మీ అర్హతలకు తగిన ఉద్యోగం రావడం లేదని బాధపడుతున్నారా? జాబ్‌మేళాకు రౌండ్లేసి విసిగిపోయారా? డోన్ట్‌వర్రీ! ఇక ఆ బాధ అక్కర్లేదు. మీకున్న అర్హతలకు అనుగుణంగా మీకు నచ్చిన కొలువు చేసే అవకాశం కల్పించేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఏ) సిద్ధమైంది. అందుకోసం అధికారులే మీ ఇంటికి వచ్చి మీ వివరాలను సేకరించేందుకు సమాయత్తమయ్యారు. ఆ తరువాత మీ అర్హతలు, అభీష్టానికి అనుగుణంగా శిక్షణ ఇచ్చి నచ్చిన ఉద్యోగంలో చేరేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు.
- సాక్షి ప్రతినిధి, కరీంనగర్
జాబ్‌మేళా పేరిట అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ఆశించిన ఫలితాలు రావడం లేదు. వంద ఉద్యోగాలుంటే... అందులో సగం మందే దరఖాస్తు చేసుకుంటున్నారు. శిక్షణ పూర్తయిన తరువాత వారిలో 20 శాతానికి మించి ఉద్యోగాల్లో చేరడం లేదు. అందుకే నిరుద్యోగులకు ఆసక్తి ఉన్న ఉద్యోగాలను తెలుసుకుని వారి అర్హతల మేరకు కొలువు ఇప్పించాలని గ్రామీణాభివృద్ధి సంస్థ నిర్ణయించింది. ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి వర్క్‌షాప్‌లో కొన్ని మార్గదర్శకాలను రూపొందించారు. ఏప్రిల్‌లో ఇంటింటికీ సర్వే చేసి నిరుద్యోగుల వివరాలు తెలుసుకుంటాం.ఆ తరువాత గ్రామానికి ఐదుగురిని ఎంపిక చేసి శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం.
- జె.అరుణశ్రీ, డీఆర్‌డీఏ ప్రాజెక్టు డెరైక్టర్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : మార్కెట్‌లో విస్తృ ఉద్యోగ అవకాశాలు ఉన్నప్పటికీ సరైన కొలువు దొరకడం లేదని నిరాశతో ఉన్న నిరుద్యోగులకు అండగా నిలబడాలనే ఉద్దేశంతో గ్రామీణాభివృద్ధి సంస్థ బృహత్తర ప్రణాళికను రూపొందించిం ది. అందులో భాగంగా ఏప్రిల్ ఒకటి నుంచి 10 వరకు జిల్లావ్యాప్తంగా ఇంటింటికీ వెళ్లి నిరుద్యోగల వివరాలను సేకరించనున్నారు. అనంతరం ఆ వివరాలను క్రోడీకరించి ఒక్కో గ్రామంలో ఐదుగురి చొప్పున నిరుద్యోగులను ఎంపిక చేస్తారు. వారందరినీ సమీకరించి అవగాహన పేరిట మూడు రోజుల పాటు శిక్షణ ఇస్తారు. ఇందులో పాల్గొనే నిరుద్యోగులతో విడివిడిగా సమావేశమవుతారు. ఆయా నిరుద్యోగుల విద్యార్హతలను అడిగి తెలుసుకుంటారు. అర్హతలకు అనుగుణంగా ఏయే ఉద్యోగాలు చేసే అవకాశముందో చెబుతారు.
వాటిలో ఎలాంటి ఉద్యోగం కావాలో సదరు నిరుద్యోగి అభీష్టానికే వదిలేస్తారు. మూడు రోజులు అవగాహన కార్యక్రమం పూర్తయిన తరువాత ఎవరెవరు? ఏయే ఉద్యోగాలు చేసేందుకు సుముఖంగా ఉన్నారో జాబితాను రూపొందిస్తారు. అనంతరం వారి ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాన్ని నేర్పించేందుకు 45 రోజుల నుంచి 90 రోజుల వ్యవధి కలిగిన శిక్షణనిస్తారు. జాతీయ నిర్మాణ సంస్థ(న్యాక్) ప్రతినిధులు, మార్కెటింగ్ ప్రముఖులతో శిక్షణ ఇప్పిస్తారు. శిక్షణా కాలంలో అవసరమైన హాస్టల్ వసతి, భోజన సదుపాయాన్ని కల్పిస్తారు.
అందుకోసం ఒక్కో అభ్యర్ధికి రోజుకు సగటున 120 చొప్పున నెలకు రూ.3,600 ఖర్చు చేస్తారు. శిక్షణ అనంతరం ఉద్యోగాలు కల్పిస్తారు. ఉద్యోగాల్లో చేరిన అభ్యర్థులు వివాహం చేసుకున్న తరువాత ఆర్థిక ఇబ్బందుల్లేకుండా ఉండేలా జీతభత్యాలు కల్పించేలా చర్యలు తీసుకునే దిశగా ప్రణాళికను రూపొందిస్తున్నారు. కలెక్టర్ నీతూప్రసాద్ ‘వారధి’ పేరిట అటు ప్రభుత్వ, కార్పొరేట్, ప్రైవేటు సంస్థలకు, ఇటు నిరుద్యోగులకు అనుసంధానంగా ప్రత్యేక ఏజెన్సీని నెలకొల్పేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా నిరుద్యోగుల జాబితాను సేకరించి, వారికి అవసరమైన నైపుణ్యాన్ని సమకూర్చేందుకు డీఆర్‌డీఏ సిద్ధమవడంతో నిరుద్యోగులకు త్వరలోనే కోరుకున్న కొలువు దక్కే అవకాశాలు కన్పిస్తున్నాయి.
కొలువు కావాలా?
Published Thu, Mar 19 2015 3:40 AM | Last Updated on Sun, Mar 10 2019 8:23 PM
Advertisement
Advertisement