
సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని ఏడు ఐటీడీఏల్లో (గిరిజన ప్రాంతాలు) సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. అరకు, పాలకొండ, పార్వతీపురం, రంపచోడవరం, చింతూరు, కె.ఆర్.పురం, దోర్నాలలో సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రుల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీ, పాడేరులో ట్రైబల్ మెడికల్ కాలేజీ, కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటుకు కూడా ప్రతిపాదనలు అందజేయాలని సూచించారు. సాంఘిక, గిరిజన, మైనార్టీ సంక్షేమ శాఖలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం సమీక్ష నిర్వహించారు. డిమాండ్ ఉన్నచోట కొత్త హాస్టళ్ల ఏర్పాటు కోసం ప్రతిపాదనలు పంపాలని ముఖ్యమంత్రి సూచించారు. 309 హాస్టళ్లలో కుక్స్, వాచ్‌మెన్ సహా ఖాళీగా ఉన్న 927 పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
మూడు దశల్లో హాస్టళ్లలో అన్ని సౌకర్యాలు
ప్రతి హాస్టల్‌లో వెంటనే టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని, ప్రాధాన్యం ప్రకారం అందుబాటులోకి తేవాలన్నారు. రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టళ్లలో నాణ్యతపై అధికారులు దృష్టి సారించి క్రమం తప్పకుండా తనిఖీలు చేయాలని సూచించారు. పాఠశాలల్లో మూడు దశల్లో 9 రకాల సౌకర్యాలు కల్పించేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు. రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టల్స్‌లో చేపట్టాల్సిన పనులపై ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. హాస్టళ్లలో మంచాలు, దుప్పట్లు సహా అన్ని సౌకర్యాలు కల్పించాలని, మూడు దశల్లో ఈ పనులు పూర్తి చేయాలన్నారు. మన పిల్లలను స్కూలుకు పంపిస్తే ఎలా ఆలోచిస్తామో ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లు, పాఠశాలలు, హాస్టళ్లలో చదివే విద్యార్థుల గురించి కూడా అలాగే ఆలోచించాలన్నారు. హాస్టళ్లలో వసతుల కల్పన కోసం నిధుల లభ్యత గురించి సీఎం ఆరా తీశారు. వచ్చే ఏడాది నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ స్కూలు తెరిచే సమయానికి యూనిఫారాలు, పుస్తకాలు అందించి తీరాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు. ప్రభుత్వ స్టడీ సర్కిళ్లను బలోపేతం చేయాలని సూచించారు.
వైఎస్సార్ చేయూత సాయం వచ్చే ఏడాది నుంచి
నామినేటెడ్ పోస్టులు, నామినేషన్ పనుల్లో కచ్చితంగా యాభై శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వైఎస్సార్ చేయూత కింద లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియను ప్రారంభించాలని, వచ్చే ఏడాది నుంచి 45 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ మహిళలకు ఏటా రూ.18,750 చొప్పున ఆర్థిక సాయం అందిస్తామన్నారు. సంతృప్తికర స్థాయిలో పార్టీలు, వర్గాలకు అతీతంగా అర్హులందరికీ ఇది అందాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పథకాల అమల్లో పారదర్శకత ఉండాలని సూచించారు. గిరిజనులకు అటవీ భూములపై పట్టాలు ఇవ్వడంపై ప్రత్యేక దృష్టి పెట్టి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సీఎం పేర్కొన్నారు. ఎస్సీలు, ఎస్టీలకు వేర్వేరుగా కమిషన్లు ఏర్పాటు చేయాల్సి ఉందని, ఈమేరకు అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు బిల్లు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment