సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ఈ సారి ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లు లక్ష్యం చేరేట్టు లేదు. సన్నరకాలకు డిమాండ్ ఉండటం, రైతులు బయట విక్రయిస్తుండటంతో ఐకేపీ, ఐటీడీఏ కేంద్రాలు వెలవెలబోతున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ) కంటే మార్కెట్లో అధిక రేటు వస్తుండటంతో రైతులు మిల్లర్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా చేపట్టే కొనుగోళ్లపై రైతులు ఆసక్తి చూపడం లేదు. ఫలితంగా ఈ ఖరీఫ్‌లో 1.61 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలన్న లక్ష్యం నెరవేరే అవకాశం లేదు. దీంతో ఐకేపీ సంఘాలకు కమీషన్ తగ్గే అవకాశం ఉంది.
ఇప్పటివరకు 37,763 మెట్రిక్ టన్నులే కొనుగోలు
ప్రభుత్వ మద్దతు ధర ప్రకారం ధాన్యం కొనుగోలు చేసేందుకు అధికారులు జిల్లాలో 90 డీఆర్‌డీఏ, ఐటీడీఏ ఐకేపీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ డివిజన్లకు చెందిన అన్ని మండలాల్లో ధాన్యం కొనుగోలు చేపట్టారు. అక్టోబర్ 25 నుంచి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన అధికారులు ప్రభుత్వ మద్దతు ధరపై కొనుగోళ్లు చేపట్టారు. ఎంఎస్‌పీ ప్రకారం కామన్ ధాన్యం క్వింటాల్‌కు రూ.1310, గ్రేడ్-ఎ రకం ధాన్యానికి రూ.1345 చెల్లించి కొనుగోలు చేశారు. అయితే 2013-14 యాక్షన్ ప్లాన్ ప్రకారం జిల్లాలో 52,016 హెక్టార్లలో వరి సాగవుతుందని భావించారు.
నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ డివిజన్లకు చెందిన 42 మండలాల్లో 46,228 హెక్టార్లలో వరి వేశారు. పరిస్థితులు అనుకూలిస్తే ఈ మేరకు 2.31 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి అవుతుందని భావించారు. ఆశించిన మేరకు దిగుబడి రాకపోయినా.. దిగుబడిలో 25 శాతం అవసరాలు, ఇతర కారణాలతో విక్రయించే అవకాశం లేనందున, 1.61 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయవచ్చని అంచనా వేశారు. ఈ మేరకు 90 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, సోమవారం నాటికి 11,064 మంది రైతుల నుంచి రూ.50.46 కోట్లు చెల్లించి 37,763 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. దీంతో ఈ ఖరీఫ్‌లో ధాన్యం కొనుగోలు లక్ష్యం చేరడం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఐకేపీ సంఘాలకు తగ్గనున్న కమీషన్
జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలు వేసిన అంచనాల మేరకు దిగుబడి వచ్చినా.. సన్నరకాలకు బయట మార్కెట్‌లో అధిక ధర పలుకుతుండటంతో రైతులు మిల్లర్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఐకేపీ కొనుగోలు కేంద్రాల ద్వారా నిర్దేశించిన లక్ష్యం చేరడం కష్టంగా కనిపిస్తోంది. ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో రైతులకు క్వింటాల్‌కు రూ.1,345 మించకపోగా.. బయట మార్కెట్‌లో క్వింటాల్‌కు రూ.1500 నుంచి రూ.1800 పలుకుతోంది. దీంతో రైతులు వ్యాపారులు, రైసుమిల్లర్లకు ధాన్యం విక్రయిస్తున్నారు.
ఇదిలా వుండగా డీఆర్‌డీఏ, ఐటీడీఏల పరిధిలో ఏర్పాటు చేసిన కేంద్రాల ద్వారా కొనుగోళ్లు సవ్యంగా సాగితే ఐకేపీ సంఘాలకు రూ.3.36 కోట్ల కమీషన్ వచ్చే అవకాశం ఉందని అధికారుల అంచనా వేశారు.
మహిళ సంఘాలకు గతంలో ధాన్యం కొనుగోలుపై రూ.100కు రూ.1.50 చెల్లించిన ప్రభుత్వం గతేడాది నుంచి రూ.2.50కు పెంచింది. గత ఖరీఫ్‌లో 66,385 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసిన స్వయం సహాయక సంఘాలు రూ.2.10 కోట్ల కమీషన్ పొందాయి. గత రబీ సీజన్‌లో 30,510 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రూ.97 లక్షల కమీషన్ తీసుకున్నారు. ఈ సారి స్వయం సహాయక సంఘాల ద్వారా కనీసం లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినా రూ.3.36 కోట్ల మేరకు కమీషన్ పొందే అవకాశం ఉంది. కొనుగోళ్లు గణనీయంగా తగ్గనుండగా కమీషన్ కూడా తగ్గవచ్చని అధికారులు చెప్తున్నారు.
లక్ష్యానికి దూరం
Published Tue, Dec 24 2013 4:40 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement
Advertisement