సాక్షి, అమరావతి: కరోనా కష్టకాలంలో మొక్కజొన్న రైతులకు బాసటగా నిలవాలని ప్రభుత్వం నిర్ణయించింది. మార్కెట్‌లో మొక్కజొన్న ధర క్వింటాల్‌కు రూ.1,450 నుంచి రూ.1,500 వరకు మాత్రమే పలుకుతోంది. ఈ పరిస్థితుల్లో రైతులు దళారుల బారినపడి నష్టపోకుండా చూసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాలకు అనుబంధంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ నెల 19 (సోమవారం) నుంచి వాటిద్వారా కొనుగోళ్లకు శ్రీకారం చుట్టనుంది. ఇక్కడ విక్రయించే మొక్కజొన్నకు క్వింటాల్‌కు రూ.1,850 చొప్పున కనీస మద్దతు ధర చెల్లించేలా చర్యలు చేపట్టింది. ఈ ఏడాది రబీలో 1.76 లక్షల హెక్టార్లలో రైతులు మొక్కజొన్న సాగు చేశారు. పంట బాగా పండటంతో హెక్టారుకు 8,144 కేజీల చొప్పున 14.33 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఇందులో కనీసం 3.96 లక్షల టన్నుల మొక్కజొన్నను కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించి మార్క్‌ఫెడ్ ద్వారా ఏర్పాట్లు చేసింది. ఈ క్రాప్ ఆధారంగా ఇప్పటికే ఆర్‌బీకేల్లో వివరాలు నమోదు చేసుకున్న రైతుల నుంచి మొక్కజొన్న కొనుగోళ్లు జరుగుతాయి.
రైతుల్ని ఆదుకున్న ప్రభుత్వం
మొక్కజొన్నను సాధారణంగా కోళ్ల ఫారాల్లో మేతగా వినియోగిస్తారు. పిండి పదార్థాల తయారీతో పాటు ఇథనాల్, ఆల్కహాల్ తయారీలోనూ మొక్కజొన్నను వినియోగిస్తారు. గతేడాది పంట చేతికొచ్చే సమయంలో కరోనా విరుచుకుపడింది. ఆ సమయంలో పౌల్ట్రీ రంగం కుదేలైంది. మొక్కజొన్నను ముడి సరుకుగా వినియోగించే ఇతర పరిశ్రమలు సైతం దెబ్బతిన్నాయి. పొరుగు రాష్ట్రాలకు ఎగుమతులు లేకపోవడంతో వ్యాపారుల వద్ద నిల్వలు పేరుకుపోయాయి. దీంతో మార్కెట్ లో మొక్కజొన్న రేటు ఒక్కసారిగా పడిపోయింది. క్వింటాల్‌కు రూ.1,300 నుంచి రూ.1,400కు మించి ధర లభించని దుస్థితి ఏర్పడింది. ఆ పరిస్థితుల్లో రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 1,500కు పైగా కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కనీస మద్దతు ధర రూ.1,760 చొప్పున చెల్లించి 61,445 మంది రైతుల నుంచి 4,16,140 మెట్రిక్ టన్నులను సేకరించింది. రైతులకు రూ.732 కోట్లు చెల్లించింది.
నేటినుంచి కొనుగోళ్లు ప్రారంభిస్తాం
ఆర్‌బీకేలకు అనుబంధంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాం. సోమవారం నుంచి కొనుగోళ్లకు శ్రీకారం చుడుతున్నాం. కనీస మద్దతు ధరకు మొక్కజొన్నను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదు.
– ప్రద్యుమ్న, ఎండీ, మార్క్‌ఫెడ్
Comments
Please login to add a commentAdd a comment