ఐకేపీ యానిమేటర్ల గోడు పట్టదా?
సీఎం చంద్రబాబుపై వాసిరెడ్డి పద్మ విమర్శ
వారి ఆందోళనను వెటకారం చేస్తారా!
సాక్షి, హైదరాబాద్: ఇందిరా క్రాంతి పథం(ఐకేపీ) యానిమేటర్లు గత రెండు నెలలుగా తమ కోర్కెల సాధనకు సమ్మె చేస్తోంటే ఏపీ ప్రభుత్వానికి పట్టకపోవడం శోచనీయమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. యానిమేటర్ల ఆందోళనను సానుభూతితో అర్థం చేసుకుని పరిష్కరించాల్సిందిపోయి ముఖ్యమంత్రి చంద్రబాబు వెటకారంగా మాట్లాడుతున్నారని ఆమె విమర్శించారు. పద్మ శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సీఎం సభల్లో ఐకేపీ యానిమేటర్లు తమ సమస్యలు పరిష్కరించాలని నిరసనలు వ్యక్తం చేస్తూ ఉంటే ‘కొన్ని పనికిమాలిన పార్టీలు వారిని రెచ్చగొట్టి ఆందోళన చేయిస్తున్నాయి’ అని చంద్రబాబు వెటకారం చేయడం దారుణమని ఆమె అన్నారు. డ్వాక్రా గ్రూపులను సమన్వయపర్చడంతో పాటుగా క్షేత్ర స్థాయిలో 17 రకాల విధులను నిర్వర్తిస్తూ గొడ్డు చాకిరీ చేస్తున్న యానిమేటర్లు ప్రభుత్వ ఉద్యోగులు కారనడ మేమిటని పద్మ ప్రశ్నించారు.
కాళ్లు పట్టుకున్న వారికి విలువ ఉంటుందా!
పాలెం వద్ద బస్సు దుర్ఘటనలో 40 మంది సజీవ దహనం అయిన కేసు నుంచి తప్పించుకోవడానికి అధికారపక్షం కాళ్లు పట్టుకున్న అనంతపురం జిల్లాకు చెందిన ఇద్దరు సోదరులు.. వైఎస్ జగన్‌పై చేసే వ్యాఖ్యలకు విలువ ఉండదని వాసిరెడ్డి పద్మ అన్నారు.