ఒంగోలు సెంట్రల్, న్యూస్‌లైన్ : వెట్టిచాకిరి తప్ప ప్రతిఫలం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న ఇందిరా క్రాంతి పథం (ఐకేపీ) ఉద్యోగుల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో కొత్త ఆశలు రేపుతోంది. ఐకేపీ ఉద్యోగుల సంక్షేమం గురించి ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టంగా ప్రకటించడంతో జిల్లాలోని సంబంధిత ఉద్యోగులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2001వ సంవత్సరంలో టీడీపీ హయాంలో వెలుగు పథకం పేరుతో మండలానికి ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసి డ్వాక్రా సంఘాలన్నింటినీ ఏకం చేశారు.
ఆయా సంఘాల కార్యకలాపాలను పర్యవేక్షి స్తూ మహిళలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు వెలుగు పథకం ద్వారా కాంట్రాక్టు పద్ధతిన సిబ్బందిని నియమించారు. అప్పట్లో వెలుగు పథకం సిబ్బందికి అదిచేస్తాం..ఇదిచేస్తామంటూ అరచేతిలో వైకుంఠం చూపించిన ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చివరకు చేసిందేమీ లేకుండా పోయింది. వెలుగు సిబ్బందికి ఏమీ చేయకపోగా టీడీపీ రాజకీయ సభలకు జనాన్ని తరలించేందుకు వారిని వాడుకున్నారు. పనిఒత్తిడి ఉన్నప్పటికీ సరిపడా సిబ్బందిని నియమించకుండా తక్కువ మందితో ఎక్కువ పని చేయిస్తూ ఇబ్బందిపెట్టారు.
పనిఒత్తిడి తగ్గించి వేతనాలు పెంచిన వైఎస్‌ఆర్...
2004లో ముఖ్యమంత్రి అయిన దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి.. వెలుగు సిబ్బంది అనుభవిస్తున్న కష్టాలను గమనించారు. వెలుగు పథకాన్ని ఇందిరా క్రాంతి పథం (ఐకేపీ)గా మార్చి సరిపడా సిబ్బందిని నియమించి వారికి పనిఒత్తిడి తగ్గించారు. వేతనాలు పెంచడంతోపాటు మిగిలిన ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా గుర్తింపు ఇచ్చారు. పొదుపు మహిళలకు, సంఘాలకు రుణాలు మంజూరు చేయించేందుకు, తిరిగి వసూలు చేయించేందుకు, మహిళలతో పొదుపు చేయించి ఆర్థికంగా వారు నిలదొక్కుకునేలా చూసేందుకు మాత్రమే ఐకేపీ ఉద్యోగులను వినియోగించి ఎంతో గౌరవించారు.
త్వరలో రెగ్యులర్ కూడా చేస్తామని హామీ ఇచ్చారు. అయితే, ఆయన ఆకస్మిక మరణంతో ఐకేపీ ఉద్యోగుల సంక్షేమం అటకెక్కింది. అనంతరం కాంగ్రెస్ పాలకులు ఐకేపీ ఉద్యోగుల పట్ల చంద్రబాబు విధానాలనే అమలుచేశారు. మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా తన రాజకీయ సభలకు జనాన్ని తరలించేందుకు ఐకేపీ ఉద్యోగులను ఉపయోగించారు. సమస్యల పరిష్కారం కోసం అనేక ఉద్యమాలు చేసినా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. గతంతో పోలిస్తే మహిళా సంఘాలు పెరిగి పనిఒత్తిడి అధికంగా ఉన్నప్పటికీ కొత్తగా సిబ్బందిని నియమించకపోగా, ఏళ్ల తరబడి పనిచేస్తున్న వారిని రెగ్యులర్ చేయకుండా, వేతనాలు పెంచకుండా ఐకేపీ ఉద్యోగులకు నరకం చూపిస్తున్నారు. దీంతో వారంతా ప్రస్తుతం నిస్సహాయస్థితిలో ఉన్నారు.
వైఎస్‌ఆర్ సీపీ మేనిఫెస్టోతో ఉద్యోగుల్లో ఆనందం...
ఐకేపీ ఉద్యోగులను దశలవారీగా రెగ్యులర్ చేస్తామని వైఎస్‌ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టంగా ప్రకటించారు. కనీస వేతనాలు అమలుచేస్తామని, ఉద్యోగ భద్రత కల్పించి పనిభారం తగ్గిస్తామని హామీ ఇచ్చారు. అంతేగాకుండా కొత్తగా ప్రవేశపెట్టనున్న అమ్మ ఒడి పథకాన్ని నిర్వహించే బాధ్యతను ఐకేపీకే అప్పగిస్తామన్నారు. దీంతో ఐకేపీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రతపై భరోసా లభించింది. జిల్లాలో ఐకేపీ పరిధిలో డీపీఎంలు, ఏపీఎంలు, సీసీలు, కంప్యూటర్ ఆపరేటర్లు, అకౌంట్స్ సిబ్బంది కలిపి 450 మంది వరకూ ఉన్నారు. వైఎస్‌ఆర్ సీపీ ఇచ్చిన భరోసాతో వారితో పాటు వారి కుటుంబ సభ్యులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ సంక్షేమం గురించి పట్టించుకునే జననేతకే తమ ఓటని వారంతా స్పష్టం చేస్తున్నారు.
ఐకేపీ ఉద్యోగుల్లో ఆశలు
Published Wed, Apr 30 2014 2:57 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM
Advertisement
Advertisement