రైతన్నకు ‘మద్దతు’ | Andhra Pradesh Govt Support For Farmers Minimum support price | Sakshi
Sakshi News home page

రైతన్నకు ‘మద్దతు’

Published Tue, Nov 22 2022 3:36 AM | Last Updated on Tue, Nov 22 2022 8:24 AM

Andhra Pradesh Govt Support For Farmers Minimum support price - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అధికారం చేపట్టినప్పటి నుంచి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం అన్నదాతకు అండగా నిలుస్తోంది. ఏటా ఇన్‌పుట్‌ సబ్సిడీ అందించడంతోపాటు, ఉచిత పంటల బీమా వంటి పలు సదుపాయాలు కల్పించింది. ఆర్బీకేల ద్వారా నిరంతరం వారికి అవసరమైన సేవలు అందిస్తోంది. మార్కెట్‌లో రైతు పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధర లభించేలా చూస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా కనీస మద్దతు ధర దక్కని ఖరీఫ్‌ ఉత్పత్తుల కొనుగోలుకు సన్నాహాలు చేస్తోంది. ధాన్యంతో పాటు అన్ని రకాల ఉత్పత్తులకు మద్దతు ధర లభించేలా చర్యలు చేపడుతోంది. 

ధాన్యం కాకుండా ఈ మూడేళ్లలో ప్రభుత్వం 4.27 లక్షల మంది రైతుల నుంచి రూ. 7,157 కోట్ల విలువైన 20.18 లక్షల టన్నుల వివిధ రకాల పంట ఉత్పత్తులను వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇందులో మార్కెఫెడ్‌ ద్వారా 3.76 లక్షల మంది రైతుల నుంచి రూ.5,023 కోట్ల విలువైన 16.34 లక్షల టన్నుల ఉత్పత్తులను సేకరించింది.

ప్రధానంగా 2019–20 సీజన్‌లో 2.24 లక్షల మంది రైతుల నుంచి రూ. 2,231 కోట్ల విలువైన 8.56 లక్షల టన్నులు, 2020–21 సీజన్‌లో 1.20 లక్షల మంది రైతుల నుంచి రూ.2,255 కోట్ల విలువైన 6.46 లక్షల టన్నులు సేకరించింది. 2022–23లో ఇప్పటివరకు 32 వేల మంది నుంచి రూ. 537 కోట్ల విలువైన 1.32 లక్షల టన్నుల విలువైన ఉత్పత్తులను సేకరించింది. గత సీజన్‌లో మాదిరిగానే ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి మొక్కజొన్న, సజ్జలు, వేరుశనగ కొనుగోలుకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది.

ఖరీఫ్‌లో వేరుశనగ 13.34 లక్షల ఎకరాల్లో సాగవగా, 4.87 లక్షల టన్నులు దిగుబడి వస్తుందని అంచనా వేశారు. మొక్కజొన్న 3.21లక్షల ఎకరాల్లో సాగవగా, 6.60 లక్షల టన్నులు, సజ్జలు  52 వేల ఎకరాల్లో  సాగవగా, 50 వేల టన్నులు దిగుబడి వస్తుందని అంచనా. మొక్కజొన్నకు టన్నుకు రూ.1,962, సజ్జలకు రూ.2,350, వేరుశనగకు రూ.5,850 చొప్పున కనీస మద్దతు ధరలను ప్రభుత్వం ప్రకటించింది.

మార్కెట్‌లో వీటి ధరలు ప్రస్తుతం ఆశాజనకంగానే ఉన్నాయి. సజ్జలు మినహా మిగిలిన రెండింటి ధరలు ఎమ్మెస్పీకి దీటుగానే ఉన్నాయి. నాణ్యమైన (ఫైన్‌న్‌క్వాలిటీ) సజ్జలు, మొక్కజొన్నకు మార్కెట్‌లో టన్నుకు రూ.2 వేలకు పైగా ధర పలుకుతోంది. వేరుశనగ రూ.6 వేల నుంచి రూ.6,500 వరకు పలుకుతోంది.

పంట చేతికొచ్చే సమయానికి ధరలు ఏమాత్రం తగ్గినా వెంటనే మార్కెట్‌ ఇంటర్‌వెన్షన్‌ కింద జోక్యం చేసుకొని ధరలు పడిపోకుండా రైతులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం మార్క్‌ఫెడ్‌ ద్వారా ఈ మూడు ఉత్పత్తుల కొనుగోలుకు సన్నాహాలు చేస్తోంది. 12వేల టన్నులు సజ్జలు, 66 వేల టన్నుల మొక్కజొన్న, 1.21 లక్షల టన్నుల వేరుశనగ కొనాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ఇప్పటికే ఆర్బీకేల ద్వారా రైతుల వివరాల నమోదు ప్రక్రియ చేపట్టింది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement