సాక్షి, హైదరాబాద్: ఎన్నికలకు ముందు సీఎం చంద్రబాబు ఇష్టానుసారం తనకు కావాల్సిన వారికి, ప్రైవేటు కంపెనీలకు పెద్ద ఎత్తున భూములను కారుచౌకగా కట్టబెడుతున్నారని, ఈ వ్యవహారం ప్రజల దృష్టికి రాకుండా ఉండేందుకు తప్పుదారి పట్టిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. తాను చేసిన భూకుంభకోణం గురించి ప్రజలు ఆలోచించకూడదనే ఉద్దేశంతోనే.. 2017లో ఈడీ రాసిన లేఖ అంటూ ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారని విమర్శించారు. మరుగునపడిన ఈ విషయాన్ని మొదటిసారి వెలుగులోకి తీసుకొచ్చామని బ్యాండ్ బాజా మోగిస్తున్నారని, ఎల్లో మీడియా ఈ వార్తలను పతాక శీర్షికల్లో ప్రచురిస్తోందని దుయ్యబట్టారు. జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక, ప్రజలకు ఇది చేశామని చెప్పలేక జగన్ కాళ్లు పట్టి లాగే కార్యక్రమాన్ని చంద్రబాబు చేపట్టారని మండిపడ్డారు.
బుధవారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. ఈడీ, సీబీఐ, ఐటీ విభాగాలు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాయని, అన్యాయంగా తమపై దాడులు చేస్తున్నాయని చంద్రబాబు ఇటీవలికాలంలో మండిపడ్డారని, అంతేగాక ఈ సంస్థలు ఏపీలో అడుగు పెట్టడానికి వీల్లేదని ఏకంగా జీవోలే విడుదల చేశారని ఆమె గుర్తు చేస్తూ.. హిందూజా కేసు విషయంలో జగన్ లబ్ధి పొందారని రెండేళ్లక్రితం ఈడీ, సీబీఐకి లేఖ రాసిందని, అదొక మహాద్భుతమని, దాన్ని ఇవాళ బయటపెట్టామని చంద్రబాబు చెబుతున్నారని, లేఖ రాసిన సంస్థను ప్రస్తుతం కీర్తిస్తున్నారని ఆమె విమర్శించారు. చంద్రబాబు రెండు నాల్కల ధోరణికి ఇది నిదర్శనమన్నారు. తన విషయానికొస్తే కేంద్ర దర్యాప్తు సంస్థలు చెడ్డవా? అదే జగన్‌పై విచారణ సంస్థలు చర్యలు తీసుకుంటే మహాద్భుతమని వ్యాఖ్యానిస్తారా? అని మండిపడ్డారు.
తన మనుషుల సాయంతో నాటకాలు ఆడుతుంటారు...
కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీ కార్యాలయాల్లో చంద్రబాబు తన మనుషులను నియమించుకున్నారని, వారి సాయంతో నాటకాలు ఆడుతుంటారని పద్మ విమర్శించారు. చంద్రబాబు తన పరిధిని దాటి వ్యవహరిస్తున్నారని, విచారణలో లేని అంశాల్ని ప్రస్తావిస్తున్నారని దుయ్యబట్టారు. గతంలో వైఎస్ విజయమ్మ.. చంద్రబాబుపై పిటిషన్ వేసినపుడు విచారణ జరపాలని హైకోర్టు ఆదేశాలిచ్చిందని, తమ వద్ద తగినంత సిబ్బంది లేరని, విచారణ చేయలేమని సీబీఐ ఉన్నతాధికారి చేతులెత్తేశారన్నారు. అదే జగన్ విషయంలో సీబీఐ జేడీగా పనిచేసిన లక్ష్మీనారాయణ రోజుకో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి తప్పుడు సమాచారాన్ని అందించారన్నారు. మీడియాకు రోజూ లీకులిచ్చి రకరకాలుగా జగన్ కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టారన్నారు.
తప్పుడు కేసులు బనాయించి 13 చార్జిషీట్లు తయారుచేసి జగన్‌ను 16 నెలలు జైల్లో ఉంచారన్నారు. సీబీఐ జేడీగా పనిచేసిన లక్ష్మీనారాయణ టీడీపీ–కాంగ్రెస్ చేతిలో కీలుబొమ్మగా ఉండి వారు చెప్పిన ప్రకారం నడుచుకున్నారన్నారు. ఇప్పుడు కూడా ఈడీ.. సీబీఐకి లేఖ రాసిందని సత్తా లేని విషయాన్ని తీసుకొచ్చారన్నారు. ఆ లేఖను రాసింది.. తయారు చేసింది.. సంతకం పెట్టిందీ ఎవరని ప్రశ్నించారు. టీడీపీ ఆధ్వర్యంలోనే లేఖ తయారై వారే సంతకం పెట్టారా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయన్నారు. టీడీపీ, బీజేపీతో అంటకాగిన రోజుల్లో మంత్రులు అశోక్‌గజపతిరాజు, సుజనా చౌదరి బీజేపీతో ఉంటూ ఈ లేఖను రాసి సంతకం పెట్టించి ఉంటారన్నారు.
ఏపీని నేరగాళ్లకు అడ్డాగా మార్చారు..
ప్రస్తుతం ఏపీని నేరగాళ్లకు అడ్డాగా మార్చారని, వారికి ఏపీలో భద్రత కల్పించారని పద్మ దుయ్యబట్టారు. వారం రోజులుగా చంద్రబాబు క్యాష్ అండ్ క్యారీ పద్ధతిని అమలు చేస్తున్నారని, ‘డబ్బు ఇవ్వు–భూమి తీసుకో అన్న విధంగా వ్యవహారం నడుపుతున్నారని ధ్వజమెత్తారు. అమరావతి రాజధాని ప్రాంతంలో నాలుగు వేల ఎకరాలను కారుచౌకగా ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టారన్నారు.
జేడీ ముసుగు తొలగింది..
అసలు జగన్‌పై నమోదు చేసిన చార్జిషీట్లన్నీ చంద్రబాబు తయారు చేసినవేనని పద్మ అన్నారు. వాటిని గతంలో తయారు చేసిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఇప్పుడు టీడీపీ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని, దీంతో ఆయన ముసుగు పూర్తిగా తొలగిపోయిందని స్పష్టం చేశారు. జగన్‌పై వేసిన 13 చార్జిషీట్లు పుక్కిటి పురాణాలేనన్నారు. అసలు 2017లో రాసిన ఈడీ లేఖ ఎలా బయటికొచ్చింది? ఇప్పటికీ ఈడీ, సీబీఐని చంద్రబాబు ఎలా వాడుతున్నారో అన్న సంగతిపై కేంద్రం విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు. తన బ్యాంకు అకౌంట్లను సరిచూసుకునేందుకు తరచూ విదేశాలకు వెళుతున్న చంద్రబాబుపై ఎందుకు ఈడీ కూపీలాగదని ప్రశ్నించారు. స్విస్ చాలెంజ్ పద్ధతిలో 1,600 ఎకరాలు సింగపూర్ కంపెనీకి ధారాదత్తం చేస్తే ఈడీ ఎందుకు స్పందించలేదన్నారు. ఈడీ, సీబీఐ చంద్రబాబు జేబు సంస్థలనేది నిర్ధారణైందన్నారు.
ఈడీ ఆరు పేజీల లేఖ రాసిందని, దాచి ఉంచిన లేఖను బయటకు తీశామని టీడీపీ నేతలు పండుగ చేసుకుంటున్నారని, మరి టీడీపీ, బీజేపీతో అంటకాగినపుడు ఈ లేఖపై ఎందుకు చర్యలు తీసుకోలేదని పద్మ సూటిగా ప్రశ్నించారు. చివరకు వైఎస్ భారతి పేరును కూడా సిగ్గులేకుండా ఇరికించారని మండిపడ్డారు. తప్పుడు కథనాల్ని వండి వార్చడంలో, తప్పుడు లేఖల్ని తయారు చేయడంలో టీడీపీ నేతలు సిద్ధహస్తులన్నారు.
Comments
Please login to add a commentAdd a comment