పాటు చేయడం ఇదే ప్రథమమని ఆయన తెలిపారు. ఈ కమిటీలో సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్(ఆర్పీఎఫ్), సీనియర్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్లు సభ్యులుగా ఉన్నారు. ఎవరైనా 182 నంబరుకు ఫిర్యాదు చేయవచ్చని, లేదా వాట్సాప్ నెంబరు 8978080777కు ఫిర్యాదు చేయవచ్చని ఆయన తెలిపారు. ఈ విధంగా అందిన ఫిర్యాదులకు వెంటనే సమీప ఆర్పీఎఫ్ సిబ్బందికి చేరవేయడం ద్వారా వారిని అప్రమత్తం చేస్తారని, తద్వారా వెంటనే తప్పు చేసిన వారిని అదుపులోకి తీసుకోవడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్పీఎఫ్ సీనియర్ డీఎస్పీ జితేంద్ర శ్రీ వాత్సవ, డివిజనల్ కమర్షియల్ మేనేజర్ అశోక్‌కుమార్, సీనియర్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ చారుమతి, ఇతర విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
పూరీ జగన్నాథ యాత్రకు ప్రత్యేక రైళ్లు
తాటిచెట్లపాలెం (విశాఖ) : పూరీ జగన్నాథ రథయాత్రకు వాల్తేరు డివిజన్ నుంచి ప్రత్యేక రైళ్లు కూత వేయనున్నాయి. ఇందులో భాగంగా 10 రైళ్లను విశాఖ నుం చి నడపనున్నట్టు సీనియర్ డివిజినల్ కమర్షియ ల్ మేనేజర్ ఎల్వేందర్‌యాదవ్ ఓ ప్రకటనలో తెలిపారు. రైళ్ల వివరాలివి.. విశాఖ-పూరీ- విశాఖ ప్రత్యేక రైలు(08907/08908) విశాఖ నుంచి 08907 నంబర్‌తో రైలు ఈ నెల 5న మధ్యాహ్నం 1.20 గంటకు బయలుదేరి ఆ మర్నాడు అర్ధరాత్రి 1.40 గంటలకు పూరీ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 08908 నంబరుతో పూరీ నుంచి ఈ నెల 7న అర్ధరాత్రి బయలుదేరి అదేరోజు ఉదయం 11.30 గంటలకు విశాఖ చేరుకుంటుంది. 16 ద్వితీయ శ్రేణి తరగతి సిటింగ్ కమ్ రెండు లగేజీ భోగీలతో ఈ రైళ్లు నడవనున్నాయి. జగదల్పూర్-పూరీ-జగదల్పూర్(08925/08926) జగదల్పూర్లో 08925 నంబర్‌తో ప్రత్యేక రైలు ఈ నెల 5న మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి ఆ మర్నాడు ఉదయం 11.30 గంటలకు పూరీ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 08926 నంబరుతో పూరీ నుంచి ఈనెల 6న సాయంత్రం 4.30 గంటలకు బయలుదేరి ఆ మర్నాడు మధ్యాహ్నం 12.45 గంటలకు జగదల్పూర్ చేరుకుంటుంది. రెండు థర్డ్ ఏసీ, ఆరు స్లీపర్ క్లాస్‌లు, నాలుగు జనరల్ సెకండ్ క్లాస్‌ల సామర్థ్యంతో ఈ రైళ్లు పరుగులు తీయనున్నాయి. విశాఖ-పూరీ-విశాఖ(08907/08934) విశాఖలో 08907 నంబర్‌తో రైలు ఈనెల 13 మధ్యాహ్నం 1.20 గంటకు బయలుదేరి, ఆ మర్నాడు అర్ధరాత్రి దాటాక 1.40 గంటలకు పూరీ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 08934 నంబరుతో పూరీ నుంచి ఈనెల 14 సాయంత్రం 4.30 గంటలకు బయలుదేరి ఆ మర్నాడు అర్ధరాత్రి దాటాక 2.30 గంటలకు విశాఖ చేరుకుంటుంది. 16 జనరల్ సెకండ్ క్లాస్ సిటింగ్, సెకండ్ క్లాస్ సిటింగ్ కమ్ లగేజ్ కోచ్‌లతో ఈ రైళ్లు రాకపోలకు సాగించనున్నాయి. విశాఖ-పూరీ-విశాఖ(08941/08946) విశాఖ నుంచి పూరి వెళ్లే ఈ ప్రత్యేకరైలు ఈ నెల 15 ఉదయం 6.30 గంటలకు బయలుదేరి అదే రోజు సాయంత్రం 5.30 గంటలకు పూరీ చేరుకోగా, తిరుగు ప్రయాణంలో పూరీ నుంచి ఈ నెల 15 రాత్రి 11.30 గంటలకు బయలుదేరి ఆ మర్నాడు 11.30 గంటలకు విశాఖ చేరుకుంటుంది. 16 జనరల్ సెకండ్ క్లాస్ , రెండు సెకండ్ క్లాస్ సిటింగ్ కమ్ లగేజ్ కోచ్‌ల సామర్థ్యంతో ఈ రైళ్లు తిరుగుతాయి. - విశాఖ మీదుగా పూరీ వెళ్లే ప్రత్యేక రైళ్లు మర్రిపాలెం, గోపాలపట్నం, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, గరివిడి, చీపురుపల్లి, సిగడం, పెందూరు, దూసి, శ్రీకాకుళం రోడ్డు, ఊర్లం, తైలూరు, కోటబొమ్మాలి, నౌపడా, పలాస, సోంపేట, ఇచ్చాపురం, బ్రహ్మపూర్, ఛత్రాపూర్, గంజాం, చిల్కా, బాలుగాన్, కుహురి, కల్పరా ఘాట్, భువనేశ్వర్, నిరంకార్పూర్, ఖుర్దారోడ్, మోటరీ, బిర్పురుషోత్తమ్పూర్, సఖిగోపాల్, మాలటిపట్పూర్ స్టేషన్ల మీదుగా ఈ రాకపోకలు సాగిస్తాయి.