సాక్షి, చెన్నై: రాత్రికి రాత్రే వారి జీవితం మారిపోయిందిరా.. అని చెప్పుకుంటుంటాం!. ఇందుకు మంచి ఉదాహరణ 18 ఏళ్ల సూర్యకుమార్. పెద్దగా చదువుకోకపోయినా మెకానిక్‌గా పనిచేస్తూ ఎంతో నిజాయతీగా బతుకుతున్న సూర్యకుమార్ జీవితం ఏప్రిల్ 19వ తేదీ రాత్రి తర్వాత ఒక్కసారిగా మారిపోయింది. ఇంతకీ ఆరోజు ఏం జరిగిందంటే... చెన్నై లోని అన్నానగర్‌లో ఉన్న మెకానిక్ షెడ్‌లో పనిచేస్తుండగా ఒక్కసారిగా ఓ మహిళ అరుపులు విన్నాడు. బయటకు వచ్చి చూస్తే డాక్టర్ అముతా అనే మహిళ మెడలో నుంచి ఓ దొంగ గొలుసు తెంచుకొని పారిపోతున్నాడు. సూర్యకుమార్ అతణ్ని వెంబడించి, పట్టుకొని, పోలీసులకు అప్పగించాడు. నిజాయతీగా గొలుసు తీసుకొచ్చి డాక్టర్‌కు ఇచ్చేశాడు.
సూర్యకుమార్ ధైర్యసాహసాలు, నిజాయతీని మెచ్చుకున్న ఎస్‌ఆర్‌ఎమ్ గ్రూపు సంస్థ లక్ష రూపాయలు, చెన్నై రోటరీ క్లబ్ రూ.2 లక్షలు రివార్డుతో అభినందించాయి. చెన్నై పోలీస్ కమిషనర్.. సూర్యకుమార్‌ను స్వయంగా తనవద్దకు పిలిపించుకొని అభినందించాడు. నీకేం కావాలి? అని అడగ్గా.. ఉద్యోగం కావాలని చెప్పడంతో టీవీఎస్ సుందరం మోటార్స్ సంస్థ ఉద్యోగం ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. పోలీస్ బాస్ సమక్షంలోనే గురువారం అపాయింట్‌మెంట్ లెటర్ కూడా అందుకున్నాడు. నాకెందుకులే అనుకున్నా.. గొలుసును తెచ్చి ఇవ్వకపోయినా సూర్యకుమార్ ఈ రోజు మెకానిక్‌గానే ఉండేవాడు. కానీ అతని ధైర్యసాహసాలు, నిజాయతీ ఇప్పుడతణ్ని ఓ ఉద్యోగిని చేశాయి.
ధైర్యసాహసాలు + నిజాయతీ = ఉద్యోగం
Published Sat, Jul 7 2018 8:57 AM | Last Updated on Fri, Jul 12 2019 3:02 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment