ITDA centers
-
పరిస్థితి ఆందోళనకరం.. వారిలో 75 శాతం రక్తహీనత
ములుగు(వరంగల్): ఏజెన్సీ ప్రాంతాల్లోని గర్భిణుల్లో 75 శాతం మందికి రక్తహీనత (హిమోగ్లోబిన్ సమస్య) ఉండడం ఆందోళనకరమని సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్ అన్నారు. శుక్రవారం ఏటూరునాగారం, భద్రాచలం, ఉట్నూరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులు, కలెక్టర్లతో ములుగు జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో వైద్యారోగ్యశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సి పల్ సెక్రటరీ క్రిస్టియానా జñడ్ ఛోంగ్తూ, మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి దివ్యదేవరాజన్, సీఎం ఓఎస్డీ (హరితహారం) ప్రియాంక వర్గీస్‌లతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా జిల్లాలోని మంగపేట మండలం బ్రాహ్మణపల్లి పీహెచ్సీ, ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి వెల్నెస్ సెంటర్, ఎస్ఎస్ తాడ్వాయి మండలంలోని అంగన్వాడీ కేంద్రాలకు తనిఖీ చేశారు. అనంతరం సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గర్భిణులకు 75శాతం హిమోగ్లోబిన్ సమస్య ఉండడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ములుగు జిల్లాలో 2,309, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 6,348, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 1,897, ఖమ్మంలో 4,431 మంది తీవ్ర పోషణలోపానికి గురైన పిల్లలు ఉండడం బాధాకరమన్నారు. ఆయా ఐటీడీఏల పరిధిలో మూడు లక్షల మంది చిన్నారులు వివిధ అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారన్నారు. వచ్చే మూడు నెలల్లో పరిస్థితిలో మార్పు రావాలని, ఐసీడీఎస్, వైద్యశాఖ, పంచాయతీరాజ్ శాఖల అధికారులు సమన్వయంగా ముందుకు సాగాలని సూచించారు. ఐటీడీఏ ప్రాంతాల్లో బాలామృతం, గుడ్లు, పాలు వంటి పోషకాహా రాలను అందిస్తున్నా.. ఎక్కడ లోపం ఏర్పడుతుందో అర్థం కావడం లేదన్నారు. లక్షమంది చిన్నారులకు 84 మంది మృత్యువాత పడుతున్నారని, దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. వెల్నెస్ సెంటర్లలో పాముకాటు, కుక్కకాటు ఇంజక్షన్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఆరు నెలల్లో మిల్క్ బ్యాంకుల ఏర్పాటు.. వచ్చే ఆరు నెలల్లో మిల్క్ బ్యాంకులను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సన్నద్ధం అవుతుందని సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్ అన్నారు. కేరళ రాష్ట్రంలో పరిస్థితిని పరిశీలించిన తర్వాత రాష్ట్రంలో కేసీఆర్ కిట్, ఇమ్యూనైజేషన్ కార్యక్రమాలను బలోపేతం చేశారన్నారు. కేరళలో ప్రతి గ్రామపంచాయతీలు పోటీపడి పోషకాహారాన్ని అందించడాన్ని గమనించి సీఎం కేసీఆర్‌కు నివేదిక అందించామని తెలిపారు. ఐటీడీఏ పరిధిలోని ములుగు, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, అసిఫాబాద్ జిల్లాలను పైలట్ ప్రాజెక్టులుగా తీసుకొని 8 నెలలపాటు రెండో వంతు పోషకాహారాన్ని అందిస్తామన్నారు. విజయవంతం అయితే అన్ని ప్రాంతాల్లో అమలు చేస్తామన్నారు. 37శాతమే ముర్రుపాలు తాగిస్తున్నారు... రాష్ట్రంలో ప్రసవం అయ్యాక కేవలం 37శాతం మంది మాత్రమే పిల్లలకు ముర్రుపాలు తాగిస్తున్నారని, ఇది ఆందోళన కరమైన విషయమని వైద్యారోగ్య శాఖ కార్యదర్శి వాకాటి కరుణ అన్నారు. ఆశ కార్యకర్తలు, అంగన్వాడీలు ఈ విషయంపై అవగాహన కల్పించాలని సూచించారు. గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి క్రిస్టియానా మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో గిరి పోషణ పథకం ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అదనపు పౌష్టికాహారం అందిస్తామన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి దివ్య దేవరాజన్ మాట్లాడుతూ గ్రోత్‌మానిటరింగ్ డ్రైవ్ ద్వారా తక్కువ బరువుతో, పౌష్టికాహార లోపంతో గుర్తించిన పిల్లలు ములుగు జిల్లాలో 16శాతం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 10.5శాతం, ఖమ్మం జిల్లాలో 6.2శాతం ఉన్నారని తెలిపారు. కలెక్టర్ కృష్ణ ఆదిత్య మాట్లాడుతూ ములుగు, జయశంకర్ భూపాలపల్లి, ఐటీడీఏ ఏటూరునాగారం పరిధిలో చిన్నారులకు, బాలింతలకు, గర్భిణులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించేందుకు చర్యలు చేపడతామన్నారు. తాడ్వాయి అంగన్వాడీ కేంద్రంలో 100శాతం చిన్నారులు సరైన బరువుతో ఆరోగ్యవంతంగా పెరిగేలా పౌష్టికాహారం అందించిన అంగన్వాడీ టీచర్ భాగ్యలక్షి్మని అధికారులు అభినందించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌పాటిల్, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అనిరుధ్, భద్రాచలం, ఉట్నూరు ఐటీడీఏ పీఓలు గౌతమ్ పోత్రు, బ్రవేష్ మిశ్రా, అదనపు కలెక్టర్ ఆదర్శ్ సురభి, భూపాలపల్లి అదనపు కలెక్టర్ టీఎస్.దివాకర్, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి అల్లెం అప్పయ్య, పీహెచ్సీ వైద్యాధికారి నిఖిత, జిల్లా సంక్షేమ అధికారి ప్రేమలత, భూపాలపల్లి సంక్షేమ అధికారి శామ్యూల్, డీఆర్డీఓ పురుషోత్తం, ఐసీడీఎస్ సీడీపీవోలు, సూపర్వైజర్లు, ఐటీడీఏ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. చదవండి: అదో వెరైటీ విలేజ్.. పురుషులకో భాష, మహిళలకు మరో భాష -
ఎస్సీ,ఎస్టీలకు అండ
-
ఏడు గిరిజన ప్రాంతాల్లో 7 ‘సూపర్’ ఆసుపత్రులు
సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని ఏడు ఐటీడీఏల్లో (గిరిజన ప్రాంతాలు) సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. అరకు, పాలకొండ, పార్వతీపురం, రంపచోడవరం, చింతూరు, కె.ఆర్.పురం, దోర్నాలలో సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రుల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీ, పాడేరులో ట్రైబల్ మెడికల్ కాలేజీ, కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటుకు కూడా ప్రతిపాదనలు అందజేయాలని సూచించారు. సాంఘిక, గిరిజన, మైనార్టీ సంక్షేమ శాఖలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం సమీక్ష నిర్వహించారు. డిమాండ్ ఉన్నచోట కొత్త హాస్టళ్ల ఏర్పాటు కోసం ప్రతిపాదనలు పంపాలని ముఖ్యమంత్రి సూచించారు. 309 హాస్టళ్లలో కుక్స్, వాచ్మెన్ సహా ఖాళీగా ఉన్న 927 పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. మూడు దశల్లో హాస్టళ్లలో అన్ని సౌకర్యాలు ప్రతి హాస్టల్లో వెంటనే టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని, ప్రాధాన్యం ప్రకారం అందుబాటులోకి తేవాలన్నారు. రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టళ్లలో నాణ్యతపై అధికారులు దృష్టి సారించి క్రమం తప్పకుండా తనిఖీలు చేయాలని సూచించారు. పాఠశాలల్లో మూడు దశల్లో 9 రకాల సౌకర్యాలు కల్పించేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు. రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టల్స్‌లో చేపట్టాల్సిన పనులపై ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. హాస్టళ్లలో మంచాలు, దుప్పట్లు సహా అన్ని సౌకర్యాలు కల్పించాలని, మూడు దశల్లో ఈ పనులు పూర్తి చేయాలన్నారు. మన పిల్లలను స్కూలుకు పంపిస్తే ఎలా ఆలోచిస్తామో ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లు, పాఠశాలలు, హాస్టళ్లలో చదివే విద్యార్థుల గురించి కూడా అలాగే ఆలోచించాలన్నారు. హాస్టళ్లలో వసతుల కల్పన కోసం నిధుల లభ్యత గురించి సీఎం ఆరా తీశారు. వచ్చే ఏడాది నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ స్కూలు తెరిచే సమయానికి యూనిఫారాలు, పుస్తకాలు అందించి తీరాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు. ప్రభుత్వ స్టడీ సర్కిళ్లను బలోపేతం చేయాలని సూచించారు. వైఎస్సార్ చేయూత సాయం వచ్చే ఏడాది నుంచి నామినేటెడ్ పోస్టులు, నామినేషన్ పనుల్లో కచ్చితంగా యాభై శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వైఎస్సార్ చేయూత కింద లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియను ప్రారంభించాలని, వచ్చే ఏడాది నుంచి 45 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ మహిళలకు ఏటా రూ.18,750 చొప్పున ఆర్థిక సాయం అందిస్తామన్నారు. సంతృప్తికర స్థాయిలో పార్టీలు, వర్గాలకు అతీతంగా అర్హులందరికీ ఇది అందాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పథకాల అమల్లో పారదర్శకత ఉండాలని సూచించారు. గిరిజనులకు అటవీ భూములపై పట్టాలు ఇవ్వడంపై ప్రత్యేక దృష్టి పెట్టి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సీఎం పేర్కొన్నారు. ఎస్సీలు, ఎస్టీలకు వేర్వేరుగా కమిషన్లు ఏర్పాటు చేయాల్సి ఉందని, ఈమేరకు అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు బిల్లు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. -
కదంతొక్కిన ఆదివాసీలు
బీర్సాయిపేట నుంచి ఉట్నూర్‌కు పాదయాత్ర 300ల మంది వరకు హాజరైన గిరిజనులు ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ఆందోళన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్, పీవోకు వినతి ఉట్నూర్ రూరల్, న్యూస్‌లైన్ : ఆదివాసీ గిరిజన గ్రామాల్లో మౌళిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ సోమవారం గిరిజనులు కదం తొక్కారు. ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో బీర్సాయిపేట గ్రామం నుంచి ఉట్నూర్ ఐటీడీఏ వరకు పాదయాత్రగా తరలివచ్చారు. మండల కేంద్రంలో ర్యాలీ చేపట్టారు. అనంతరం ఐటీడీఏ పీవోకు వినతిపత్రం అందజేశారు. పాదయాత్రగా వచ్చిన గిరిజనులు ఐటీడీఏ వద్ద ధర్నా నిర్వహించారు. పీవో బయటికి వచ్చి వినతిపత్రం తీసుకురావాలని పలువురు డిమాండ్ చేయడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. ఐటీడీఏ సమావేశ మందిరంలో చొచ్చుకెళ్లేందుకు గిరిజనులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఆ సమయంలో వాతావరణం ఉద్రిక్తతంగా మారింది. పీవో బయటికి వచ్చి వారి సమస్యలను విన్నారు. మౌలిక వసతులు కల్పించాలి ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షుడు కనక యాదవ్‌రావు మాట్లాడుతూ, ఆదివాసీ గిరిజన గ్రామాల్లో విద్య, వైద్యం, తాగునీరు, విద్యుత్, తదితర మౌలిక సదుపాయాలు లేక గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధప్రతిపాదికన మౌళిక వసతులు కల్పించాలని కోరారు. అటవీ హక్కు చట్టంలో అర్హులైన గిరిజనులకు హక్కు పత్రాలు అందించి ఐటీడీఏ పరిధిలోని ఖాళీగా ఉన్న ఉద్యోగాల్లో ఆదివాసీ గిరిజనులచే భర్తీ చే యాలని అన్నారు. మిగిలి ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేపట్టి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని పేర్కొన్నారు. 2013లో పంట నష్టపోయిన ఏజెన్సీ ప్రాంత రైతులకు పరిహారం వెంటనే చెల్లించాలని, ఐటీడీఏలోని అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. ఉట్నూర్ కేంద్రంగా ఆదివాసీ గిరిజనుల కోసం ప్రత్యేక సమావేశ భవనాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. స్పందించిన పీవో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పంద్రం జైవంత్‌రావు, ఉపాధ్యక్షుడు మండాడి చంద్రభాన్, గౌరవ అధ్యక్షుడు దశ్వంత్రావు, కోశాధికారి వెడ్మ విశ్వం, ఏవీఎస్పీ జిల్లా అధ్యక్షుడు నైతం బాలు, నాయకులు మెస్రం శేకు, గజానంద్, సెడ్మకి సీతారాం ఉట్నూర్ సర్పంచ్ బొంత ఆశారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
లక్ష్యానికి దూరం
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ఈ సారి ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లు లక్ష్యం చేరేట్టు లేదు. సన్నరకాలకు డిమాండ్ ఉండటం, రైతులు బయట విక్రయిస్తుండటంతో ఐకేపీ, ఐటీడీఏ కేంద్రాలు వెలవెలబోతున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) కంటే మార్కెట్లో అధిక రేటు వస్తుండటంతో రైతులు మిల్లర్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా చేపట్టే కొనుగోళ్లపై రైతులు ఆసక్తి చూపడం లేదు. ఫలితంగా ఈ ఖరీఫ్‌లో 1.61 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలన్న లక్ష్యం నెరవేరే అవకాశం లేదు. దీంతో ఐకేపీ సంఘాలకు కమీషన్ తగ్గే అవకాశం ఉంది. ఇప్పటివరకు 37,763 మెట్రిక్ టన్నులే కొనుగోలు ప్రభుత్వ మద్దతు ధర ప్రకారం ధాన్యం కొనుగోలు చేసేందుకు అధికారులు జిల్లాలో 90 డీఆర్డీఏ, ఐటీడీఏ ఐకేపీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ డివిజన్లకు చెందిన అన్ని మండలాల్లో ధాన్యం కొనుగోలు చేపట్టారు. అక్టోబర్ 25 నుంచి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన అధికారులు ప్రభుత్వ మద్దతు ధరపై కొనుగోళ్లు చేపట్టారు. ఎంఎస్పీ ప్రకారం కామన్ ధాన్యం క్వింటాల్‌కు రూ.1310, గ్రేడ్-ఎ రకం ధాన్యానికి రూ.1345 చెల్లించి కొనుగోలు చేశారు. అయితే 2013-14 యాక్షన్ ప్లాన్ ప్రకారం జిల్లాలో 52,016 హెక్టార్లలో వరి సాగవుతుందని భావించారు. నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ డివిజన్లకు చెందిన 42 మండలాల్లో 46,228 హెక్టార్లలో వరి వేశారు. పరిస్థితులు అనుకూలిస్తే ఈ మేరకు 2.31 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి అవుతుందని భావించారు. ఆశించిన మేరకు దిగుబడి రాకపోయినా.. దిగుబడిలో 25 శాతం అవసరాలు, ఇతర కారణాలతో విక్రయించే అవకాశం లేనందున, 1.61 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయవచ్చని అంచనా వేశారు. ఈ మేరకు 90 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, సోమవారం నాటికి 11,064 మంది రైతుల నుంచి రూ.50.46 కోట్లు చెల్లించి 37,763 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. దీంతో ఈ ఖరీఫ్‌లో ధాన్యం కొనుగోలు లక్ష్యం చేరడం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఐకేపీ సంఘాలకు తగ్గనున్న కమీషన్ జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలు వేసిన అంచనాల మేరకు దిగుబడి వచ్చినా.. సన్నరకాలకు బయట మార్కెట్లో అధిక ధర పలుకుతుండటంతో రైతులు మిల్లర్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఐకేపీ కొనుగోలు కేంద్రాల ద్వారా నిర్దేశించిన లక్ష్యం చేరడం కష్టంగా కనిపిస్తోంది. ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో రైతులకు క్వింటాల్‌కు రూ.1,345 మించకపోగా.. బయట మార్కెట్లో క్వింటాల్‌కు రూ.1500 నుంచి రూ.1800 పలుకుతోంది. దీంతో రైతులు వ్యాపారులు, రైసుమిల్లర్లకు ధాన్యం విక్రయిస్తున్నారు. ఇదిలా వుండగా డీఆర్డీఏ, ఐటీడీఏల పరిధిలో ఏర్పాటు చేసిన కేంద్రాల ద్వారా కొనుగోళ్లు సవ్యంగా సాగితే ఐకేపీ సంఘాలకు రూ.3.36 కోట్ల కమీషన్ వచ్చే అవకాశం ఉందని అధికారుల అంచనా వేశారు. మహిళ సంఘాలకు గతంలో ధాన్యం కొనుగోలుపై రూ.100కు రూ.1.50 చెల్లించిన ప్రభుత్వం గతేడాది నుంచి రూ.2.50కు పెంచింది. గత ఖరీఫ్‌లో 66,385 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసిన స్వయం సహాయక సంఘాలు రూ.2.10 కోట్ల కమీషన్ పొందాయి. గత రబీ సీజన్లో 30,510 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రూ.97 లక్షల కమీషన్ తీసుకున్నారు. ఈ సారి స్వయం సహాయక సంఘాల ద్వారా కనీసం లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినా రూ.3.36 కోట్ల మేరకు కమీషన్ పొందే అవకాశం ఉంది. కొనుగోళ్లు గణనీయంగా తగ్గనుండగా కమీషన్ కూడా తగ్గవచ్చని అధికారులు చెప్తున్నారు.