సాక్షి,హైదరాబాద్ : కాపీ కొట్టడంలో చంద్రబాబు మాస్టర్ డిగ్రీ చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఎద్దేవా చేశారు. ఆదివారం ఆమె హైదరాబాద్‌లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన మేనిఫెస్టోను అచ్చు తప్పు లేకుండా యథావిధిగా కాపీ కొట్టి టీడీపీ మేనిఫెస్టోను చంద్రబాబు ప్రకటించారన్నారు. ఎన్ని నాటకాలాడిన చంద్రబాబును ప్రజలు నమ్మరని పద్మ స్పష్టం చేశారు.
పాదయాత్రలోనే నవరత్నాలు ప్రకటన
40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు ఐదేళ్లలో తాను పెట్టిన ఐదు సంతకాలు పూర్తిగా నెరవేర్చకుండా .. 2019 మేనిఫెస్టోలో మళ్లీ చేస్తాం.. చేస్తాం.. అని వాగ్దానాలు ఇచ్చే పరిస్థితే ఉందని వాసిరెడ్డి పద్మ ఎద్దేవా చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ఉగాది రోజున జగన్ ప్రకటించారని, అయితే అంతకముందు పాదయాత్రలోనే నవరత్నాలు ప్రకటించారని తెలిపారు. అమ్మ ఒడి పథకాన్ని టీడీపీ కాపీ కొట్టి మేనిఫెస్టోలో మక్కీకి మక్కీగా దించిందన్నారు. యనమల రామకృష్ణుడు మార్చి 22న టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో డ్రాఫ్ట్ ప్రకటించారని గుర్తు చేశారు. అందులో రైతులకు వడ్డీ లేని పంట రుణాలు విషయం లేదన్నారు. జగన్ ప్రకటించిన తర్వాత వాటన్నింటినీ ఈ రోజు మేనిఫెస్టోలో టీడీపీ వారు చేర్చుకున్నారని చెప్పారు. అలాగే ప్రభుత్వ పక్కా ఇళ్ల విషయంలో బ్యాంకునుంచి తీసుకునే రుణాన్ని పూర్తిగా మాఫీ చేస్తామని జగన్ ప్రకటించారన్నారు. ఇదే చంద్రబాబు మక్కీకి మక్కీ కాపీ కొట్టారని ఆమె చెప్పారు.
నెలకు రూ.40 వేల జీతం వచ్చే వారు ఆరోగ్యశ్రీ కింద సేవలు పొందవచ్చని జగన్ హామీ ఇచ్చి మేనిఫెస్టోలో పొందుపరచిన తర్వాత చంద్రబాబు కూడా యూనివర్సిల్ హెల్త్‌కేర్ ప్రకటించారని చెప్పారు. పెళ్లి సమయంలో పేద యువతులకు రూ.లక్ష ఇస్తామని జగన్ చెప్పారని, దాన్ని చంద్రన్న పెళ్లి కానుకలో ప్రకటించారన్నారు. ప్రతి ఏడాది జనవరిలో క్యాలెండర్ విడుదల చేస్తామని జగన్ చెప్పిన తర్వాత చంద్రబాబు అదే చెబుతున్నారని వాసిరెడ్డి పద్మ తెలిపారు. పరిశ్రమలకు సంబంధించి జిల్లాకు ఒక నైపుణ్య శిక్షణా కేంద్రం ఏర్పాటు చేస్తామని జగన్ హామీ ఇచ్చారని, స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇస్తామని, అసెంబ్లీలో దీన్ని చట్టంగా తెస్తామని జగన్ స్పష్టం చేశారన్నారు. ఐదేళ్లలో ఎప్పుడూ ఈ ఆలోచన రాని చంద్రబాబు.. ఈ రోజు లోకల్ వారికి 80 శాతం ఉద్యోగాలు అని మాట్లాడుతున్నారని వాసిరెడ్డి పద్మ ఎద్దేవా చేశారు.
జగన్‌ను ఫాలో అవుతున్న చంద్రబాబు..
ప్రత్యేక హోదా దగ్గర నుంచి కేంద్రానికి అవిశ్వాస తీర్మానం పెట్టే విషయం నుంచి, ఇవాళ ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎలా రాబట్టుకోవాలో అనే అంశాల్లో చంద్రబాబు అనేక సార్లు జగన్‌ను విమర్శించారని పద్మ అన్నారు. ఒక విజన్‌తో గొప్ప దార్శనికతతో జగన్ మేనిఫెస్టో రూపొందిస్తే, దాన్ని చూచి చంద్రబాబుకు మైండ్ బ్లాక్ అయిందని తెలిపారు. చంద్రబాబు అవుట్ డేటేడ్ పొలిటీషియన్‌గా మారి పోయారని ఆమె విమర్శించారు. ఏపీకి ఇక ఏమాత్రం చంద్రబాబు మంచి చేయలేరని ప్రజలు నిర్ధారణకు వచ్చారని, జగన్ చెప్పిన విషయాలను మాత్రమే ప్రజలు నమ్ముతున్నారన్నారు.
కాపీ రాయుడు చంద్రబాబు
Published Mon, Apr 8 2019 5:17 AM | Last Updated on Mon, Apr 8 2019 5:17 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment