పండుగ వాతావరణం వెల్లివిరిసేలా.. | CM Revanth Reddy Vijayotsavam Celebrations December 2024: Telangana | Sakshi
Sakshi News home page

పండుగ వాతావరణం వెల్లివిరిసేలా..

Published Sun, Nov 24 2024 1:02 AM | Last Updated on Sun, Nov 24 2024 1:02 AM

CM Revanth Reddy Vijayotsavam Celebrations December 2024: Telangana

డిసెంబర్‌ 1–9 వరకు ప్రజాపాలన విజయోత్సవాలు

గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు.. 

పాఠశాలలు, హాస్టళ్లు, కాలేజీల్లోనూ నిర్వహణ 

4న పెద్దపల్లిలో నిరుద్యోగ యువతతో విజయోత్సవ సభ  

9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ 

ఉత్సవాలపై సమీక్షలో ఏర్పాట్లకు సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: డిసెంబర్‌ 1 నుంచి 9 వరకు రాష్ట్రమంతటా పండుగ వాతావరణం వెల్లివిరిసేలా ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఉత్సవాల నిర్వహణకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అన్ని శాఖలు ఈ ఉత్సవాల్లో భాగస్వామ్యం పంచుకోవాలని చెప్పారు. రాష్ట్రమంతటా అన్ని పాఠశాలలు, కాలేజీలు, హాస్టళ్లలోనూ వేడుకలకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఉత్సవ వాతావరణం ఉట్టిపడాలని చెప్పారు.

తొలి ఏడాదిలో ప్రభుత్వం సాధించిన విజయాలతోపాటు భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాల ప్రణాళికను శాఖల వారీగా ప్రజలకు వివరించాలని సూచించారు. విజయోత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై సీఎం శనివారం సచివాలయంలో అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, ఉన్నతాధికారులతో సమావేశ మయ్యారు. విజయోత్సవాల్లో భాగంగా వరంగల్‌లో ఈ నెల 19న మహిళా శక్తి సంఘాలతో ఏర్పాటు చేసిన సభ విజయవంతమైందని అధికారులను అభినందించారు. రుణమాఫీ, పంట బీమా, రైతు భరోసాతోపాటు సన్న వడ్లకు 
బోనస్‌ ఇలా తొలి ఏడాదిలో రైతుల సంక్షేమమే ధ్యేయంగా చేపట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.  

పెద్దపల్లిలో నిరుద్యోగ యువతతో సభ 
డిసెంబర్‌ 4న పెద్దపల్లి జిల్లాలో నిరుద్యోగ యువతతో విజయోత్సవ సభ జరపాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. అదే వేదికగా గ్రూప్‌–4తో పాటు వివిధ రిక్రూట్‌మెంట్ల ద్వారా ఎంపికైన 9 వేల మందికి నియామక పత్రాలు అందించేలా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. డిసెంబర్‌ 1 నుంచి శాఖల వారీగా నిర్దేశించిన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలతోపాటు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలన్నీ ఈ వారం రోజుల్లో జరిగేలా ప్రణాళికను రూపొందించుకోవాలని పేర్కొన్నారు.  

లక్ష మంది తెలంగాణ తల్లుల సమక్షంలో.. 
డిసెంబర్‌ 7, 8, 9 తేదీల్లో రాష్ట్రమంతటా పండుగ వాతావరణం ఉండేలా ఉత్సవాలు నిర్వహించాలని సీఎం రేవంత్‌ సూచించారు. ఈ మూడు రోజులపాటు హైదరాబాద్‌లో సచివాలయం పరిసరాలు, ట్యాంక్‌బండ్, నెక్లెస్‌ రోడ్‌ ప్రాంతమంతా తెలంగాణ వైభవం వెల్లివిరిసేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ ప్రాంతమంతా ఎగ్జిబిషన్‌ లాంటి వాతావరణం ఉండేలా స్టాళ్లను ఏర్పాటు చేయాలని చెప్పారు. తెలంగాణ సంస్కృతి, కళారూపాలు ఉట్టి పడే కార్యక్రమాలతోపాటు మ్యూజికల్‌ షో, ఎయిర్‌ షో, డ్రోన్‌ షోలను నిర్వహించాలన్నారు.

అన్ని వర్గాల ప్రజలను ఈ సంబరాల్లో భాగస్వాములను చేయాలని చెప్పారు. డిసెంబర్‌ 9న సచివాలయం ముఖద్వారం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించాలన్నారు. ఆ రోజు సాయంత్రం జరిగే ఈ వేడుకలకు ఉద్యమకారులు, మేధావులు, విద్యావంతులు, వివిధ రంగాల్లో ప్రతిభ సాధించిన వారందరినీ ఆహా్వనించాలని చెప్పారు. 

నియోజకవర్గానికో వెయ్యి మంది చొప్పున మహిళా శక్తి ప్రతినిధులను ఆహా్వనించి... లక్ష మంది తెలంగాణ తల్లుల సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. సచివాలయం, నెక్లెస్‌ రోడ్డు, ట్యాంక్‌ బండ్‌పై ఉత్సవాలు జరిగేందుకు వీలుగా వాహనాలను దారి మళ్లించాలని సూచించారు. సమీక్షలో మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు, వేం నరేందర్‌ రెడ్డి, శ్రీనివాసరాజు, సీఎస్‌ శాంతికుమారి, డీజీపీ జితేందర్‌ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement