మిల్లర్ల సంచిలో సర్కారు బియ్యం | Government rice millers in the bag | Sakshi
Sakshi News home page

మిల్లర్ల సంచిలో సర్కారు బియ్యం

Published Fri, Sep 12 2014 2:43 AM | Last Updated on Tue, Oct 16 2018 5:14 PM

మిల్లర్ల సంచిలో సర్కారు బియ్యం - Sakshi

మిల్లర్ల సంచిలో సర్కారు బియ్యం

గాడి తప్పిన కస్టమ్ మిల్లింగ్
2,47,429 మెట్రిక్ టన్నుల బియ్యం ఇవ్వని మిల్లర్లు
ప్రభుత్వ ధర ప్రకారం రూ.408 కోట్ల పైమాటే
గడువు పొడిగింపునకు పౌరసరఫరాల శాఖ వినతి
 ముకరంపుర : జిల్లాలో 2013-14 ఖరీఫ్, రబీ సీజన్‌లో కలిపి ఇందిరా క్రాంతి పథం (ఐకేపీ), ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్), గిరిజన సహకార సంఘాలు (జీసీసీ) ద్వారా ప్రభుత్వ యంత్రాంగం 10,16,312 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించింది. కస్టమ్ మిల్లింగ్ కోసం 600 మంది మిల్లర్లకు అప్పగించింది. 6,89,021 మెట్రిక్ టన్నుల బియ్యం మరపట్టించి రైస్‌మిల్లర్లు ప్రభుత్వానికి అందజేయూల్సి ఉంది. కానీ.. 4,41,595 మెట్రిక్ టన్నులు మాత్రమే అప్పగించారు. ఇంకా 2,47,429 మెట్రిక్ టన్నులు మిల్లర్ల సంచుల్లోనే ఉన్నాయి. వాస్తవానికి ఇప్పటికే సేకరణ పూర్తికావల్సి ఉండగా... జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులేమో మిల్లర్ల నుంచి బియ్యం సేకరణ కోసం మరో రెండు నెలల గడువు కావాలని గురువారం ప్రభుత్వాన్ని కోరడం విశేషం.
 
దాచిన బియ్యం విలువ రూ.408 కోట్లు
వరిసాగు విస్తీర్ణం మన జిల్లాలో ఎక్కువ. అన్నదాతలు పండించే ధాన్యం ఆధారంగా అభివృద్ధి చెందాల్సిన రైస్‌మిల్లింగ్ పరిశ్రమ కొందరి లాభపేక్షతో పక్కదారిపడుతోంది. జిల్లాలో ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని మిల్లర్లు తమ సొంత ఆస్తిగా భావిస్తున్నారు. మూడేళ్లుగా సర్కార్ ధాన్యాన్ని మిల్లర్లు పక్కదారిపట్టిస్తున్నారు. 2013-14 సీజన్‌లో ప్రభుత్వ సంస్థల ద్వారా సేకరించిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి ఇచ్చేందుకు ఖరీఫ్‌లో 357 మంది మిల్లర్లకు, రబీలో 253 మంది మిల్లర్లకు ఇచ్చారు. నిబంధనల ప్రకారం రెండు సీజన్లలో కలిపి ధాన్యం తీసుకున్న మిల్లర్లు 6,89,021 టన్నుల బియ్యాన్ని సెప్టెంబర్ 30వ తేదీలోగా పౌర సరఫరాల శాఖకు అప్పగించాలి.

మిల్లర్ల జాప్యంపై ఇటీవలే పౌరసరఫరాల కమిషనర్ పార్థసారధి సమీక్షించారు. గడువులోగా బియ్యూన్ని అప్పగించాలని మిల్లర్లను ఆదేశించారు. అరుునా లాభం లేకుండా పోరుుంది. రాజకీయ ఒత్తిడుల నేపథ్యంలో సంబంధిత అధికారులూ వారికే వత్తాసు పలుకుతుండడంతో ఈ ప్రక్రియ మరింత జాప్యం జరుగుతోంది. భారత ఆహార సంస్థ మిల్లర్లకు ఇచ్చే బియ్యం ధర ప్రస్తుతం సగటున క్వింటాల్‌కు రూ.1600 ఉంది. ఈ ధర లెక్కన పరిశీలిస్తే మిల్లర్లు  ప్రభుత్వానికి ఇవ్వకుండా దాచిపెట్టుకున్న బియ్యం

విలువ దాదాపు రూ. 408 కోట్ల పైమాటే.
మిల్లర్ల ‘ప్రైవేటు’ వ్యాపారం...:మిల్లర్లు తమ వద్ద దాచుకున్న బియ్యంతో ప్రైవేట్ వ్యాపారం చేస్తున్నట్లు ఆరోపణలున్నారుు. గత ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి రైతుల నుంచి కొనుగోలు చేసిన 3.82 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ కోసం మిల్లర్లకు అప్పగించారు. ఇందులో 2.56 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ప్రభుత్వానికి ఇవ్వాలి. ఇప్పటివరకు 2.53 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యూన్ని అప్పగించగా మిగిలిన 3,000 టన్నులు (30 వేల క్వింటాళ్లు) బియ్యాన్ని 10 మంది మిల్లర్లు తమ వద్దే ఉంచుకున్నారు.

గత సీజన్‌లో రైతుల నుంచి 6.35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లర్లకు అప్పగించారు. మిల్లర్లు 4.32 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంది. ఇప్పటివరకు కేవలం 1.94 లక్షల టన్నుల బియ్యాన్ని మాత్రమే అందజేశారు. ఇంకా 272 మంది మిల్లర్లు 2,47,429 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సర్కార్‌కు ఇవ్వలేదు. పౌరసరఫరాల శాఖ రుణం తీసుకుని ధాన్యం కొనుగోలు చేస్తే మిల్లర్లు వ్యాపారం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో సివిల్‌సప్లై సంస్థకు వడ్డీ భారం తప్పడంలేదు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement