వేతనం ఇవ్వకపోగా వేధింపులా? | Bullying does not pay for? | Sakshi
Sakshi News home page

వేతనం ఇవ్వకపోగా వేధింపులా?

Published Tue, Sep 23 2014 1:45 AM | Last Updated on Sat, Jul 28 2018 3:46 PM

Bullying does not pay for?

  •  వీవోఏలకు అధికారుల బెదిరింపు
  •  మొబైల్ ఫోన్లు ఇచ్చేయాలని హుకుం
  •  కేసులు పెడతామని హెచ్చరిక
  •  భయపడబోమంటున్న బాధితులు
  • ఇందిరా క్రాంతి పథంలో పనిచేస్తున్న విలేజ్ ఆర్గనైజింగ్  అసిస్టెంట్స్ (యానిమేటర్లు)కు 15 నెలలుగా కనీస గౌరవ వేతనం అందకపోవడంతో పరిస్థితి దారుణంగా ఉంది. పట్టెడన్నం పెట్టమని వారు అర్థిస్తుంటే... అరెస్టు చేయిస్తామంటున్నారు అధికారులు. దాదాపు 30 నుంచి 40 డ్వాక్రా సంఘాల  కార్యకలాపాల సంపూర్ణ సమాచారాన్ని ఎప్పటికప్పుడు వీరు పై అధికారులకు  నివేదించాల్సి ఉంటుంది.
     
    నూజివీడు :  తమకు రావాల్సిన కనీస గౌరవ వేతనాన్ని విడుదల చేసి కుటుంబాలను ఆదుకోవాలని ఉన్నతాధికారులను వేడుకుంటూ తప్పనిసరి పరిస్థితుల్లో నిరసన కార్యక్రమాలకు దిగిన వీవోఏలపై వెలుగు అధికారుల బెదిరింపులు ఉధృతమయ్యాయి. వారిని నయానో భయానో బెదిరించి ఎలాగోలా సమ్మెను విరమింపజేసేలా చేయాలని డీఆర్‌డీఏ అధికారులపై  చంద్రబాబు ప్రభుత్వం ఒత్తిడి చేస్తుండటంతో  వారు వీవోఏలపై బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలుస్తోంది.

    శాంతియుతంగా రిలే దీక్షలు చేసుకుంటున్న వీవోఏల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం చొరవ చూపకపోగా... కేసులు పెడతామంటూ వెలుగు అధికారులతో హెచ్చరికలు జారీ చేయించడం పలు విమర్శలకు దారితీస్తోంది. విధి నిర్వహణలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు  ప్రభుత్వం వారికిచ్చిన మొబైల్‌ఫోన్లు వెంటనే ఇచ్చేయకపోతే పోలీసుస్టేషన్లో కేసు పెడతామంటూ ఏరియా కో-ఆర్డినేటర్‌లు, ఏపీఎంలు, సీసీలు తీవ్రంగా బెదిరిస్తున్నారని సమాచారం.

    నూజివీడులోని వెలుగు కార్యాలయంలో సోమవారం ఏరియా కో-ఆర్డినేటర్ మర్రి సునీతాలక్ష్మీ రిలేదీక్షలు చేస్తున్న వీవోఏలను పిలిచి  సమ్మె చేస్తున్నందున మీకిచ్చిన మొబైల్ ఫోన్లను అప్పగించకపోతే మీపై కేసులు పెడతానంటూ హెచ్చరించారు. దీంతో వీవోఏలు  సైతం ఆమెతో వాగ్వివాదానికి దిగారు. తమతో 15నెలలుగా పనులు చేయించుకుని  వేతనాలు చెల్లించకపోతే ఎలాగని ప్రశ్నించారు. మేము   న్యాయమైన సమస్యల పరిష్కారానికే సమ్మె  చేస్తున్నామని  బదులిచ్చారు.  

    మైలవరం, నూజివీడు తిరువూరు, గుడివాడ, పామర్రు, అవనిగడ్డ, మచిలీపట్నం, జగ్గయ్యపేట తదితర అన్ని ప్రాంతాల్లోనూ వీవోఏలపై వెలుగు అధికారులు తీవ్ర ఒత్తిడి చేస్తున్నారని తెలుస్తోంది.  వీవోఏలు గ్రామైక్య సంఘాలకు సంబంధించిన పొదుపు వివరాలను, తీసుకున్న రుణాల వివరాలను మొబైల్ ద్వారా సెర్ఫ్‌కు పంపుతారు.  అంతేగాకుండా ‘బంగారుతల్లి’ పథకానికి వివరాల సేకరణ, అభయహస్తం, ఆమ్‌ఆద్మీబీమాయోజన, జనశ్రీబీమా యోజన, వికలాంగుల గ్రూపు  వివరాలు తదితర బాధ్యతలన్నీ వీవోఏలే నిర్వహిస్తుంటారు.

    అలాగే  స్వయం సహాయక సంఘాలకు సంబంధించిన పుస్తకాలు రాస్తున్నందున ప్రతి గ్రూపు నెలకు రూ.50 చొప్పున వీవోఏలకు చెల్లించాలని సెర్ఫ్ ఉన్నతాధికారులు సూచించినా... ఇదీ అమలు చేయడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరికి గతేడాది ప్రభుత్వం నెలకు రూ.2వేల చొప్పున గౌరవవేతనం ఇవ్వనున్నట్లు ప్రకటించడంతో పాటు రెండు నెలలకు సంబంధించిన గౌరవ వేతనం కూడా అందజేసింది.
     
    ఈ నేపథ్యంలో గౌరవ వేతనం వస్తుందన్న ఉద్దేశంతో  గతేడాది ఆగస్టు నుంచి వీవోఏలు మరింత ఉత్సాహంగా పనిచేస్తున్నారు. అయితే నూతన ప్రభుత్వం ఏర్పాటై మూడునెలలు గడచినా తమకు రావాల్సిన గౌరవవేతనం  విడుదల చేయకపోవడంతో వీవోఏలు పలుమార్లు సమ్మెనోటీసు ఇచ్చినప్పటికీ స్పందించకపోవడంతో   15వ తేదీ నుంచి సమ్మెలోకి వెళ్లిన విషయం విదితమే.  దీంతో గ్రామైక్య సంఘాల పుస్తకాలతో పాటు వీరికి ఇచ్చిన మొబైల్ ఫోన్లు వీరిదగ్గరే ఉన్నాయి. వీరి సమ్మెను బలహీనం చేయడానికి గానూ మొబైల్‌ఫోన్లు ఇవ్వకపోతే కేసులు పెడతామంటూ బెదిరిస్తున్నారు. గ్రామైక్య సంఘాలు, మండల సమాఖ్యలతో కేసులు పెట్టిస్తామంటూ వెలుగు అధికారులు బెదిరింపులకు పాల్పడుతున్నారు.  అయినప్పటికీ వీవోఏలు ఏమాత్రం తాము భయపడేది లేదంటూ ఎక్కడికక్కడ పోరాటం కొనసాగిస్తున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement