చేను చెరువైంది | Maize, Paddy crops destroyed by heavy rains | Sakshi
Sakshi News home page

చేను చెరువైంది

Published Thu, Oct 24 2013 2:14 AM | Last Updated on Fri, Sep 1 2017 11:54 PM

Maize, Paddy crops destroyed by heavy rains

* వ్యవసాయశాఖ లెక్క 2.20 లక్షల ఎకరాలే
* క్షేత్రస్థాయి అంచనా 7లక్షల ఎకరాలకు పైనే..
* భారీ వర్షాలతో అతలాకుతలమైన రైతన్న
* మార్కెట్ యార్డుల్లో టార్పాలిన్లు లేక తడిసిన ధాన్యం, పత్తి బస్తాలు
* పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు.. జలమయమైన గ్రామాలు.. కూలిన ఇళ్లు
* వాగుల్లో కొట్టుకుపోయి ప్రకాశం జిల్లాలో ఒక విద్యార్థిని మృతి, ముగ్గురు గల్లంతు
* రాజధానిలో భారీవర్షం.. ట్రాఫిక్ కష్టాలు
 
 సాక్షి-నెట్‌వర్క్: పాలుపోసుకుంటున్న వరి కంకులు.. తొలి కోతకు విచ్చుకుంటున్న పత్తి చేలు.. చేతిదాకా వచ్చిన మొక్కజొన్న... మార్కెట్ యార్డులకొచ్చిన ధాన్యం బస్తాలు.. ఒకటేమిటి కర్షకుడు కాయకష్టం చేసి కన్నబిడ్డలా పెంచుకున్న పంటలన్నీ నిలువెల్లా నీట మునిగాయి. ఈశాన్య రుతుపవనాలు, అల్పపీడనం ప్రభావంతో రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల ధాటికి పంటలన్నీ కుదేలయ్యాయి. రైతన్నను మళ్లీ కష్టాల కడలిలోకి నెట్టేశాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బుధవారం మరింత తీవ్రమైన నేపథ్యంలో రాష్ట్రంలో తొమ్మిది జిల్లాల్లో దాదాపు 2.20 లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా. అయితే ‘సాక్షి’ క్షేత్రస్థాయిలో సేకరించిన సమాచారం ప్రకారం పంట నష్టం 7 లక్షల ఎకరాలకుపైగానే ఉంటుందని అంచనా.
 
 తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అత్యధిక నష్టం సంభవించింది. ఈ వర్షాలు ఇంతటితో ఆగకుండా కొనసాగితే పంట నష్టం భారీగా పెరిగే అవకాశం ఉంది. మరోవైపు బుధవారం ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలతో  కాలనీలకు కాలనీలు మునిగిపోయాయి. పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో బుధవారం ఒక్కరోజే 34 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదే జిల్లాలో వర్షాల ధాటికి వాగులో కొట్టుకుపోయి ఒక విద్యార్థిని మరణించింది. మరో వాగులో 15 మంది విద్యార్థులు కొట్టుకుపోగా.. 12 మందిని స్థానికులు రక్షించగలిగారు. మిగతా ముగ్గురు విద్యార్థుల ఆచూకీ తెలియరాలేదు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో మిద్దె కూలిన ఘటనలో ఒక మహిళ మృతి చెందింది. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలో మంగళవారం వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుడు మరణించినట్లు తేలింది. భారీ వర్షాలకు ప్రకాశం జిల్లాలో 28 రూట్లలో 113 సర్వీసులను ఆర్టీసీ రద్దు చేసింది. విజయనగరం జిల్లాలో 33, పశ్చిమ గోదావరి జిల్లాలో 14 ఇళ్లు, విశాఖ జిల్లాలో 4, శ్రీకాకుళం జిల్లాలో 5 ఇళ్లు నేలమట్టమయ్యాయి. వైఎస్సార్ జిల్లాలో 17 ఇళ్లు దెబ్బతిన్నాయి. విజయనగరం జిల్లాలో పౌరసరఫరాల గోడౌన్ కూలి పోవడంతో 250 టన్నుల పీడీఎస్ బియ్యం తడిసి ముద్దయ్యాయి.
 
 తల్లడిల్లిన ప్రకాశం..
 వర్ష బీభత్సంతో ప్రకాశం జిల్లా తల్లడిల్లిపోయింది. జిల్లాలో 57.30 మిల్లీ మీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. ఒంగోలులో అత్యధికంగా 34 సెంటీమీటర్లు రికార్డైంది. జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం 40 వేల ఎకరాల్లో పత్తిపంట, 1500 ఎకరాల్లో రాగిపంట, 25 వేల ఎకరాల్లో మిర్చి, 8 వేల ఎకరాల మొక్కజొన్న, 5 వేల ఎకరాల వరి, 1250 ఎకరాల్లో పొగాకు నారుమళ్లు దెబ్బతిన్నాయి. అనధికారిక లెక్కల ప్రకారం పంటల నష్టం అంతకంటే చాలా ఎక్కువగానే ఉందని తెలుస్తోంది. ఒక్క పత్తి పంటే దాదాపు 75 వేల ఎకరాల్లో నష్టపోయినట్టు తెలుస్తోంది. చీరాలలో మూడు చేనేత కార్మికుల కాలనీలు పూర్తిగా జలమయమయ్యాయి. ఒంగోలు నగరంలో 50 కాలనీలు జలమయమయ్యాయి. విద్యుత్ సబ్‌స్టేషన్లలోకి భారీగా వర్షం నీరు చేరడంతో విద్యుత్తు సరఫరా నిలిపివేశారు. జిల్లాలో భారీ వర్షాలు ఇంత బీభత్సం సృష్టించినా అధికార యంత్రాంగం పత్తాలేకుండా పోయింది. జిల్లాలో ఉన్నతాధికారుల్లో అత్యధికులు హైదరాబాద్‌లో బుధవారం రాత్రి జరిగిన మంత్రి మహీధర్ రెడ్డి కుమార్తె వివాహానికి వెళ్లిపోవడంతో సహాయక చర్యలపై పర్యవేక్షణ కొరవడింది. దీంతో ఒంగోలు జయప్రకాష్ కాలనీ, నెహ్రూనగర్ వాసులు జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. మరోవైపు భారీ వర్షాలతో దెబ్బతిన్న ప్రాంతాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సహాయక చర్యలు చేపట్టింది. ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి వర్ష బాధితులకు బుధవారం రాత్రి భోజన వసతి కల్పించారు.
 
 గుంటూరు.. పంట చేల నిండా నీరే..
 గుంటూరు జిల్లాలో బుధవారం 3.7 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. బాపట్లలో గరిష్టంగా 11.9 సెం.మీ. వర్షపాతం రికార్డైంది. దీంతో నిజాంపట్నం, నగరం, రేపల్లె, బాపట్ల, కర్లపాలెం, చెరుకుపల్లి మండలాల్లోని 90 వేల ఎకరాల్లో నీరు నిండా నిలబడి ఉంది. దీంతో వరి, వేరుశనగ, కంది పంటలు దెబ్బతినే దశలో ఉన్నాయి. తాడికొండ మండలంలోని కంతేరు ప్రాంతంలో 1500 ఎకరాల్లో సాగులో ఉన్న టమోటా, చిక్కుడు, బెండ పంటలు దెబ్బతిన్నాయి. కృష్ణా జిల్లాలో కోడూరు, ముదినేపల్లి, మచిలీపట్నం, కృత్తివెన్ను మండలాల్లో 1500 ఎకరాల్లో వరి నీటమునిగింది. పల్లపు ప్రాంతాల్లో సాగు చేసిన దాదాపు పదివేల ఎకరాల పత్తి పొలాల్లోకి నీరు చేరింది.
  

విజయనగరం జిల్లాలో 3000 ఎకరాల్లో వరి, మొక్కజొన్న, పత్తి పంటలు  నీట మునిగాయి. 33 తాటాకు, పూరిళ్లు నేల మట్టమయ్యాయి. భోగాపురం మండలం రావాడ నుంచి తూడెం వెళ్లే ఆర్‌అండ్‌బీ రహదారి వద్ద కల్వర్టు కొట్టుకు పోవడంతో 20 గ్రామాలకు రాకపోకలు నిలిచి పోయాయి. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ, రాజమండ్రి నగరాలతో పాటు పట్టణాలు, మండలాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. 75 వేల ఎకరాల్లో వర్షాల కారణంగా నేలకొరిగిందని వ్యవసాయాధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. సుమారు 25 వేల ఎకరాల్లో పత్తి పంట వర్షపునీటిలో మునిగిపోయింది. కోనసీమలో లోతట్టులో ఉన్న సుమారు 150 కాలనీలు నీట మునిగాయని ప్రాథమికంగా అంచనా వేశారు. పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా సుమారు 30 వేల ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది. 2,500 ఎకరాల్లో పొగాకు నాట్లు కుళ్లిపోతున్నారుు. విశాఖ జిల్లాలో సుమారు 20వేల ఎకరాల్లో వరి, చెరకు పంటలు నీటమునిగాయి.
 
 దెబ్బతిన్న వేరుశెనగ..
 అనంతపురం జిల్లాలో 1250 ఎకరాల్లో వేరుశనగ పంట దెబ్బతిన్నట్లు సమాచారం. కర్నూలు జిల్లా చాగలమర్రి, వెలుగోడు, మహానంది, ఆత్మకూరు, రుద్రవరం, బండిఆత్మకూరు తదితర మండలాల్లో 10వేల ఎకరాల్లో పైర్లు దెబ్బతిన్నాయి. ఆళ్లగడ్డలో మిద్దె కూలిన ఘటనలో ఒక మహిళ మృతి చెందింది. ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో 40వేల క్వింటాళ్ల పత్తి వర్షంలో పూర్తిగా తడిచిపోవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. వైఎస్సార్ జిల్లాలో వర్షాలకు దాదాపు 30 వేల ఎకరాల్లో పెద్దముడియం, రాజుపాలెం, వేంపల్లె మండలాల్లో బుడ్డ (పప్పు) శనగ మోసు దశలోనే కుళ్లిపోవడంతో రూ. 6 కోట్లకు పైగా నష్టం సంభవించింది.
 
 శ్రీకాకుళంలో 80 గ్రామాలు జల దిగ్బంధం
 అనధికార అంచనాల ప్రకారం శ్రీకాకుళం జిల్లాలో సుమారు 1.25 లక్షల ఎకరాల్లో వరి చేలు నీట మునిగినట్టు సమాచారం. ఇవి కాకుండా వేలాది ఎకరాల్లోని పత్తి, చెరుకు, అరటి తదితర పంటలకు కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. సుమారు 80 గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ని బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోయాయి. సంతబొమ్మాళి మండలంలో మంగళవారం వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుడు మరణించినట్లు తేలింది. శ్రీపొట్టిశ్రీరాములునెల్లూరు జిల్లాలో పోటెత్తి వచ్చిన వరదనీటితో తోటపల్లిగూడూరు మండలం సౌత్‌ఆములూరు నుంచి విలుకానుపల్లి వరకు సుమారు 3 కిలో మీటర్ల మేర కోడూరు రహదారి నీట మునిగిపోయింది.
 
 మార్కెట్ యార్డులో తడిసిపోయిన ధాన్యం..
 కరీంనగర్, జగిత్యాల, హుస్నాబాద్ మార్కెట్ యార్డుకు తెచ్చిన ధాన్యంతోపాటు చాలా చోట్ల ధాన్యం కుప్పలు తడిసిపోయాయి. జమ్మికుంట మార్కెట్లో మధ్యాహ్నం వర్షం కురవగా అధికారులు టార్పాలిన్లు అందించకపోవడంతో రెండు వేల బస్తాల పత్తి తడిసి ముద్దయింది. కరీంనగర్ మార్కెట్లో వ్యాపారులు కొనుగోలుకు ముందుకు రాకపోవడంతో మూడు రోజులుగా ధాన్యం, మొక్కజొన్న బస్తాలు అలాగే ఉండిపోయి వర్షానికి తడిసిపోయాయి. నిజాంసాగర్, పిట్లం, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్, బాన్సువాడ మండలాల్లో కురిసిన వర్షానికి కోతకొచ్చిన వరి పంటకు నష్టం వాటిల్లింది. నిజామాబాద్ మార్కెట్ యార్డులో కుప్పలుగా పోసిన మొక్కజొన్న తడి సిపోయింది. ఖమ్మం జిల్లాలో ప్రధానంగా పత్తి, మొక్కజొన్న, పొగాకు పంటలకు నష్టం వాటిల్లింది. రంగారెడ్డి జిల్లాలో వర్షాలకు పరిగి, తాండూరు, మేడ్చల్, ఇబ్రహీంపట్నం, శంషాబాద్, చేవెళ్ల మండలాల్లో వాగులు వంకలు పొంగిపొర్లాయి. జనజీవనం స్తంభించింది. నల్లగొండ జిల్లాలో 1.75 లక్షల ఎకరాల్లో పత్తి పంటలు దెబ్బతిన్నట్లు అంచనా.
 
 వర్షం కారణంగా రూటుమారిన సీఎం కాన్వాయ్
 బుధవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ చౌరస్తా, రాజ్‌భవన్ రోడ్డులో వరదనీరు చేరడంతో ముఖ్యమంత్రి కాన్వాయ్ రూటు మారింది. సచివాలయం నుంచి సీఎం యథావిధిగా నెక్లెస్‌రోడ్డు నుంచి ఖైరతాబాద్ చౌరస్తా, రాజ్‌భవన్ మీదుగా క్యాంపు కార్యాలయానికి సాయంత్రం బయల్దేరారు. అయితే ఆ మార్గం వర్షం నీటితో పోటెత్తడంతో సచివాలయం నుండి నెక్లెస్‌రోడ్డు, సంజీవయ్యపార్కు, బేగంపేట మీదుగా ఆయన కాన్వాయ్ క్యాంపు కార్యాలయానికి చేరుకుంది. కాగా, అల్పపీడన ప్రభావంతో మూడురోజులుగా విడవకుండా కురుస్తున్న వానతో రాష్ట్ర రాజధానిలో జనజీవనం అస్తవ్యస్తమైంది.  
 
 కొనసాగుతున్న అల్పపీడనం
 సాక్షి, విశాఖపట్నం : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాన్ని ఆనుకొని స్థిరంగా కొనసాగుతోంది. రానున్న 24 గంటల్లో అల్పపీడనం భూభాగం మీదకు వచ్చే అవకాశాలున్నాయని విశాఖలోని తుపాను హెచ్చరిక కేంద్రం అధికారులు తెలిపారు. రాగల 24 గంటల్లో కోస్తాంధ్రలోని చాలా ప్రాంతాల్లో విస్తారంగా, ఉత్తరకోస్తాలో భారీగా వర్షాలు పడతాయని అంచనా వేశారు.
 
 అప్రమత్తంగా ఉండాలి: సీఎం
 సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. బంగాళాఖాతంలో అల్పపీడనం నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బుధవారం ఆయన అధికారులతో సమీక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement