రిటైర్మెంట్, పదవీ విరమణ తరువాతి జీవితాన్ని ప్రశాంతంగా, సంతోషంగా గడపొచ్చని దాదాపు అందరూ భావిస్తారు. నిజానికి ఇది అవసరం కూడా. కానీ ఇండియాలో పదవీ విరమణ తరువాత చాలా మందిని డిప్రెషన్ బాధిస్తోందట. శూన్యత, ఒంటరితనం, నేను ఎందుకూ పనికి రానా? అనే ఆందోళన క్లినికల్ డిప్రెషన్‌కు దారితీస్తోందని సమాచారం. దీన్నే రిటైర్మెంట్ డిప్రెషన్ అంటున్నారు. ఒకప్పుడు చాలా చురుకుగా, ఉత్సాహంగా ఉండేవారు కూడా రిటైర్‌మెంట్ తరువాత చాలా స్వల్ప భావోద్వేగాలను కూడా తట్టుకోలేక పోతున్నారని నిపుణులు చెబుతున్నారు. మరి దీన్నుంచి బయటపడాలంటే ఏం చేయాలి?
రిటైర్మెంట్ డిప్రెషన్‌కి అనేక సమస్యలు, సవాళ్ల వల్ల ఏర్పడుతుంది. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు, మనవలు, మనవరాళ్లతో కాలం గడుపుతూ, ఉన్న చిన్నకొద్దిపాటి, వ్యవసాయాన్ని, గొడ్డూ, గోదా సంరక్షణ, లేదా వ్యాపారం నిర్వహణతోపాటు సమాజంలో అందరూ సామూహికంగా కలిసి ఉండటం లాంటి వల్ల పదవీ విరమణ ద్వారా వచ్చిన ఆకస్మిక మార్పులను సర్దుబాటు చేసుకునేలా ఉండేవి. అయితే ఉద్యోగ విరమణ తరువాత వయసుతో వచ్చే సమస్యలతోపాటు, ఉద్యోగ రీత్యా పిల్లలు ఎక్కడో విదేశాల్లో ఉండటంతో విచారం, ఆందోళన, నిస్సహాయత వారిని చుట్టుముడుతోంది. అయితే సరైన ప్రణాళిక, నిపుణుల సలహాతో వీటన్నింటినుంచి బయటపడవచ్చు అంటున్నారు మానసిక వైద్యులు.
రిటైర్మెంట్ డిప్రెషన్‌ను ఎలా గుర్తించాలి
అలసట, ఏ పనీ చేయాలని అనిపించకపోవడం, నిస్సత్తువగా, విచారంగా అనిపించడం, ఒంటరివాళ్లమనే ఆందోళన లాంటి లక్షణాలు కనిపిస్తాయంటున్నారు కౌన్సెలింగ్ సైకాలజిస్ట్ నిష్థా జైన్. అలాగే ఆ ఉద్యోగం తప్ప మరే హాబీలు లేకపోవటం కూడా రిటైర్మెంట్ డిప్రెషన్‌కు ప్రధాన కారణమంటారు.
ఉద్యోగ విరమణ తరువాత ప్రతీ నెలా వచ్చే జీతం రాదు కేవలం పెన్షన్‌మీదే ఆధారపడాలి. దీంతో ఆర్థికంగా ఎలా అందోళన మొదలవుతుంది.(పెన్షన్ సరిపడా వచ్చేవారి పరిస్థితి వేరు) ఆరోగ్య సమస్యలు , ఒంటరితనం ఈ పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తాయి. వీటికి తోడు రక్తపోటు, మధుమేహం, మతిమరుపులాంటివి కూడా మరింత ఆజ్యం పోస్తాయి. దీంతో స్వేచ్ఛగా, రిలాక్స్‌గా ఉండాల్సిన వారిలోనిరాశ ఏర్పడుతుంది. పాత జీవితాన్ని కోల్పోయా మనే బాధ, ఒత్తిడి పెరుగుతాయి. రోజంతా ఇంట్లో ఉండటం వల్ల కుటుంబ సభ్యులతో సంబంధాలు దెబ్బతింటాయనే ఆందోళన చెందుతారని చెబుతున్నారు మానసిక వైద్యులు
మరి ఏం చేయాలి?
పదవీ విరమణ చేయడానికి ముందే ఆలోచనాత్మక కార్యాచరణ ప్రణాళిక ఉండాలి. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలు, దినచర్యలు, అభిరుచులు , రిటైర్మెంట్ తర్వాత ఏం చేయాలి? ఆర్థిక అవసరాల నిమిత్తం ఏం చేయాలి లాంటి యాక్షన్ ప్లాన్ కచ్చితంగా ఉండాలి.
పలు సామాజిక కార్యకలాపాల్లో భాగస్వామ్యం కావాలి. ఆరోగ్యకరమైన జీవనశైలిని ఏర్పర్చుకోవాలి. అంతకుముందే ఏదైనా వ్యాధి ఉంటే క్రమం తప్పకుండా మందులు వాడటం, వైద్య పరీక్షలపై దృష్టిపెట్టాలి.
క్రమం తప్పకుండా యోగా, ధ్యానం, నడక లాంటి వ్యాయామాలు చేయాలి. సమతుల ఆహారం తీసుకోవాలి. చక్కటి పుస్తకాలను చదవాలి.
అనుభవాలను పంచుకోవడానికి, ఒంటరితనాన్నిబయటపడటానికి సపోర్ట్ గ్రూపుల్లో చేరాలి. అందరితనూ కలిసిపోయేందుకు ప్రయత్నించాలి.
వీలైనన్ని సార్లు ఆధ్యాత్మిక , లేదా పర్యాటకు ప్రదేశాలకు వెళ్లేలా ప్లాన్ చేసుకోవాలి.
కుటుంబ సభ్యులతో ముఖ్యంగా జీవిత భాగస్వామితో మరింత దగ్గరగా వ్యవహరించాలి. కుమార్తెలు, కోడళ్లు, కొడుకులపట్ల విశాల దృక్పథంతో వ్యవహరించాలి. పరస్పరం మనసు విప్పి, మాట్లాడుకోవాలి.
చిన్న పిల్లలతో ఎక్కువ సమయం గడిపితే మనసు ఉల్లాసంగా ఉంటుంది. ప్రశాంతంగా ఉంటుంది.
మనకువచ్చిన విద్యను వారికి నేర్పించవచ్చు. అపార్టమెంట్లలోని పిల్లలకు చెస్, పెయింటింగ్, ఇలా ఏదో ఒకటి నేర్పిస్తూ వాళ్లతో సమయం గడపాలి.
అన్నింటికంటే ముఖ్యంగా పరిస్థితులను అవగాహన చేసుకొని, అర్థం చేసుకొని పదవీ విరమణ అనేది ఒక ముఖ్యమైన జీవిత మార్పు అని గమనించి ముందుకు సాగిపోవాలి.
Comments
Please login to add a commentAdd a comment