ఈస్ట్‌కోస్ట్ జోన్‌లో అత్యంత ఆదాయమిచ్చే రైలుగా ఏపీ ఎక్స్‌ప్రెస్ రికార్డు
2023–24 లో రూ.89.73 కోట్లు
ఈ ఏడాదీ అదే జోరులో ఏపీ ఎక్స్‌ప్రెస్
టాప్–10 ఆదాయమిచ్చిన రైళ్లలో విశాఖ నుంచి బయల్దేరే నాలుగు రైళ్లు
8వ స్థానంలో ఎల్టీటీ, టాప్–9లో వైజాగ్–సికింద్రాబాద్ వందే భారత్
సాక్షి, విశాఖపట్నం: ఆదాయార్జనలో వాల్తేరు డివిజన్ దూకుడు కొనసాగిస్తోంది. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం కాకముందే ప్రయాణికుల రాకపోకలతో పాటు ఆదాయార్జనలోనూ టాప్ గేర్‌లో దూసుకుపోతోంది.
ఈస్ట్‌కోస్ట్ జోన్‌లో అత్యధిక ఆదాయం తీసుకొస్తున్న డివిజన్‌గా విశాఖపట్నం నిలవగా.. అత్యధిక ఆదాయం ఆర్జిస్తున్న రైలుగా విశాఖ నుంచి బయలుదేరుతున్న ఏపీ ఎక్స్‌ప్రెస్ నిలిచింది. భువనేశ్వర్ ప్రధాన కేంద్రంగా నడుస్తున్న జోన్‌లో టాప్–10 ఆదాయమిస్తున్న రైళ్లలో నాలుగు వాల్తేరు నుంచి ప్రారంభమవుతున్నవే ఉండటం గమనార్హం.
ఈస్ట్‌కోస్ట్ డివిజన్‌కు ఇదే బంగారు బాతు
వాల్తేరు డివిజన్ ఎప్పటిమాదిరిగానే ఈస్ట్‌కోస్ట్ జోన్‌లో నంబర్ వన్‌గా కొనసాగుతోంది. జోన్ ప్రధాన కేంద్రమైన భువనేశ్వర్‌ని తలదన్నేలా ఆదాయాన్ని అందిస్తూ.. వరుసగా నాలుగో ఏటా టాప్‌లో నిలిచింది. ఈస్ట్‌కోస్ట్ రైల్వే జోన్‌కు వాల్తేరు డివిజన్ బంగారు బాతులా మారింది. అతి పెద్దదైన ఈ డివిజన్ పరిధిలో ఏటా 2.5 కోట్లకు పైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ఈస్ట్‌కోస్ట్ రైల్వే జోన్‌కు ఏటా సుమారు రూ.14 వేల కోట్ల వరకు ఆదాయం వస్తుండగా.. ఇందులో సుమారు రూ.5 వేల కోట్ల నుంచి రూ.7 వేల కోట్ల వరకు ఒక్క వాల్తేరు డివిజన్ నుంచే వస్తోంది.
2023 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2024 మార్చి 31వ తేదీ వరకు విశాఖపట్నం రైల్వే స్టేషన్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్(పీఆర్‌ఎస్) ద్వారా రూ.478.28 కోట్లు రాగా.. అన్‌రిజర్వ్›డు టికెటింగ్ సిస్టమ్ (యూటీఎస్) ద్వారా రూ.67.86 కోట్లు వచ్చింది. మొత్తంగా విశాఖ రైల్వేస్టేషన్ నుంచి రూ.546.14 కోట్లు ఆదాయం లభించింది.
అలాగే భువనేశ్వర్ స్టేషన్‌కు రూ.493.01 కోట్లు, ఆ తరువాత స్థానాలలో పూరీ స్టేషన్‌కు రూ.276.55 కోట్లు, బ్రహ్మపూర్ రైల్వేస్టేషన్‌కు రూ.101.94 కోట్ల ఆదాయం వచ్చింది. కాగా.. ప్రయాణికుల రాకపోకల విషయంలోనూ విశాఖ స్టేషన్ ప్రథమ స్థానంలో నిలిచింది. ఇక్కడి నుంచి 2,77,11,147 మంది రాకపోకలు సాగించారు. భువనేశ్వర్ స్టేషన్ ద్వారా 2,63,46,444 మంది ప్రయాణాలు చేశారు.
టాప్‌లో ఏపీ ఎక్స్‌ప్రెస్
అత్యధిక ఆదాయం అందిస్తున్న రైళ్ల విషయంలోనూ వాల్తేరు డివిజన్ నంబర్ వన్‌గా నిలిచింది. జోన్ నుంచి రాకపోకలు సాగిస్తున్న రైళ్లలో విశాఖ నుంచి బయలుదేరుతున్న ఏపీ ఎక్స్‌ప్రెస్ నంబర్ వన్‌గా నిలిచింది. 2023 జనవరి 1 నుంచి 2023 డిసెంబర్ 31 వరకూ విశాఖ నుంచి ఢిల్లీ వెళ్లే ఏపీ ఎక్స్‌ప్రెస్ ఏకంగా రూ.89,73,35,413 ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. ఈ ఏడాది జనవరి 1 నుంచి మే 29 వరకూ రూ.39,05,31,575 ఆదాయం తీసుకొచ్చింది.
రెండో స్థానంలో రూ.80.7 కోట్లు, రూ.35.59 కోట్లతో పురుషోత్తం ఎక్స్‌ప్రెస్ ఉండగా.. మూడో స్థానంలో భువనేశ్వర్ నుంచి ముంబై వెళ్లే కోణార్క్ ఎక్స్‌ప్రెస్ నిలిచింది. గతేడాది కోణార్క్ రూ.74.49 కోట్లు, ఈ ఏడాది రూ.31.13 కోట్లు ఆదాయాన్ని సాధించింది. ఇలా ఆదాయాన్ని ఆర్జించే టాప్–10 రైళ్లలో నాలుగు రైళ్లు విశాఖపట్నం నుంచి ప్రారంభమవుతున్నవే ఉండటం విశేషం.
విశాఖ నుంచి లోకమాన్యతిలక్ (ముంబై) వెళ్లే ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్ 8వ స్థానంలో, విశాఖ–సికింద్రాబాద్ వందేభారత్ టాప్–9లో, విశాఖ–నిజాముద్దీన్ సమతా ఎక్స్‌ప్రెస్ టాప్–10లో ఉన్నాయి. 11, 12వ స్థానాల్లో విశాఖ–హైదరాబాద్ గోదావరి ఎక్స్‌ప్రెస్, విశాఖ–సికింద్రాబాద్ గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్ నిలిచాయి.
Comments
Please login to add a commentAdd a comment