మేకలు బంధువుల ఇళ్లకు వెళ్లాయట! | The trajectory of the government to promote the Dairy industry | Sakshi
Sakshi News home page

మేకలు బంధువుల ఇళ్లకు వెళ్లాయట!

Published Sun, Dec 7 2014 12:23 AM | Last Updated on Sat, Sep 2 2017 5:44 PM

మేకలు బంధువుల ఇళ్లకు వెళ్లాయట!

మేకలు బంధువుల ఇళ్లకు వెళ్లాయట!

రేగోడ్: పాడిపరిశ్రమను ప్రోత్సహించేందుకు సర్కార్  ఇందిరాక్రాంతి పథం కింద అర్హులైన వారికి లక్షల రూపాయలు విడుదల చేసి మేకలు, బర్రెలను కొనుగోలు చేసుకోవాలని సూచిస్తే, అర్హులంతా తాము బర్రెలు, మేకలు కొనుగోలు చేశామని సర్కార్‌కు నివేదించారు. కానీ ఆడిటింగ్ అధికారులు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లినప్పడు మాత్రం ఆ పశువులు కనిపించలేదు. పశువులు ఏమయ్యాయని ప్రశ్నిస్తే మా బంధువుల ఇళ్లకు వెళ్లాయనే సమాధానం చెప్పారని అధికారులు ప్రజాదర్బార్‌లో వివరించారు. శనివారం ఎంపీపీ కార్యాలయ ఆవరణలో జరిగిన ప్రజాదర్బార్‌లో డీఆర్‌పీలు ఇలాంటి వింత కథలెన్నో వినిపించారు.  

2009-10 సంవత్సరంలో వాటర్‌షెడ్ పథకంలో మంజూరైన రూ.6 కోట్లలో రూ.79 లక్షలు ఆయా పనులపై ఖర్చు చేయగా, ఈ పనులపై ఆడిట్ అధికారులు సర్వే చేసి గ్రామసభలు నిర్వహించారు. శనివారం స్థానిక ఎంపీపీ కార్యాలయ ఆవరణలో ఈజిఎస్ అడీషనల్ పీడీ అమరేశ్, జిల్లా విజిలెన్స్ అధికారి రాంరెడ్డి, పోగ్రాం మేనేజర్ వేణుగోపాల్‌రెడ్డి సమక్షంలో ఉదయం 11.30 గంటలకు నుంచి రాత్రి 8 వరకూ ఈ ప్రజాదర్బార్ కొనసాగింది. ఇందిరాక్రాంతి పథం ఆధ్వర్యంలో ఆయా గ్రామాల్లోని లబ్ధిదారులకు మేకలు, గొర్రెలు, బర్రెల కొనుగోళ్ల కోసం లక్షల రూపాయలు మంజూరు చేశారు. కానీ గొర్రెలు, బర్రెలు పొందిన వారి ఇళ్లవద్దకు వెళ్లగా, చాలా చోట్ల పశువులు కనిపించలేదని ఆడిట్ అధికారులు ప్రజా దర్బార్‌లో తెలిపారు.

పశువులు ఎక్కడున్నాయంటూ  ప్రశ్నించగా, తమ బంధువుల ఇంటి వద్ద ఉన్నాయని పశువులు పొందిన వారు తెలిపారన్నారు. ఈ తతంగం చూస్తుంటే పశువులను కొనుగోలు చేయకుండానే  నిధులు మాత్రం తీసుకున్నారనే విషయం బహిర్గతమైనట్లు వారు వెల్లడించారు. ఇక రాళ్లకట్టలు, చెక్‌డ్యాంలు, కుంటల పనుల్లో అనేక అవకతవకలు జరిగినట్లు డీఆర్‌పీలు తెలిపారు. గతంలో ఉపాధిహామి పథకంలో చేపట్టిన పనులనే వాటర్‌షెడ్ పథకంలో చూపించినట్లు ప్రజాదర్బార్‌లో వెల్లడించారు. పలుచోట్ల పనులు చేయకుండానే బిల్లులు డ్రా చేసినట్లు చెప్పారు.  కార్యక్రమంలో సర్పంచ్ సునీత, జెడ్పీటీసీ రాంరెడ్డి, వాటర్‌షెడ్ పీఓ వీరన్న, ఈజీఎస్ ఏపీఓ జగన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement