సాక్షి, హైదరాబాద్: తమిళనాడు పోలీసులు బుధవారం సీజ్ చేసిన బంగారం వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించి, వాస్తవాలను ప్రజల ముంగిట ఉంచాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ మొత్తం వ్యవహారం గురించి ప్రజలు వివరాలను కోరుకొంటున్నారని తెలిపారు. సార్వత్రిక ఎన్నికలు పురస్కరించుకొని చెన్నైలోని తిరువళ్లూరు పుదుసత్రం వద్ద తమిళనాడు ప్లయింగ్ స్క్వాడ్ బృందం ముమ్మర తనిఖీలు చేస్తుండగా బుధవారం మూడు వాహనాలల్లో 1381 కేజీల బంగారం తరలిస్తుండంగా పట్టుబడిందన్నారు.
మూడు వాహనాలల్లో కడ్డీల రూపంలో తరలిస్తున్నటువంటి దాదాపు 1400 కేజీల బంగారం తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)కు సంబంధించిందని, తరలిస్తున్న సిబ్బంది చెప్పారు. తిరువల్లూరు ఎస్పీ కూడా ప్రకటించినట్లు పేపర్లో వచ్చిందని వాసిరెడ్డి పద్మ గుర్తు చేశారు. ఇది జరిగి రెండో రోజులవుతున్నా కనీసం టీటీడీ చైర్మన్ కానీ, ఈవో కానీ, ఇతర అధికారులు కానీ ఆ బంగారం గురించి నోరు మెదపక పోవటం అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. ఇది టీటీడీకి సంబంధించిన చిన్నా చితక విషయం కాదని తెలిపారు. 1381 కేజీలు .. అంటే దగ్గర దగ్గరగా 1400 కేజీలు బంగారం పట్టుపడితే ఎవరిది అనేది బయట పడకపోవటం.. టీటీడీ అధికారులు నోరు విప్పక పోవటం దేన్ని సూచిస్తోందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఏమి మతలబుందో ...
‘ఇంత పెద్ద స్థాయిలో బంగారం చెన్నై ఎన్నికల సందర్భంగా వాహనాలలో పట్టుబడితే... అది టీటీడీది అని ఎస్పీ ధ్రువీకరిస్తే, ఇక్కడ ఈవో, చైర్మన్ అధికారులు ఎందుకు మాట్లాడం లేదో అర్థం కావటంలేదు. ఇందులో ఏమి మతలబు ఉందో అర్థం కావటం లేదు. ఇవాళ సీఎం అనేక విషయాలపై రివ్యూ చేస్తున్నారన్నారు. టీటీడీ బంగారం రోడ్డుపై పట్టుబడితే ఒక్కరు కూడా సెక్యూరిటీ లేరన్నారు. దానికి సంబంధించిన ధృవీకరణ పత్రాలు లేవన్నారు. నడిరోడ్డుపై టీటీడీ బంగారం తరలిస్తున్నారంటే ఏంటిదసలు?. ఈ ప్రభుత్వం ఎటుపోతోంది. పవిత్రమైన టీటీడీ బంగారంపై ఇంత వివాదం జరగాల్సిన అవసరం ఉందా?. భక్తులు.. భక్తి భావంతో సమర్పించే బంగారానికి, నిధులకు సంబంధించి ఈ రోజు లెక్కా పత్రం లేకుండా పట్టుబడితే.. దానికి సంబంధించిన వివరాలు లేకపోవటం ఏమిటి? దానికి సంబంధించిన ధృవీకరణ పత్రాలు లేకపోవటం ఏమిటీ? అసలు సెక్యూరిటీ దాన్ని తరలించటం ఏమిటీ? అనధికారికంగా తరలిస్తున్నారా? అని భక్తులకు సందేహాలు కలుగుతున్నాయి. అధికారులు తేలుకుట్టిన దొంగల్లాగా.. ఎందుకు గుట్టుగా ఉన్నారో అంటూ ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి. టీటీడీ ఇప్పటివరకూ స్పందించక పోవటం బాధ్యతా రాహిత్యం. టీటీడీ బంగారానికి లెక్కా జమ లేకపోవటం ఆశ్చర్యకరం. ఇక దేవుడికే దిక్కులేక పోతే ఎవ్వరికి దిక్కు ఉంటుంది. ఈ వ్యవహరం గురించి వాస్తవాలు మొత్తం వెలుగులోకి రావాలి. ఏమి జరిగిందో ప్రజలకు తెలియాల్సి ఉంది. బంగారు వివరాలు ప్రజల ముందు ఉంచాలని వైఎస్సార్ సీపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. వాస్తవాలు వెలుగులోకి రావాలి’ అని వాసిరెడ్డి పద్మ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment