* రాష్ట్రంలో నాలుగు రోజులుగా వాన బీభత్సం
* 12 లక్షల ఎకరాల్లో నీట మునిగిన పైర్లు
* కళింగపట్నంలో 32 సెం.మీ., ఒంగోలులో 31 సెం.మీ. వర్షపాతం
* 12 మంది మృతి, చెరువులకు గండ్లు .. ఊళ్లకు రాకపోకలు బంద్
* మరిన్ని చెరువులకు ప్రమాదం.. భయం గుప్పిట్లో స్థానికులు
* హైదరాబాద్‌లో మునిగిన లోతట్టు ప్రాంతాలు
* హైదరాబాద్‌లో మునిగిపోయిన లోతట్టుప్రాంతాలు.. ట్రాఫిక్ ఇక్కట్లు
* నల్లగొండ, కరీంనగర్, అనంతపురం తదితర జిల్లాల్లో వడగండ్ల వానతో భారీ నష్టం
సాక్షి, హైదరాబాద్: కుండపోత వర్షాలు, వరదలతో ఆదిలోనే ఈశాన్య రుతుపవనాలు రాష్ట్రాన్ని వణికిస్తున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటం, ఈశాన్య రుతుపవనాలు బలోపేతం కావడంతో గత మూడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో కోస్తా, తెలంగాణ, రాయలసీమ అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జనావాస ప్రాంతాలు నీటి మడుగులను తలపిస్తున్నాయి. చెరువులు, కాల్వలకు గండ్లు పడి రహదారులు చెరువుల్లా మారాయి. పలు గ్రామాలకు బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.
కొన్ని చోట్ల బస్సులు, లారీలు సైతం వరద ఉధృతిలో కొట్టుకుపోగా.. స్థానికులు, అధికారుల తక్షణ స్పందనతో బాధితులు బతికి బయటపడ్డారు. గురువారం అత్యధికంగా శ్రీకాకుళం జిల్లా కళింగపట్నంలో 32 సెం.మీ., ప్రకాశం జిల్లా ఒంగోలులో 31 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం తదితర జిల్లాల్లో వాగులు, వంకలు రహదారులపై ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వంశధార, బాహుదా నదుల వరదతో శ్రీకాకుళం జిల్లాలో రైలు మార్గంపై నీరు చేరింది. వర్షాలతో గుంటూరు జిల్లా కోటప్పకొండ ఘాట్‌రోడ్డును అధికారులు మూసివేశారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో వర్షాలవల్ల ట్రాఫిక్ స్తంభించింది. నల్లగొండ, కరీంనగర్, అనంతపురం తదితర జిల్లాల్లోనూ వడగండ్ల వానతో నష్టం వాటిల్లింది.
జనజీవనం అస్తవ్యస్తం: కుండపోత వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా జనజీవనం స్తంభించింది. వర్షాలతో వాగుల్లో కొట్టుకుపోవడం, ఇళ్ల గోడలు కూలిపోవడం లాంటి కారణాలవల్ల 12 మంది మరణించారు. అధికారిక సమాచారం ప్రకారం ప్రకాశం జిల్లాలో వాగులో కొట్టుకుపోయి నలుగురు, హైదరాబాద్‌లో ఇంటిగోడ కూలిపోయి ముగ్గురు మృత్యువాత పడ్డారు. గుంటూరులో ఇద్దరు, కర్నూలులో ఒకరు, విజయనగరంలో ఒకరు, తూర్పు గోదావరిలో ఒకరు వర్షాలవల్ల చనిపోయారు. పెద్ద సంఖ్యలో ఇళ్లు కూలిపోయి ప్రజలు నిరాశ్రయులయ్యారు. గురువారం ఉదయానికి హైదరాబాద్‌కు అందిన ప్రాథమిక అధికారిక సమాచారం ప్రకారం 1,884 ఇళ్లు కూలిపోయాయి. ‘సాక్షి’ క్షేత్ర స్థాయిలో సేకరించిన సమాచారం ప్రకారం... వానలకు పాక్షికంగాగాని, పూర్తిగా గాని కూలిన ఇళ్లు 8477 దాకా ఉన్నాయి. పొలాల్లో నీరు ఉండటంతో కూరగాయలు కోయలేకపోతున్నారు. మార్కెట్‌లో ఆకుకూరలు, కూరగాయలు కొరత ఏర్పడింది. కూరగాయల ధరలు భగ్గుమని పెరిగాయి. వివిధ జిల్లాల్లో కిలో టమోటాలు రూ.50 పలుకుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్‌లో కూరగాయల కొరత ఏర్పడింది. మొన్నటి వరకూ కిలో రూ. 20 ఉన్న బెండ ఇప్పుడు రూ. 30 అమ్ముతున్నారు.
నీటమునిగిన పంటలు...
ఎడతెరపిలేని కుండపోత వర్షాలతో లక్షలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. పలు ప్రాంతాల్లో కేవలం 24 గంటల వ్యవధిలోనే 20 - 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుండటంతో పంట చేలు నీటితో నిండిన చెరువులను తలపిస్తున్నాయి. పలు జిల్లాల్లో కోతకొచ్చిన, పెరికి వోదెలు వేసిన వేరుశనగ నీటిలో నానుతోంది. కోతకొచ్చిన, కోసి కళ్లాల్లో, మార్కెట్ యార్డుల్లో నిల్వ చేసిన పత్తి పూర్తిగా నానిపోయింది. ఇలా నానిపోయిన పత్తి, వేరుశెనగ ఇక ఎందుకూ పనికిరాదని రైతులు కుంగిపోతున్నారు. కోత దశకు వచ్చిన వరి, మొక్కజొన్న, కంది పంటలు నేలవాలిపోయి నీటిలో నానుతున్నాయి.
వేరుశెనగ, వరి, కంది, మొక్కజొన్న పైర్లతో వెంటనే నీరు ఇంకిపోకపోతే మొలకలు వస్తాయని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. 6.25 లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగాయని గురువారం ఉదయం వరకూ అధికారికంగా అందిన ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో జరిగిన నష్టం ఇందుకు రెట్టింపు ఉంటుందని రైతులు అంటున్నారు. గుంటూరు, కరీంనగర్, వరంగల్ తదితర జిల్లాల్లో మార్కెట్ యార్డుల్లో నిల్వ చేసిన పత్తి బస్తాలు తడిసి ముద్దకావడంతో రైతులు లబోదిబో మంటున్నారు.
రాజధానిలో మోకాళ్లలోతు వరదనీరు
వర్షాలకు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో జనజీవనం అస్తవ్యస్తమైంది. జీహెచ్‌ఎంసీ కేంద్ర కార్యాలయం వద్ద 3.4 సెంటీమీటర్లు, రాజేంద్రనగర్ ప్రాంతంలో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు.
గోడ కూలి ముగ్గురి మృతి..
జీవనోపాధికి హైదరాబాద్‌కు వచ్చిన ఒక కుటుంబంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం తీవ్రమైన విషాదాన్ని నింపింది. విజయనగర్ కాలనీ, కోటమ్మబస్తీలో ప్రభుత్వ బీఈడీ కళాశాల గోడను ఆనుకుని చిన్న పూరి గుడిసెలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందినగోతూరి మావుళ్లు (30) కుటుంబం నివసిస్తోంది. గురువారం ఉదయం ఆ గోడ కూలి పోవడంతో మావుళ్లు తల్లి పార్వతి (55), భార్య లక్ష్మి (26), చిన్న కుమారుడు జనార్దన్ (5) ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబసభ్యుల్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి, కేంద్ర కమిటీ సభ్యులు మతీన్ ముజదాది, పార్టీ మైనార్టీ విభాగం కన్వీనర్ రెహ్మాన్, నగర కన్వీనర్ ఆదం విజయ్‌కుమార్ తదితరులు పరామర్శించారు.